Begin typing your search above and press return to search.

నకిలీ సర్టిఫికెట్లతో విదేశాలకు.. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో చిక్కిన విద్యార్థులు

విదేశీ విద్యార్థులకు వీసాల మంజూరులో అమెరికా ప్రభుత్వం గట్టి ఆంక్షలు విధించడంతో, కొంతమంది భారతీయ విద్యార్థులు నకిలీ విద్యా ధృవపత్రాలతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 Jun 2025 11:17 AM IST
నకిలీ సర్టిఫికెట్లతో విదేశాలకు.. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో చిక్కిన విద్యార్థులు
X

విదేశీ విద్యార్థులకు వీసాల మంజూరులో అమెరికా ప్రభుత్వం గట్టి ఆంక్షలు విధించడంతో, కొంతమంది భారతీయ విద్యార్థులు నకిలీ విద్యా ధృవపత్రాలతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలను హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు సమర్థవంతంగా భగ్నం చేశారు.

గత రెండు వారాలలో నాలుగు నకిలీ డిగ్రీల కేసులు బరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ (BoI) దృష్టికి వచ్చాయి. వీరు యుఎస్, యూకే వీసాల కోసం నకిలీ విద్యా ధృవపత్రాలను ఉపయోగించారు. వాస్తవంగా వీరంతా విదేశీ దౌత్యపరిశీలనను పూర్తిచేసి విద్యార్థి వీసాలు పొందారు కూడా. కానీ విమానాశ్రయంలో BoI అధికారుల అదనపు తనిఖీల్లో ఈ మోసం బయటపడింది.

- మొదటి ఘటన

జూన్ 1న నల్గొండకు చెందిన గోపాల్ రెడ్డి అనే విద్యార్థి నకిలీ డిగ్రీ ఉపయోగించాడని అంగీకరించాడు. మదురై కామరాజ్ యూనివర్సిటి పేరిట నకిలీ B.Sc డిగ్రీను పొందిన గోపాల్ 2023లో యుఎస్ వెబ్‌స్టర్ యూనివర్సిటీలో చేరాడు. 15 నెలల తర్వాత వ్యక్తిగత కారణాలతో తిరిగి ఇండియాకు వచ్చాడు. మళ్లీ 2024లో అమెరికా వెళ్లే ప్రయత్నంలో డల్లాస్ ఎయిర్‌పోర్టులో SEVIS సమస్యలతో డిపోర్టయ్యాడు. తిరిగి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకి వచ్చినప్పుడు అధికారులు డాక్యుమెంట్లు పరిశీలించగా అవి నకిలీ అని తేలింది. ఈ డిగ్రీను బీఎన్ రెడ్డి నగర్‌లోని శ్రీ ధనలక్ష్మి ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఏజెంట్ కాటోజు అశోక్ ద్వారా పొందినట్లు గోపాల్ ఒప్పుకున్నాడు. ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

- రెండో ఘటన:

జూన్ 9న మొహమ్మద్ షహబాజుద్దీన్ అనే యువకుడి దగ్గర ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పేరిట నకిలీ B.Com డిగ్రీ పట్టభద్రతను గుర్తించారు. అంతేకాదు ఇంటర్మీడియట్, B.Tech సర్టిఫికెట్లు కూడా ఫేక్. హైదరాబాదులో యాకుబ్ అనే వ్యక్తి నుంచి రూ.1.5 లక్షలు పెట్టి నకిలీ SSC సర్టిఫికెట్ కొనుగోలు చేశాడని, మిగతావన్నీ సాఫ్ట్‌వేర్ ద్వారా తాను తయారు చేసుకున్నానని తెలిపారు. వీటితో యూకే వీసా పొందాడు.

-మూడో ఘటన:

జూన్ 10న మిర్యాలగూడ సీతారాంపురానికి చెందిన మహమ్మద్ అజర్ హుస్సేన్ యూకే వెళ్ళేందుకు హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు రాగా పట్టుబడ్డాడు. అతను నకిలీ విద్యా ధృవపత్రాలతో పాటు ఉద్యోగ అనుభవ సర్టిఫికెట్ కూడా వాడినట్లు వెల్లడించాడు. ఈ సర్టిఫికెట్ మిర్యాలగూడలోని ఎమర్జ్ మైగ్రేషన్ ఓవర్సీస్ కన్సల్టెంట్సీ లోని భారత్ అనే వ్యక్తి అందించినట్టు చెప్పారు.

- నాలుగో ఘటన:

జూన్ 12న గుంటూరు‌కు చెందిన శ్రీకాంత్ మార్తాలా అనే యువకుడు కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ పేరుతో నకిలీ B.Tech సర్టిఫికెట్‌ను వాడుతున్నట్లు బయటపడింది. ఈ డాక్యుమెంట్‌ను రూ.40,000 చెల్లించి గుంటూరులోని ఒక ఏజెంట్ ద్వారా పొందినట్లు అతను తెలిపాడు.

ఈ ఘటనల నేపథ్యంలో విదేశీ విద్యకు వెళ్లే విద్యార్థుల డాక్యుమెంట్లపై BoI అధికారుల తనిఖీలు మరింత కఠినంగా చేపట్టారు. విద్యా కన్సల్టెన్సీలు నకిలీ సర్టిఫికెట్లు ఇప్పించి వీసా సదుపాయాలు కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని అధికారులు తెలిపారు.

విద్యార్థులు నిజమైన ధృవపత్రాలు మాత్రమే వాడాలని, మోసపూరిత మార్గాలను ఎంచుకుంటే జీవితంలో తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని అధికారులు హెచ్చరించారు.