Begin typing your search above and press return to search.

వారి నాలుక చీరేయాలి.. కనుగుడ్లు పెరికివేయాలి: కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు!

సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి నాలుక చీరేయాలి, కనుగుడ్లు పెరికివేయాలంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

By:  Tupaki Desk   |   13 Sep 2023 6:14 AM GMT
వారి నాలుక చీరేయాలి.. కనుగుడ్లు పెరికివేయాలి: కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు!
X

సనాతన ధర్మం.. డెంగ్యూ, మలేరియా, కరోనాలాంటిదని.. దాని నియంత్రించడం కాదు నిర్మూలించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు, డీఎంకే ప్రభుత్వంలో మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే.

ఉదయనిధి తలతెస్తే రూ.10 కోట్లు ఇస్తానంటూ ఉత్తరప్రదేశ్‌ కు చెందిన స్వామీజీ ఒకరు చేసిన ప్రకటన మరింత కాకరేపింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌ లో జనజాగరణ సమితి పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. ఉదయనిధిని చెప్పుతో కొడితే రూ.10 లక్షలు ఇస్తామంటూ ఆ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు.

ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు ఆగకముందే డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా చేసిన వ్యాఖ్యలు మరింత హీట్‌ ఎక్కించాయి. సనాతన ధర్మం హెచ్‌ఐవీ కంటే ప్రమాదకరమైందని రాజా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఉదయనిధి, ఎ.రాజా వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, హిందూ సంఘాలు, ఇతరులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెటిజన్లలోనూ డీఎంకే నేతల వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది.

ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి నాలుక చీరేయాలి, కనుగుడ్లు పెరికివేయాలంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఆయన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారింది. తాజాగా రాజస్తాన్‌ లోని బర్మేర్‌ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తమిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ప్రస్తావిస్తూ.. ఇటువంటి సవాళ్లను మనం ధీటుగా ఎదుర్కోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి నాలుక చీరేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి కళ్లు పెరికివేయాలన్నారు.

సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ మన చరిత్ర, సంస్కృతులపై దాడికి ప్రయత్నిస్తున్నారని షెకావత్‌ మండిపడ్డారు. ఇటువంటి వారికి అధికారం, పదవులు దక్కనివ్వరాదు అని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇప్పటికే ఉదయనిధి వ్యాఖ్యలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల ఇండియా కూటమిలోని పార్టీల అసలు ఉద్దేశం ఇదంటూ ఘాటుగా తూర్పూరబట్టారు. ఈ కోవలో ఇప్పుడు మరో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి.