Begin typing your search above and press return to search.

వాన చుక్క కోసం ఆకాశం వైపు చూడాల్సిందే !

గత ఏడాది అందరికీ గుర్తు ఉంటుంది. వర్షాలే వర్షాలు. కాలాలు సైతం మారిపోయినా వానలు మాత్రం దంచికొట్టాయి.

By:  Tupaki Desk   |   10 March 2026 8:30 AM IST
వాన చుక్క కోసం ఆకాశం వైపు చూడాల్సిందే !
X

గత ఏడాది అందరికీ గుర్తు ఉంటుంది. వర్షాలే వర్షాలు. కాలాలు సైతం మారిపోయినా వానలు మాత్రం దంచికొట్టాయి. వేసవిలో వానలు, వర్షాకాలంలో భారీ వానలు, ఆఖరుకు శీతాకాలంలోనూ వానలు. ఇలా అకాల వర్షాలతో జనాలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. వానలు కురియాలి. అవి ఏడాదిలో నాలుగు నెలలు సమృద్ధిగా వానాకాలం కురిస్తేనే పంటలు పండుతాయి. జలాశయాలు నిండుతాయి. జనాలు కూడా ఎంతో హర్షిస్తారు. కానీ అతి వృష్టి అయినా ముప్పే అలాగే అనావృష్టి అయిన తప్పే. కానీ ఇపుడు రాబోతోంది అనావృష్టి. ఈ ఏడాది వానలు కోసం నింగికేసి చూడాల్సిందే అని అంటున్నారు. దేశవ్యాప్తంగా క్షామ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో :

దేశంలో ఎల్ నినో పరిస్థితుల నేపథ్యం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. 2026 సంవత్సరంలో ప్రపంచ వాతావరణ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పులు అలాగే, ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో అంతా అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలోని రైతులు వ్యవసాయ పనులలో ముందుస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇబ్బందికరంగా :

ఇక ఎల్ నినో-దక్షిణ ఆసిలేషన్ ఈ ఎన్ ఎస్ ఓ అనేది ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో పునరావృతమయ్యే సహజ వాతావరణ నమూనాగా వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇది వెచ్చని ఎల్ నినో చల్లని లా నినా తటస్థంగా మూడు దశల మధ్య ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ప్రతి 2 నుంచి 7 సంవత్సరాలకు సక్రమంగా సంభవించే ఈ ఎన్ ఎస్ ఓ వల్ల సముద్ర ఉష్ణోగ్రతలు, గాలులు వర్షపాతంలో గణనీయమైన అంతరాయాలకు కారణమవుతుంది. దీంతో తరచుగా కరువు లేదా వరదలకు ఈ పరిణామం దారితీస్తుందని చెబుతున్నారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు ఈ ఎన్ ఎస్ ఓ పరిస్థితులు తటస్థ స్థితిలో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో న్యూట్రల్ ఐఓడి పరిస్థితులు నెలకొన్నాయని విశ్లేషిస్తున్నారు.

మరింతగా విస్తరించి :

అంతే కాకుండా రాబోయే వేసవి అలాగే నైరుతి రుతుపవనాల కాలంలో అంటే జూన్ నుంచి ఆగస్టు నెలల మధ్య కాలంలో కూడా వాతావరణం సాధారణ స్థితిలో ఉండే అవకాశం ఉంటుందని అది సుమారు 56 శాతంగా ఉన్నట్లుగా అంతర్జాతీయ అంచనాలు సూచిస్తున్నాయని చెబుతున్నారు. ఇక 2026 ద్వితీయార్థంలో ఎల్ నినో పరిస్థితులు మళ్ళీ అభివృద్ధి చెందే అవకాశం ఏకంగా సుమారు 60 శాతం ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

నైరుతి రుతుపవనాల సరళిపై :

వాతావరణంలోని ఈ మార్పులు దేశంలోని నైరుతి రుతుపవనాల సరళిపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని, దీని ప్రభావం వల్ల వర్షాధార వ్యవసాయంపై ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలో ఏపీలోని రైతులు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణ అనిశ్చితిని తట్టుకునేలా సాగులో శాస్త్రీయ పద్ధతులు నీటి యాజమాన్య పద్ధతులను పాటించాలని దిశా నిర్దేశం చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి దిగుబడి నష్టాలను నివారించడానికి రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.