Begin typing your search above and press return to search.

ఏఐ ‘మృత్యువు’తో చెలగాటమా..? మనుషులను అంతం చేయగలదని మస్క్ హెచ్చరిక!

ప్రపంచ కుబేరుడు ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ గురించి తెలియని వారు ఉన్నారంటే సందేహమే.

By:  Tupaki Political Desk   |   29 April 2026 8:00 PM IST
ఏఐ ‘మృత్యువు’తో చెలగాటమా..? మనుషులను అంతం చేయగలదని మస్క్ హెచ్చరిక!
X

ప్రపంచ కుబేరుడు ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ గురించి తెలియని వారు ఉన్నారంటే సందేహమే. అంతటి వ్యక్తి ఏఐపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడ ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా, అదే సమయంలో దానిని తీవ్రంగా వ్యతిరేపించే విమర్శకుడిగా ఎలాన్ మస్క్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. 'టర్మినేటర్' సినిమాటిక్ భవిష్యత్తు నిజమవుతుందా అన్నట్లుగా ఆయన చేసిన హెచ్చరికలు టెక్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఎప్పుడూ తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటారు. కానీ, ఈసారి ఆయన నేరుగా మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తూ ఏఐ (AI)పై చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ‘ఏఐ మనుషులను చంపొచ్చు.. ఇది మానవజాతిని అంతం చేయగలదు’ అని ఆయన చెప్పడం ఏఐ సాంకేతికత ఎంత వేగంగా మన నియంత్రణ దాటిపోతుందో సూచిస్తోంది. అగ్రరాజ్యాల మధ్య అణు యుద్ధం కంటే కూడా ఏఐ ద్వారా వచ్చే ముప్పు ప్రమాదకరమని హెచ్చరించడం గమనార్హం.

మస్క్ భయం వెనుక కారణాలు

మానవుడి కంటే తెలివైన ఒక వ్యవస్థ తయారైనప్పుడు, అది మన ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని మస్క్ భావిస్తున్నారు. అది తనంతట తానుగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తే, మనుషులు దానికి కేవలం ఒక ‘అడ్డంకి’లా మాత్రమే కనిపిస్తారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక ప్రయోజనాల కోసం లాభాపేక్ష లేకుండా పనిచేయాల్సిన ఓపెన్-ఏఐ, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలతో చేతులు కలిపి కేవలం లాభాల కోసమే పని చేస్తోందని మస్క్ ఆరోపిస్తున్నారు. దీనివల్ల బాధ్యతారహితమైన ఏఐ అభివృద్ధి జరుగుతోందని ఆయన వాదన. ఏఐని ఆయుధాలుగా మార్చడం వల్ల యుద్ధాల స్వరూపం మారిపోతుంది. టర్మినేటర్ సినిమాలో చూసినట్లుగా, రోబోలే మనుషులపై తిరగబడే రోజులు రావచ్చని మస్క్ హెచ్చరిస్తున్నారు.

అద్భుతమా? లేక అంతమా?

మస్క్ వ్యాఖ్యలను విశ్లేషిస్తే ఏఐ మనకు రెండు విషయాలను స్పష్టంగా చెప్తోంది అనుకోవచ్చు. వైద్య రంగంలో క్యాన్సర్ నిర్ధారణ నుంచి, అంతరిక్ష ప్రయోగాల వరకు ఏఐ అద్భుతాలు చేస్తోంది. ఇది మానవ ఉత్పాదకతను పెంచే ఒక గొప్ప పరికరం. సైబర్ దాడులు, డీప్ ఫేక్ వీడియోల ద్వారా సమాజంలో అశాంతిని సృష్టించడం, స్వయంప్రతిపత్తి కలిగిన ఆయుధాల తయారీ ఏఐ వల్ల వచ్చే అతిపెద్ద నష్టాలు.

మస్క్ కేవలం హెచ్చరికలు చేయడమే కాదు, కొన్ని పరిష్కారాలను కూడా సూచిస్తున్నారు. ఏఐ అభివృద్ధిపై కఠినమైన అంతర్జాతీయ నిబంధనలు ఉండాలి. ఏ కంపెనీ కూడా మానవాళికి హాని కలిగించే అల్గారిథమ్‌ను తయారు చేయద్దు. సాంకేతికత ఎప్పుడూ మానవుడికి లోబడి ఉండేలా ‘కిల్ స్విచ్’ వంటి మెకానిజమ్స్ ఉండాలి.

ప్రస్తుతం ఏఐ మన జీవితాల్లో భాగమైపోయింది. ఎలాన్ మస్క్ హెచ్చరికలను భయంగా కాకుండా, ఒక 'ముందస్తు జాగ్రత్త'గా చూడాల్సిన అవసరం ఉంది. నిప్పును కనుగొన్నప్పుడు మనకు వంట చేసుకోవడానికి ఉపయోగపడింది, అలాగే ఇళ్లను తగలబెట్టేందుకు ఉపయోగపడుతుంది. ఎలా వాడాలో తెలియాలంతే.. ఏఐ కూడా అటువంటిదే. మనం దానిని ఎంత బాధ్యతాయుతంగా అభివృద్ధి చేస్తామనే దానిపైనే మానవజాతి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మస్క్ చెప్పినట్లు ఆ చీకటి భవిష్యత్తు రాకుండా చూడాలంటే, ఇప్పుడే ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఏఐపై ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి.