Begin typing your search above and press return to search.

కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ హత్య.. చంపింది భార్యే!

భర్తల్ని చంపేసే కొత్త ట్రెండ్ మొదలై కొన్నేళ్లు అవుతోంది. మరింత కచ్ఛితంగా చెప్పాలంటే దాదాపు పది.. పదిహేనేళ్లుగా ఈ కొత్త పంచాయితీ మొదలైంది.

By:  Tupaki Desk   |   21 April 2025 10:07 AM IST
Former Karnataka DGP Om Prakash Mu*rdered Wife Confesses
X

భర్తల్ని చంపేసే కొత్త ట్రెండ్ మొదలై కొన్నేళ్లు అవుతోంది. మరింత కచ్ఛితంగా చెప్పాలంటే దాదాపు పది.. పదిహేనేళ్లుగా ఈ కొత్త పంచాయితీ మొదలైంది. కారణం ఏమైనా కానీ తన సంతోషానికి అడ్డుగా నిలిచిన భర్తను పాశవికంగా చంపేసేందుకు భార్యలే స్వయంగా ప్లాన్ చేయటం.. మరొకరితో కలిసి చంపేయటం లాంటి ఉదంతాలు గడిచిన ఐదేళ్లలో భారీగా పెరిగిపోయాయి. తాజాగా కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓం ప్రకావ్ (68) దారుణ హత్యకు గురయ్యారు. డీజీపీ స్థాయిలో పని చేసిన వ్యక్తి హత్యకు గురి కావటమే ఒక సంచలనమైతే.. ఆ హత్య చేసింది ఆయన జీవిత భాగస్వామే కావటం ఇప్పుడు షాకింగ్ కు గురి చేస్తోంది.

పోలీసుల ప్రాథమిక అంచనాల ప్రకారం మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్యకు ఆయన భార్యే కారణమని భావిస్తున్నారు. ఆస్తి తగాదాలు.. కుటుంబ సభ్యుల మధ్యనున్న గొడవలే ఆయన్ను చంపేయటానికి కారణాలుగా చెబుతుననారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాశ్.. బిహార్ లోని చంపారన్ కు చెందిన వ్యక్తి. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి 2017లో రిటైర్ అయ్యారు.

ఆ తర్వాత బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లోనే ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఓంప్రకాశ్ సతీమణి పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఆయన రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. కొద్దిరోజులుగా ఆస్తి వివాదాలతో భార్య.. కుటుంబ సభ్యులతో ఆయన గొడవ పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

ఈ మధ్యనే ఆయన ఇంటి వద్ద భార్య ఆందోళన చేసిన వైనం మీడియాలో హైలెట్ కావటమే కాదు.. హాట్ టాపిక్ గా మారింది. ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూప్ లోనూ తన భర్త ప్రకాశ్ తనను.. కుటుంబ సభ్యులను తీవ్రంగా హింసిస్తున్నట్లుగా పల్లవి మెసేజ్ లు పెట్టిన వైనాన్ని పోలీసులు ప్రస్తావిస్తున్నారు. ఇంట్లోనూ పిస్టల్ పట్టుకొని తిరుగుతున్నారన్న ఆమె మెసేజ్ ల నేపథ్యంలో.. ఆదివారం ఇంట్లో జరిగిన గొడవ తీవ్ర రూపం దాల్చటంతో.. విసిగిపోయిన ఆయన భార్య పల్లవి భర్తను పలుమార్లు పొడిచి చంపినట్లుగా గుర్తించారు.

భర్తను చంపేసిన తర్వాత పల్లవి.. మరో మాజీ డీజీపీ అలోక్ మోహన్ కు మెసేజ్ చేశారు. ఇందులో.. ‘‘ఐ హ్యావ్ ఫినిష్డ్ మాన్ స్టర్’’ అంటూ మెసేజ్ చేశారు. ఈ ఉదంతం వెలుగు చూసిన వెంటనే డీజీపీ అలోక్ మోహన్.. బెంగళూరు నగర కమిషనర్ బి.దయానంద్ లు ఘటనా స్థలానికి వెళ్లారు. ఓం ప్రకాశ్ భార్య పల్లవి.. కుమార్తె.. కోడళ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.