ఇంటర్ తర్వాత చదువు ఆపేయాలా? తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన కఠిన వాస్తవం!
సమాజంలో చదువు అనేది కేవలం జ్ఞానార్జన కోసం మాత్రమే కాదు, అది ఒక సామాజిక హోదాగా మారిపోయింది.
By: Tupaki Desk | 19 Jun 2026 6:00 PM ISTసమాజంలో చదువు అనేది కేవలం జ్ఞానార్జన కోసం మాత్రమే కాదు, అది ఒక సామాజిక హోదాగా మారిపోయింది. 12వ తరగతి (ఇంటర్మీడియట్) పూర్తికాగానే, ప్రతి మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లలను ఏదో ఒక డిగ్రీ కోర్సులో చేర్పించడాన్ని ఒక బాధ్యతగా భావిస్తారు. అయితే, ఇన్వెస్టర్ సౌరభ్ ముఖర్జీ వంటి నిపుణులు హెచ్చరిస్తున్నట్లుగా, మనం అనుసరిస్తున్న ఈ సంప్రదాయ విద్యా మార్గం ఎటువైపు దారితీస్తోంది? అనే ప్రశ్న నేడు అత్యంత కీలకంగా చెబుతున్నారు. సాధారణ డిగ్రీలు చదివే కన్నా నైపుణ్యం మెరుగుపరిచే కోర్సులు చదవడమే ముఖ్యమని అంటున్నారు.
బట్టీ పట్టడమే చదువా?
మన విద్యావ్యవస్థలో ప్రధానంగా 'బట్టీ పట్టడం' మీద ఆధారపడి నడుస్తున్నామని అంటున్నారు. పరీక్షలో మార్కుల కోసం సమాచారాన్ని వల్లె వేయడం తప్ప, వాస్తవ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన విశ్లేషణాత్మక ఆలోచన విద్యార్థుల్లో లోపిస్తోందని చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బయోటెక్నాలజీ, క్లీన్ టెక్నాలజీ వంటి ఆధునిక రంగాలకు అవసరమైన నైపుణ్యాలను మన కాలేజీలు అందించలేకపోతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలితంగా, పట్టా చేతిలోకి వచ్చే సమయానికి, పరిశ్రమకు కావలసిన నైపుణ్యాలు విద్యార్థికి ఉండటం లేదని అంటున్నారు.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
సౌరభ్ ముఖర్జీ పేర్కొన్నట్లుగా, గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగ రేటు దాదాపు 30-40 శాతం వరకు ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చదువుకోని వారు లేదా తక్కువ చదువుకున్న వారిలో నిరుద్యోగ శాతం చాలా తక్కువగా ఉందని అంటున్నారు. ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కంటే, కష్టపడి పనిచేసే ఒక నిర్మాణ కార్మికుడు, జేసీబీ ఆపరేటర్ ఎక్కువ సంపాదిస్తున్నారనేది కఠిన వాస్తవం. అంటే, మనం డిగ్రీల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామే తప్ప, సంపాదనకు మార్గం చూపే నైపుణ్యాల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నామని అంటున్నారు.
ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి?
డిగ్రీ కోసమే ప్రాకులాడవద్దని నిపుణులు చెబుతున్నారు. కేవలం సమాజం కోసం లేదా హోదా కోసం డిగ్రీ పట్టాల వెంట పడటం మానేయాలని సూచిస్తున్నారు. మీ బిడ్డకు దేనిపై ఆసక్తి ఉందో గమనించాలని చెబుతున్నారు. అది సాంకేతిక విద్య, వృత్తి విద్యా వంటి నైపుణ్యాలను పెంచే కోర్సులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు. థియరీ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చే కోర్సులను ఎంచుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుగా ఉంటాయని చెబుతున్నారు. పిల్లలకు బట్టీ పట్టే అలవాటును తగ్గించి, 'ఎందుకు?', 'ఎలా?' అనే ప్రశ్నలు వేయడం నేర్పించాలని, విశ్లేషణాత్మక సామర్థ్యం పెరిగితే, ఏ రంగంలోనైనా వారు విజయం సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు.
ఇక కాలేజీ ఫీజుల రూపంలో లక్షల రూపాయలు వృధా చేసి, చివరికి నిరుద్యోగులుగా మిగిలే కంటే, ఆ సమయంలోనే చిన్న చిన్న నైపుణ్య కోర్సులు నేర్చుకోవడం, పార్ట్‌టైమ్ పనులు చేయడం వల్ల అనుభవం వస్తుందని చెబుతున్నారు. ఆపై సంపాదన కూడా మొదలవుతుందని అంటున్నారు. చదువు సంధ్యలు అంటే కేవలం క్లాస్ రూమ్ లో కూర్చోవడమే కాదని, మారుతున్న ప్రపంచానికి తగ్గట్టు పాత కాలపు విద్యా దృక్పథానికి స్వస్తి పలికి కొత్త తరాన్ని నిర్మించాలని సూచిస్తున్నారు. ఇకనైనా డిగ్రీ పట్టాల వెనుక పరుగులు తీయడం మానేసి, వాస్తవిక ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాలను అలవర్చుకునేలా మన పిల్లలను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.
