Begin typing your search above and press return to search.

టీడీపీలో గంటా ప్రకంపనలు...పార్టీ మారడం ఖాయం...?

విశాఖ జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతారా అన్నది చర్చకు వస్తోంది

By:  Tupaki Desk   |   22 Feb 2024 11:52 AM GMT
టీడీపీలో గంటా ప్రకంపనలు...పార్టీ మారడం ఖాయం...?
X

విశాఖ జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతారా అన్నది చర్చకు వస్తోంది. ఆయనను టీడీపీ హై కమాండ్ అయితే విజయనగరం జిల్లాకు షిఫ్ట్ చేయడానికి అన్నీ సిద్ధం చేసింది. చీపురుపల్లిలో నుంచి పోటీకి గంటాను పంపుతారు అని టాక్ నడుస్తూ వస్తోంది. అయితే అటువంటి ప్రచారం నిజమే అని గంటా స్పష్టం చేశారు.

విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను పార్టీ విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయమని కోరిందని దాని మీద ఆలోచించి చెప్పమంది అని అన్నారు. తాను తన పార్టీ నేతలు, అనుచరులు అభిమానుల్తో పాటు తన టీం తో చర్చించి ఏ సంగతీ చెప్పాల్సి ఉందని మీడియాకు ఆయన చెప్పారు. అయితే గంటా చెప్పిన మాటలను బట్టి చూస్తే ఆయన చీపురుపల్లి వెళ్లేందుకు సుముఖంగా లేరు అని అంటున్నారు.

తన రాజకీయ జీవితం అంతా విశాఖ జిల్లాలోనే సాగింది అని అన్నారు. తాను తొలిసారి అనకాపల్లి నుంచి పార్లమెంట్ కి వెళ్లాను అని ఆ పరిధిలోని చోడవరం, అనకాపల్లి అసెంబ్లీ స్థానాల నుంచి తాను పోటీ చేశాను అని గుర్తు చేశారు. అలాగే తాను విశాఖలో ఉండడం వల్ల విశాఖ నార్త్, భీమిలీ నుంచి పోటీ చేసి గెలిచాను అని గుర్తు చేశారు.

తన మొత్తం రాజకీయ జీవితం అంతా విశాఖ చుట్టూనే ముడిపడి ఉందని ఆయన చెబుతూ తాను విశాఖ జిల్లా నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా తేల్చి చెప్పారు. ఇక చీపురుపల్లి అన్నది విశాఖకు 150 కిలోమీటర్ల దూరంలో ఉందని అంత దూరం వెళ్ళి పోటీ చేయడం మీద కూడా ఆలోచించాల్సిందే అన్నారు. అక్కడ వైసీపీ నుంచి ఒక సీనియర్ నేత ఉన్నారని, ఆయన మీద పోటీ కోసం పార్టీ చూస్తోందని పరోక్షంగా బొత్స సత్యనారాయణ గురించి ప్రస్తావించారు.

అయితే గంటా చీపురుపల్లి వెళ్లబోరని అంటున్నారు. చీపురుపల్లికి గంటాకు ఎలాంటి సంబంధంలేదు. ఆయన ఓసీ కాపు. చీపురుపల్లిలో తూర్పు కాపులు ఉంటారు. వారంత బీసీలుగా ఉంటారు. అక్కడ వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణకు బాగా పట్టు ఉంది. ఆయన నాలుగు సార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచారు.

ఇక 2024లో మరోసారి పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఆయన గెలుపును అడ్డుకోవడం అందునా ఈ దశలో ఎక్కడ నుంచో గంటా వెళ్ళి అక్కడ ఎన్నికల లో పనిచేసి విజయం సాధించాలనుకోవడం కష్టమే అంటున్నారు. ఒక విధంగా చూస్తే ఓడీ సీటుని చూపించి బలి పశువుని చేస్తున్నారు అన్న ఆవేదన అయితే గంటాలో వ్యక్తం అవుతోంది. అదే విధంగా తనను విశాఖ జిల్లా రాజకీయాల నుంచి దూరం చేయాలని చూస్తున్నారన్న ఆవేదన ఆయనలో కనిపిస్తోంది.

ఈ నేపధ్యంలో ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. సీటు రాకపోతే ఎవరైనా పార్టీ మారుతారు అని పలు ఉదాహరణలు కూడా చెప్పుకొచ్చారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీలోకి మారడం అలాగే వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి టీడీపీ వైపు రావడం వంటివి చెబుతూ పార్టీ మారడం తప్పు కాదు అన్నట్లుగా ఆయన మాట్లాడారు.

దీనిని బట్టి చూస్తే గంటా పార్టీ మారుతారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఆయన గతంలో వైసీపీ వైపు చూసారు. కానీ అది అప్పట్లో కుదరలేదు. ఇపుడు ఆయన మళ్ళీ వైసీపీ వైపు చూసే చాన్స్ ఉందని అంటున్నారు. ఆయన కోరుకున్న భీమిలీ సీటు వైసీపీ ఇస్తే ఆయన పార్టీ మారే చాన్స్ ఉందని అంటున్నారు. అయితే అక్కడ మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఉన్నారు. చూడాలి మరి గంటా సీటు ఆయన పార్టీ మార్పు ఎలా ఉంటాయనంది మాత్రం ఆసక్తికరంగానే ఉంది. అలాగే గంటా చేసిన తాజా కామెంట్స్ టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.