ఆసియాలో రెండో స్థానంలో కొనసాగుతున్న అంబానీ.., మొదటి స్థానంలో ఉన్నది కూడా భారతీయుడే..!
భారత్ కార్పొరేట్ రంగంలో అంబానీ-అదానీ మధ్య సాగుతున్న రేస్ ఆసక్తికరంగా ఉంటుంది.
By: Tupaki Desk | 17 April 2026 6:19 PM ISTభారత్ కార్పొరేట్ రంగంలో అంబానీ-అదానీ మధ్య సాగుతున్న రేస్ ఆసక్తికరంగా ఉంటుంది. హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత భారీ ఒడిదుడుకులను ఎదుర్కొన్న గౌతమ్ అదానీ మళ్లీ అద్భుతంగా పుంజుకొని ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలవడం సంచలనంగా మారింది. భారతీయ వ్యాపార సామ్రాజ్యంలో అగ్రస్థానం కోసం జరిగే పోరులో గౌతమ్ అదానీ పైచేయి సాధించారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.., రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి అదానీ గ్రూప్ ఛైర్మన్ ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. గతేడాది ఎదురైన చట్టపరమైన, ఆర్థికపరమైన సవాళ్లను అధిగమించి అదానీ ఈ స్థాయికి చేరుకోవడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.
అదానీ వర్సెస్ అంబానీ..
ప్రస్తుత మార్కెట్ విలువల ప్రకారం.. ఇద్దరు దిగ్గజాల నెట్‌వర్త్ వివరాలు పరిశీలిస్తే..
గౌతమ్ అదానీ: సుమారు $92.6 బిలియన్ల ఆస్తితో ఆసియాలో 1వ స్థానంలో, ప్రపంచ కుబేరుల జాబితాలో 19వ స్థానంలో నిలిచారు.
ముకేశ్ అంబానీ: $90.8 బిలియన్ల నికర ఆస్తితో ఆసియాలో 2వ స్థానానికి పడిపోయారు. ప్రపంచ స్థాయిలో ఆయన 20వ స్థానంలో కొనసాగుతున్నారు.
కేవలం కొన్ని బిలియన్ డాలర్ల వ్యత్యాసమే ఉన్నప్పటికీ, అదానీ గ్రూప్ షేర్లు మళ్లీ పుంజుకోవడం ఆయన సంపద పెరగడానికి ప్రధాన కారణమైంది.
తిరుగులేని పునరాగమనం..
2023 ప్రారంభంలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక అదానీ సామ్రాజ్యాన్ని కుదిపేసింది. అప్పట్లో ఆయన ఆస్తి భారీగా ఆవిరైపోయింది. సంపన్నుల జాబితాలో చాలా కిందికి పడిపోయారు. కానీ, 2024, 2025లో అదానీ గ్రూప్ చేపట్టిన వ్యూహాత్మక చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయి. సెబీ దర్యాప్తులో అదానీ గ్రూప్‌కు సానుకూల పరిణామాలు ఎదురుకావడం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది. పోర్టులు, విమానాశ్రయాలు, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్ల రంగంలో అదానీ గ్రూప్ దూకుడుగా ముందుకు వెళ్లడం షేర్ల ధరలు పెరగడానికి దోహదపడింది. అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను గడువు కంటే ముందే చెల్లించడం ద్వారా గ్రూప్ తన ఆర్థిక పటిష్టతను చాటుకుంది.
ముకేశ్ అంబానీ వ్యూహం ఏంటి?
ముకేశ్ అంబానీ కూడా తన రిలయన్స్ సామ్రాజ్యాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ముఖ్యంగా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. అయితే, రిలయన్స్ షేర్లు స్థిరంగా కొనసాగుతుండగా, అదానీ గ్రూప్ షేర్లు వేగంగా పెరగడం వల్ల ఈ స్థానాల్లో మార్పు చోటు చేసుకుంది. రాబోయే రోజుల్లో రిలయన్స్ రిటైల్ లేదా జియో ఐపీఓలకు వెళ్తే.. మళ్లీ అంబానీ అగ్రస్థానానికి వచ్చే అవకాశం లేకపోలేదు.
ప్రపంచ కుబేరుల జాబితాలో ‘మస్క్’ హవా
భారతీయ కుబేరుల మధ్య పోటీ ఇలా ఉంటే.., ప్రపంచ స్థాయిలో మాత్రం టెస్లా అధినేత ఎలన్ మస్క్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. సుమారు $656 బిలియన్ల భారీ నెట్‌వర్త్‌తో ఆయన ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. అంటే భారత కుబేరుల ఆస్తి కంటే మస్క్ ఆస్తి దాదాపు 7 రెట్లు ఎక్కువ ఉండడం గమనార్హం. జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ వంటి వారు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
అదానీ, అంబానీ వంటి పారిశ్రామికవేత్తలు ప్రపంచ వేదికపై అగ్రస్థానంలో ఉండడం భారత ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుంది. వీరిద్దరూ మౌలిక సదుపాయాలు, ఇంధనం, డిజిటల్ రంగాల్లో పెడుతున్న భారీ పెట్టుబడులు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఆసియా కుబేరుడిగా అదానీ మళ్ళీ కిరీటాన్ని దక్కించుకోవడం అనేది భారత కార్పొరేట్ రంగం స్థితిస్థాపకతకు నిదర్శనం.
