Begin typing your search above and press return to search.

చీపురుపల్లిలో గంటా సొంత సర్వే ఏమి చెబుతోంది...!?

అదే విధంగా చూస్తే విశాఖ జిల్లా రాజకీయాల్లో గంటా గతంలో పాతుకుపోయారు.

By:  Tupaki Desk   |   21 March 2024 1:30 AM GMT
చీపురుపల్లిలో గంటా సొంత సర్వే ఏమి చెబుతోంది...!?
X

విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని ఆ జిల్లా నుంచి పంపించేస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. దీని వెనక చంద్రబాబు మాస్టర్ మైండ్ ఉందని అంటున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా గంటాను విశాఖ నుంచి దూరం చేయాలని ఒక మాజీ మంత్రికి ఉంది. ఆయనకూ ఈయనకూ పడడం లేదు. అదే విధంగా చూస్తే విశాఖ జిల్లా రాజకీయాల్లో గంటా గతంలో పాతుకుపోయారు. ఆయన మీద టీడీపీ ప్రభుత్వం ఉన్నపుడు ఆరోపణలు కూడా వచ్చాయి.

దాంతో విశాఖ సిటీకి దూరంగా ఆయనను పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లాలో టీడీపీ అధికారంలోకి వస్తే కొత్త రాజకీయాలను కొత్త ముఖాలను పరిచయం చేయాలని అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో గంటాకు సీటు లేదు అనకుండా విజయనగరం జిల్లాలోని చీపురుపల్లికి చూపించారు.

అది విశాఖకు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళి రాజకీయం చేయడం అంటే కష్టమైన వ్యవహారమే. గంటా విశాఖలోనే గత మూడున్నర దశాబ్దాలుగా స్థిరపడిపోయారు. ఆయన రాజకీయ కార్యక్షేత్రంగా విశాఖ ఉంది.

ఆయన విశాఖలో ఏ నియోజకవర్గం నుంచి గెలిచినా ఒక పూటలో అక్కడికి చేరుకుని అక్కడ వ్యవహారాలను చూసుకునే వెసులుబాటు ఉంటూ వచ్చింది. చీపురుపల్లిలో గంటా అంటే అది చాలా కష్ట సాధ్యమైనదిగా ఉంటుంది. పైగా నాన్ లోకల్ ముద్ర పడుతుంది. పూర్తి గ్రామీణ నేపధ్యం ఉన్న సీటు అది.

అయితే చంద్రబాబు ఇస్తే ఆ సీటు లేకపోతే లేదు అన్నట్లుగా గంటాకు చెప్పారని ప్రచారం సాగుతోంది. ఆరున్నర పదుల వయసులో ఉన్న గంటాకు ఇవే చివరి ఎన్నికలు అని అంటున్నారు. ఆయన ఈసారి పోటీ చేసి గెలవడం ముఖ్యమని అంటున్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే గంటా ఈసారి పోటీకి సిద్ధపడుతున్నారు.

దాంతో పాటుగా ఏపీలో కీలక పార్టీలు అన్నీ టీడీపీతో కూటమి కట్టాయి. వైసీపీ మొత్తం లిస్ట్ రిలీజ్ చేసింది. దాంతో గంటాకు వేరే ఆప్షన్ లేదని అంటున్నారు. ఈ క్రమంలో గంటా చీపురుపల్లి వెళ్లడానికే డిసైడ్ అయ్యారని అంటున్నారు. అందుకే ఆయన అక్కడ ఒక సొంత సర్వే చేయించారు అని అంటున్నారు. ఆ సర్వేలో ఆశాజనక ఫలితాలు వచ్చాయని అంటున్నారు.

అక్కడ వైసీపీ సీనియర్ నేత, మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ మీద ఉన్న వ్యతిరేకత తనకు కలసి వస్తుందని గంటా అంచనా వేస్తున్నారుట. గంటా కనుక అక్కడ పోటీ చేస్తే ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఫైటింగ్ నడుస్తుందని అంటున్నారు.

ఇక ఎన్నికల షెడ్యూల్ తరువాత రెండు నెలల దాకా సమయం కూడా దొరకడంతో గంటా చలో చీపురుపల్లి అని అంటున్నారుట. ఆయనకు ఈ రెండు నెలలు విలువైన సమయం అని అందువల్ల అక్కడికి వెళ్తే ఎన్నికల వేళకు పరిస్థితిని తనకు అనుకూలం చేసుకోవచ్చు అని చూస్తున్నారుట. ఒక వేళ అన్ని అస్త్రాలు తీసినా ఓడిపోతే మాత్రం తనకు ఎమ్మెల్సీ వంటి పదవి అయినా ఇవ్వాలని కూడా ఆయన అధినాయకత్వాన్ని కోరి ఆ హామీ తీసుకునే చీపురుపల్లి వెళ్తారు అని అంటున్నారు.

అయితే టీడీపీ అధినాయకత్వానికి మాత్రం గంటా కచ్చితంగా గెలుస్తారు అన్న నమ్మకం ఉందిట. రాబిన్ శర్మ ద్వారా అక్కడ నిర్వహించిన సర్వేలో గంటా అయితేనే బొత్సను ఓడించగలరు అని వచ్చిందట. దాంతో బొత్సను పూర్తి స్థాయిలో కట్టడి చేయ్డం ద్వారా విజయనగరం జిల్లాలో వైసీపీ మీద పై చేయి సాధించవచ్చునని బాబు భావిస్తున్నారుట.

అలాగే విశాఖలో బొత్స సతీమణి ఎంపీగా పోటీలో ఉన్నారు. ఆమె విషయంలో కూడా బొత్స సహకారాలు పెద్దగా లేకుండా చేయవచ్చు అన్నది కూడా ప్లాన్ గా ఉంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే బొత్స మీదకు గంటాను పోటీకి రెడీ చేస్తున్నట్లే కనిపిస్తోంది. గంటా కూడా ఇపుడు చీపురుపల్లి వెళ్లడానికి పూర్తిగా సిద్ధం అయ్యారని అంటున్నారు.