Begin typing your search above and press return to search.

గంటా.. అటు తిరిగి.. ఇటు తిరిగి చివరకు!

గంటా శ్రీనివాసరావు పరిచయం అక్కర్లేని పేరు. ఈ కాపు నేత ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ ఓడిపోలేదు

By:  Tupaki Desk   |   19 March 2024 4:06 AM GMT
గంటా.. అటు తిరిగి.. ఇటు తిరిగి చివరకు!
X

గంటా శ్రీనివాసరావు పరిచయం అక్కర్లేని పేరు. ఈ కాపు నేత ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ ఓడిపోలేదు. 1999లో తొలిసారి టీడీపీ తరఫున అనకాపల్లి ఎంపీగా విజయం సాధించారు. 2004లో అదే పార్టీ తరఫున చోడవరం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2009లో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఘన విజయం దక్కించుకున్నారు. ఇక 2014లో టీడీపీలోకి వచ్చి భీమిలి నుంచి గెలుపొందారు. 2019 మళ్లీ నియోజకవర్గం మార్చి విశాఖ ఉత్తరం నుంచి గెలుపు బావుటా ఎగురవేశారు.

పార్టీ ఏదైనా, నియోజకవర్గం ఏదైనా ఓడిపోకుండా గెలుపొందడం గంటా శ్రీనివాసరావు స్పెషాలిటీ. కాంగ్రెస్‌ పార్టీ గాలి బలంగా వీచిన 2004, 2009 ఎన్నికల్లోనూ, వైసీపీ ప్రభంజనం వీచిన 2019 ఎన్నికల్లోనూ గంటా శ్రీనివాసరావు గెలుపును ఎవరూ ఆపలేకపోయారు. అలాంటి నేతకు ఈసారి మాత్రం ఇప్పటివరకు సీటు లభించలేదు.

గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం విశాఖ నార్త్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున భీమిలి నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం గంటాను విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు. చీపురుపల్లి నుంచి విద్యా శాఖ మంత్రి, రాష్ట్రంలోనే కీలక నేతల్లో ఒకరైన బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో చీపురుపల్లి నుంచి పోటీ చేయడానికి గంటా శ్రీనివాసరావు మొగ్గుచూపడం లేదు. అందులోనూ గంటా విశాఖపట్నం జిల్లాకు చెందిన నేత. ఇప్పటివరకు గంటా ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గాలు.. చోడవరం, అనకాపల్లి, భీమిలి, విశాఖ నార్త్‌ అన్నీ కూడా విశాఖపట్నం జిల్లాలోనివే. ఈ నేపథ్యంలో ఆయన వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీకి మొగ్గుచూపుతున్నారు.

కానీ చంద్రబాబు మాత్రం గంటాను చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని కోరుతున్నారు. ఏకంగా పక్క జిల్లాకు వెళ్లి పోటీ చేయాలని చంద్రబాబు కోరుతుండటాన్ని గంటా ఇష్టపడటం లేదని అంటున్నారు. చంద్రబాబు ఇప్పటివరకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను రెండు జాబితాల్లో ప్రకటించారు. ఈ క్రమంలో మొత్తం 128 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇంకా 16 అసెంబ్లీ స్థానాలకే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఇంతవరకు గంటా శ్రీనివాసరావు నియోజకవర్గంపై స్పష్టత రాలేదు.

మరోవైపు గంటా జనసేన పార్టీలోకి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు. మెగా ఫ్యామిలీతో, ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవితో అత్యంత సన్నిహిత సంబంధాలు గంటాకు ఉన్నాయి. గంటా తనకు నాగబాబు, పవన్‌ కళ్యాణ్‌ లా మరో తమ్ముడని స్వయంగా చిరంజీవే పలుమార్లు వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో గంటా జనసేన పార్టీలోకి వచ్చి భీమిలి నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. పొత్తులో భాగంగా భీమిలి సీటు జనసేన ఖాతాలో చేరింది. అక్కడ జనసేనకు పంచకర్ల సందీప్‌ ఇంచార్జిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయనే పోటీ చేశారు. మరోసారి పోటీకి పంచకర్ల సందీప్‌ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నారు.

ఈ క్రమంలో గంటా శ్రీనివాసరావు జనసేన పార్టీ తరఫున భీమిలి సీటు ఆశిస్తుండటం హాట్‌ టాపిక్‌ గా మారింది. పంచకర్ల సందీప్‌ తో పోలిస్తే గంటా శ్రీనివాసరావు బలమైన అభ్యర్థి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందులోనూ మెగా ఫ్యామిలీతో అతిదగ్గర సంబంధాలు ఉండటంతో ఆయనకు సీటు ఇవ్వడానికి పవన్‌ కళ్యాణ్‌ కూడా అభ్యంతరం చెప్పకపోవచ్చని టాక్‌ నడుస్తోంది. మరోవైపు ఈ పరిణామాల పట్ల పంచకర్ల సందీప్‌ ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.