మానవ ప్రమేయం లేకుండానే శిశువు జననం.. మెక్సికో వైద్యుల అద్భుతం!
టెక్నాలజీ శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పుడు ఏకంగా మనిషి సృష్టికి కూడా సాయం చేస్తోంది..అవును, మీరు చదువుతున్నది నిజమే.
By: Tupaki Desk | 10 April 2025 9:00 PM ISTటెక్నాలజీ శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పుడు ఏకంగా మనిషి సృష్టికి కూడా సాయం చేస్తోంది..అవును, మీరు చదువుతున్నది నిజమే. కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక శిశువు మెక్సికోలో జన్మించింది. వైద్య రంగంలో ఇది ఒక కొత్త శకానికి నాంది పలుకుతోంది. పూర్తి వివరాలు మీ కోసం...
మెక్సికో వైద్యులు సరికొత్త చరిత్ర సృష్టించారు. కృత్రిమ మేధస్సు (AI)తో స్వయంగా పనిచేసే ఒక వినూత్న ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) వ్యవస్థను ఉపయోగించి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక శిశువుకు జన్మనిచ్చారు. ఈ విజయం ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ICSI) ప్రక్రియకు ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయాన్ని అందించినట్లయింది.
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ అత్యాధునిక వ్యవస్థ మానవుల సహాయం లేకుండానే సంప్రదాయ ఐవీఎఫ్ ప్రక్రియలోని మొత్తం 23 క్లిష్టమైన దశలను విజయవంతంగా పూర్తి చేయగలదు. పిండం అభివృద్ధిని పర్యవేక్షించడం నుండి అత్యంత ఆరోగ్యకరమైన పిండాన్ని ఎంపిక చేయడం వరకు అన్ని పనులను ఈ ఏఐ వ్యవస్థ స్వయంగా నిర్వహిస్తుంది.
ఈ చారిత్రాత్మక విజయం వైద్య రంగంలో, ముఖ్యంగా సంతానోత్పత్తి చికిత్సలో ఒక పెద్ద ముందడుగుగా పరిగణించబడుతోంది. మానవ ప్రమేయం తగ్గడం వల్ల ప్రక్రియ మరింత కచ్చితత్వంతో, సమర్థవంతంగా జరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా, ఇది ఐవీఎఫ్ చికిత్సను మరింత అందుబాటులోకి తీసుకురాగలదని ఆశిస్తున్నారు.
మెక్సికోలో ఏఐ సహాయంతో విజయవంతంగా శిశువు జన్మించడం ప్రపంచవ్యాప్తంగా వైద్య శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. రాబోయే రోజుల్లో సంతానలేమి సమస్యతో బాధపడుతున్న లక్షలాది మందికి ఈ నూతన సాంకేతికత ఒక ఆశాకిరణం కానుంది. ఏఐ సహాయంతో సాధ్యమైన ఈ అద్భుతం వైద్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు.
