Begin typing your search above and press return to search.

వైద్య రంగంలో సరికొత్త విప్లవం.. ప్రపంచంలోనే తొలి 'AI డాక్టర్' క్లినిక్ ప్రారంభం!

ప్రపంచంలోనే మొట్టమొదటి 'AI డాక్టర్' క్లినిక్ సౌదీ అరేబియాలో ప్రారంభమైంది. ఇది వైద్య రంగంలో ఒక విప్లవాత్మక మార్పునకు నాంది పలుకనుంది.

By:  Tupaki Desk   |   18 May 2025 1:46 PM IST
వైద్య రంగంలో సరికొత్త విప్లవం.. ప్రపంచంలోనే తొలి AI డాక్టర్ క్లినిక్ ప్రారంభం!
X

ప్రపంచ వైద్య చరిత్రలో ఒక కొత్త శకం మొదలైంది. ఇక మీదట రోగులను పరీక్షించడానికి, వ్యాధిని నిర్ధారించడానికి, చికిత్స సూచించడానికి మనుషులతో పాటు కృత్రిమ మేధస్సు (AI) కూడా రంగంలోకి దిగబోతోంది. అవును, మీరు చదువుతున్నది నిజమే. ప్రపంచంలోనే మొట్టమొదటి 'AI డాక్టర్' క్లినిక్ సౌదీ అరేబియాలో ప్రారంభమైంది. ఇది వైద్య రంగంలో ఒక విప్లవాత్మక మార్పునకు నాంది పలుకనుంది.

సౌదీ అరేబియాలోని అల్ అహ్సా ప్రావిన్స్‌లో అల్‌మూసా హెల్త్ గ్రూప్, చైనాకు చెందిన సైన్యీ ఏఐ సంస్థతో కలిసి ఈ ప్రయోగాత్మక AI క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్లినిక్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. రోగులతో మొదట మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం, వ్యాధిని గుర్తించడం, చికిత్సను సూచించడం వంటి పనుల నుంచి వైద్యులకు కొంత ఉపశమనం కలిగించడం.

సైన్యీ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ AI క్లినిక్ ఒక సరికొత్త వైద్య సేవల వ్యవస్థ. ఇందులో 'డాక్టర్ హువా' అనే AI సిస్టమ్ స్వతంత్రంగా రోగుల వివరాలు సేకరించడం నుంచి దలుకొని వారికి మందులు సూచించే వరకు అనేక రకాల సేవలను అందిస్తుంది. అయితే, భద్రతా చర్యగా వైద్యుల పర్యవేక్షణ మాత్రం కొనసాగుతుంది. వైద్యులు AI ద్వారా వచ్చిన వ్యాధి నిర్ధారణ, కిత్స ఫలితాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

'డాక్టర్ హువా' ఎలా పనిచేస్తుంది?

క్లినిక్‌కు వచ్చిన రోగి ఒక ట్యాబ్ ద్వారా 'డాక్టర్ హువా' AI సిస్టమ్ తో తమ వ్యాధి లక్షణాలను వివరిస్తారు. వెంటనే ఆ వ్యవస్థ మరిన్ని ప్రశ్నలు అడుగుతుంది. మానవ సహాయకుల ద్వారా సేకరించిన డేటా, వైద్య చిత్రాలను విశ్లేషిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, డాక్టర్ హువా ఒక చికిత్స ప్రణాళికను అందిస్తుంది. ఈ ప్రణాళికను వైద్యుడు పూర్తిగా సమీక్షించి, ఆమోదం తెలుపుతూ సంతకం చేస్తారు. ఒకవేళ AI పరిశీలించలేని అత్యవసర కేసులు ఉంటే వాటి కోసం వైద్యులు అందుబాటులో ఉంటారు.

ప్రస్తుతానికి ఈ AI డాక్టర్ ఉబ్బసం వంటి దాదాపు 30 రకాల శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు కన్సల్టేషన్ సేవలను అందజేస్తుంది. రాబోయే రోజుల్లో వైద్యుల డేటాబేస్‌ను మరింత విస్తరించి 50 రకాల శ్వాసకోశ, జీర్ణకోశ, చర్మ సంబంధిత వ్యాధులకు కూడా ఈ సేవలను అందించాలని సైన్యీ ఏఐ యోచిస్తోంది.