ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం... మొదలైన ఈడీ అరెస్టులు
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా అరెస్టులకు తెరతీసింది.
By: Tupaki Political Desk | 11 Jun 2026 5:43 PM ISTఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా అరెస్టులకు తెరతీసింది. లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసింది. మరోవైపు లిక్కర్ రవాణాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతోపాటు పలువురు అధికారులు, నేతల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈ పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. గురువారం ఉదయాన్నే దాడులు ప్రారంభించిన ఈడీ అత్యంత కీలక సూత్రధారిగా భావిస్తున్న ఐటీ మాజీ సలహాదారు రాజ్ కాసిరెడ్డితో పాటు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ పూర్వపు ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఉదయం నుంచే సోదాలు
మనీలాండరింగ్, హవాలా మార్గంలో నిధుల బదిలీపై ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు గురువారం ఉదయం హైదరాబాద్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని సుమారు 10 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. నానక్‌రామ్‌గూడలోని రాజ్ కాసిరెడ్డి నివాసంలో సుదీర్ఘంగా సోదాలు జరిపిన అనంతరం ఆయన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడి ఇళ్లు, కార్యాలయాలతో పాటు బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో రూ. 8 లక్షల నగదు, రెండు రోలెక్స్ వాచీలు, కొన్ని లగ్జరీ వాహనాలతోపాటు కీలక డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది.
ఏడు అంచెల అవినీతి వ్యవస్థ
గత ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, రవాణా ఒప్పందాల పేరిట దాదాపు రూ. 3,200 కోట్ల మేర ముడుపుల వసూలు చేసినట్లు ఈడీ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు. మద్యం కంపెనీలు, డిస్టిలరీల నుంచి లంచాలు వసూలు చేయడానికి రాజ్ కేసిరెడ్డి ఒక వ్యవస్థను నడిపినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా ఆ అవినీతి సొమ్మును వివిధ డొల్ల కంపెనీల ద్వారా రూటింగ్ చేసి, హవాలా మార్గంలో అంతిమ లబ్ధిదారులకు చేర్చినట్లు ఆరోపిస్తున్నాయి. ఈ నల్లధనాన్ని హైదరాబాద్, తెలంగాణలోని రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోను 'ఈడీ క్రియేషన్స్' అనే సినిమా నిర్మాణ సంస్థలో పెట్టుబడిగా పెట్టినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు.
కంపెనీల గుట్టు తేలుస్తున్న ఈడీ
ఈ భారీ కుంభకోణానికి సంబంధించి విజయవాడ సిట్ ఇప్పటికే నాలుగు చార్జ్‌షీట్లను దాఖలు చేయగా, తాజాగా రంగంలోకి దిగిన ఈడీ 'మనీ లాండరింగ్ నిరోధక చట్టం' కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులో పలువురు మాజీ ఎంపీలు, నేతలు, ఉన్నతాధికారులతో పాటు మొత్తం 33 మందిని నిందితులుగా చేర్చారు. సిట్ నమోదు చేసిన కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డి ఇప్పటికే అరెస్టు అయ్యారు. బెయిలుపై విడుదలైన కొద్దిరోజులకే ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాల రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
