Begin typing your search above and press return to search.

ఎన్టీయార్ నుంచి చంద్రబాబు దాకా...టీడీపీ గ్రాఫ్ ఇలా...!

అందుకే తెలుగుదేశం పార్టీని ఆయన కేవలం తొమ్మిది నెలలలో అధికారంలోకి తెచ్చారు.

By:  Tupaki Desk   |   15 Feb 2024 4:37 PM GMT
ఎన్టీయార్ నుంచి చంద్రబాబు దాకా...టీడీపీ గ్రాఫ్ ఇలా...!
X

తెలుగుదేశం పార్టీని ఎన్టీయార్ స్థాపించారు. ఆయన ఆనాడు ఎవరి అండ కోసమో పొత్తుల కోసమో ఎదురు చూడలేదు. ఎదురుగా కొండంత అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉంది. గ్రౌండ్ లెవెల్ వరకూ వేళ్ళూనుకుని వటవృక్షంగా ఉంది. కాంగ్రెస్ లో ఉద్ధండులు ఎందరో ఉన్నారు. యోధానుయోధులు అంతా ఒక వైపు ఉన్నారు.

కానీ ఎన్టీయార్ వైపు చూస్తే శిఖరమంతా ఆయన ఇమేజ్ ఉంది. అంతే కాదు ఆకాశమంత ధైర్యం ఆయన సొంతం. అందుకే తెలుగుదేశం పార్టీని ఆయన కేవలం తొమ్మిది నెలలలో అధికారంలోకి తెచ్చారు. వట వృక్షం అనుకున్న కాంగ్రెస్ ని కూల్చేసారు. ఎన్టీయార్ మొత్తం 14 ఏళ్ల రాజకీయ జీవితాన్నే చూశారు. ఇందులో ఆయన దాదాపుగా ఎనిమిదేళ్ల పాటు సీఎం గా ఉమ్మడి ఏపీకి పనిచేశారు.

ఎన్టీయార్ మూడు సార్లు సీఎం గా నెగ్గారు. ఆయన నాలుగు ఎన్నికలను తన నాయకత్వంలో ఎదుర్కొన్నారు. తొలిసారి 1983లో పోటీ చేస్తే టీడీపీకి 200 దాకా సీట్లు దక్కాయి. 1985లో అదే రిపీట్ అయింది. రెండు వందలకు పైగా సీట్లు దక్కాయి. 1989లో ఆయన తొలిసారి పరాజయం పాలు అయ్యారు. అయినా టీడీపీకి 73 సీట్లు దక్కి గౌరవప్రదమైన స్థానంలోనే నిలిచింది. 1994లో టీడీపీ ప్రభంజనమే వీచింది. ఏకంగా 225 దాకా సీట్లు ఒక్క టీడీపీకే దక్కాయంటే దటీజ్ ఎన్టీయార్ అనిపించకమానదు.

ఎంపీల విషయం చూసినా 1984లో 35 మంది ఎంపీలు లోక్ సభకు ఎన్నిక అయి చరిత్ర సృష్టించారు. లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా టీడీపీ సాధించింది. 1989లో మాత్రం రెండు ఎంపీలే గెలిచారు. 1991లో మాత్రం 13 గెలుచుకుంది. రాజీవ్ దారుణ హత్యతో రెండవ విడత పోలింగ్ లో కాంగ్రెస్ పుంజుకుంది. అలా ఎన్టీయార్ ఎప్పటికపుడు టీడీపీ గ్రాఫ్ పెంచుకుంటూనే పోయారు. కానీ 1995 సెప్టెంబర్ 1 న పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు జమానాలో టీడీపీ ఎలా ఉంది అంటే కొన్ని లెక్కలు చూడాల్సిందే.

ఎన్టీయార్ మరణాంతరం చంద్రబాబు ఎదుర్కొన్న తొలి ఎన్నిక లోక్ సభ ఎన్నికలు అలా 1996లో టీడీపీ 16 ఎంపీ సీట్లు సాధించింది. 1998లో జరిగిన ఎన్నికల్లో కేవలం 12 సీట్లకు మాత్రమే టీడీపీ పరిమితం అయింది. వామపక్షలతో పొత్తు ఉన్నా కూడా టీడీపీకి ఆ సీట్లే దక్కాయి.

ఇక 1999లో ఎంపీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ బంపర్ విక్టరీ సాధించింది. మొత్తం 29 సీట్లు టీడీపీకి వస్తే బీజేపీకి ఏడు సీట్లు దక్కాయి. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే 180 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. పొత్తులో ఉన్న బీజేపీకి 12 సీట్లు దక్కాయి.

ఇక 2004లో చూస్తే టీడీపీ బీజేపీకి పొత్తులో ఉన్నాయి. 47 సీట్లు మాత్రమే టీడీపీకి దక్కాయి. బీజేపీకి రెండు సీట్లు దక్కాయి. అధికారం పోయింది. ఎంపీల విషయానికి వస్తే 5 ఎంపీలు మాత్రమే టీడీపీకి దక్కాయి. అదే విధంగా చూస్తే 2009లో టీడీపీకి ఉమ్మడి ఏపీలో కేవలం ఆరు ఎంపీ సీట్లు మాత్రమే దక్కాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే 92 సీట్లు లభించాయి.

విభజన తరువాత చూస్తే టీడీపీకి ఏపీలో 102 సీట్లు దక్కాయి. అధికారం కూడా దఖలు పడింది. ఎంపీ సీట్లు చూస్తే 15 దక్కాయి ఇక 2019లో చూస్తే కేవలం 23 అసెంబ్లీ సీట్లు మూడు ఎంపీ సీట్లు దక్కాయి. ఈ నేపధ్యంలో తెలంగాణాలో చూసుకుంటే 2014లో 15 మందికి పైగా ఎమ్మెల్యేలను గెలిపించుకున్నా టీడీపీ నిలబెట్టుకోలేకపోయింది. 2018లో కాంగ్రెస్ తో కలసి వెళ్ళి నాలుగు ఎమ్మెల్యే సీట్లు దక్కించుకుంది. కానీ వారు కూడా నిలబడలేదు. 2023 ఎన్నికల్లో అసలు పోటీ చేయలేదు. ఇపుడు చూస్తే 2024లో ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. టీడీపీ రాజకీయ జాతకం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

ఇదిలా ఉంటే రాజ్యసభలో 1984 నుంచి చూసుకుంటే టీడీపీకి ప్రాతినిధ్యం ఉంటూ వస్తోంది. తొలిసారి అయిదుగురు ఎంపీలను రాజ్యసభకు పంపించిన టీడీపీ 2023 ఏప్రిల్ 2 వరకూ చూస్తే ఒక్క ఎంపీగమాత్రమే మిగిలింది. ఏప్రిల్ 2 తరువాత పూర్తిగా అక్కడ ఖాతా మూసేసి జీరో కాబోతోంది.

ఎన్టీయార్ నుంచి చంద్రబాబు దాకా టీడీపీ జమానా చూసుకుంటే ఉమ్మడి ఏపీ లో తెలంగాణా పోగొట్టుకుంది. ఇపుడు రాజ్యసభలో ఖాళీ అయింది. ఏపీలో చావో రేవో అన్నట్లుగా ఎన్నికలు ఉన్నాయి. పొత్తులతో వెళ్తున్నా కూడా ఫలితం అనుకూలం కాకపోతే అది చంద్రబాబు నాయకత్వానికే సవాల్ అవుతుంది. ఎన్టీయార్ వారసత్వం సందేహంలో పడుతుంది.