Begin typing your search above and press return to search.

ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్‌: బెంగాల్‌లో బీజేపీ-టీఎంసీ మధ్య టఫ్ ఫైట్

దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. మే 4న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

By:  A.N.Kumar   |   29 April 2026 7:45 PM IST
ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్‌: బెంగాల్‌లో బీజేపీ-టీఎంసీ మధ్య టఫ్ ఫైట్
X

దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. మే 4న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో అధికారం కోసం బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య నువ్వా-నేనా అన్నట్లు పోరు సాగుతుండగా తమిళనాడులో డీఎంకే హవా కొనసాగుతోంది. కేరళలో ఈసారి అధికార మార్పిడి తప్పదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్ లో హోరాహోరీ

294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో ఫలితాలపై సర్వే సంస్థల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ అంచనా ప్రకారం.. బీజేపీ తొలిసారి బెంగాల్‌ పీఠాన్ని కైవసం చేసుకోబోతోంది. బీజేపీకి 150-160 స్థానాలు వచ్చే అవకాశముందని, తృణమూల్ 130-140 స్థానాలకు పరిమితం కావచ్చని పేర్కొంది. బెంగాల్ ఎన్నికల్లో మరోసారి తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. ఆ పార్టీకి ఈసారి 177-187 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. బీజేపీకి 95-110 సీట్లు, కాంగ్రెస్‌కు ఈసారి 1-3 స్థానాలు దక్కుతాయని పేర్కొంది. తృణమూల్‌కు 46.5% ఓట్ షేర్ వస్తుందని, బీజేపీకి 41.5% ఓట్ షేర్ దక్కొచ్చని తెలిపింది. లెఫ్ట్ పార్టీలకు 4.1%, కాంగ్రెస్‌కు 2.1% ఓట్ షేర్ వస్తుందని అంచనా వేసింది. అయితే మరికొన్ని సర్వేలు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకే 177-187 సీట్లతో స్పష్టమైన మెజారిటీ దక్కుతుందని జోస్యం చెప్పాయి. దీంతో బెంగాల్ ప్రజాతీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

తమిళనాడు.. స్టాలిన్ వైపే మొగ్గు.. విజయ్ ఎంట్రీతో మార్పు!

తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టబోతోందని పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడించింది. 234 స్థానాలకు గాను డీఎంకే కూటమి 125-146 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. ప్రతిపక్ష ఏఐడీఎంకే 65-80 స్థానాలకు పరిమితం కానుంది. అయితే, ఈ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే (TVK) పార్టీ సంచలనం సృష్టించబోతోంది. తొలి ప్రయత్నంలోనే 18-24 స్థానాలు సాధించి, యువ ఓటర్లను భారీగా ఆకర్షించినట్లు సర్వేలు చెబుతున్నాయి.

కేరళ.. అధికార మార్పిడి సంప్రదాయం పునరావృతం!

వరుసగా రెండుసార్లు పవర్ ఎంజాయ్ చేసిన వామపక్షాల ఎల్‌డీఎఫ్ (ఎల్డీఎఫ్) కూటమికి ఈసారి ఎదురుదెబ్బ తగలనుంది. కేరళ ఓటర్లు మళ్లీ మార్పు కోరుకుంటున్నట్లు పీపుల్స్ పల్స్ సర్వే తెలిపింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (యూడీఎఫ్) కూటమి 75-85 స్థానాలతో అధికారాన్ని చేజిక్కించుకోనుంది. పినరయ్ విజయన్ ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి ఉన్నప్పటికీ, అధికారాన్ని మార్చే సంప్రదాయానికే ప్రజలు మొగ్గు చూపడం విశేషం.

అసోం, పుదుచ్చేరి.. ఎన్డీఏ హవా

అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ నేతృత్వంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం దిశగా సాగుతోంది. 126 స్థానాలకు గాను బీజేపీ కూటమి 90 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉంది.

పుదుచ్చేరి: ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమే మళ్లీ పగ్గాలు చేపట్టనుంది. ఎన్. రంగస్వామి నాయకత్వంపై ప్రజలు నమ్మకం ఉంచారు.

తమిళనాడు, బెంగాల్‌లలో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించారు. తమిళనాడులో 37.8% మహిళలు డీఎంకేకు మద్దతు ఇచ్చారు.

ఈ ఫలితాలు కేవలం రాష్ట్రాలకే పరిమితం కాకుండా, రాబోయే జాతీయ రాజకీయాలకు దిశానిర్దేశం చేయనున్నాయి. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఇంకా బలంగానే ఉందని ఈ ఎగ్జిట్ పోల్స్ నిరూపిస్తున్నాయి. మే 4న వెలువడే అసలు ఫలితాల కోసం యావత్ భారతావని ఎదురుచూస్తోంది