దేశంలోనే ఫస్ట్: ఏపీలో 'సర్' గడువు పెంపు!
దేశ వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ ప్రస్తుతం 11 రాష్ట్రాలు 6 కేంద్ర పాలిత ప్రాంతాల్లో సాగుతోంది.
By: Garuda Media | 14 July 2026 6:18 PM ISTదేశ వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ ప్రస్తుతం 11 రాష్ట్రాలు 6 కేంద్ర పాలిత ప్రాంతాల్లో సాగుతోంది. వీటిలో ఒక్క తెలంగాణ మినహా.. మిగిలిన రాష్ట్రాల్లో ఈ నెల 14(మంగళవారం)తో సర్ ఫారాలను తీసుకునే కార్యక్రమం, ఇంటింటి సర్వే వంటివి ముగిసిపోయాయి. ఈ నేపథ్యంలో ఏపీకి సంబంధించి మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో చేపట్టిన సర్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని.. చేయాల్సింది చాలా ఉందని రాష్ట్రంలోని పలు పార్టీ లు, ప్రజా సంఘాలు రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌కు విజ్ఞప్తి చేశాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతా లు, ఎస్సీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సర్ ప్రక్రియ పూర్తికాలేదని వివరించారు. దీంతో ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.అయితే.. ఇలాంటి విజ్ఞాపనలు గతంలోనూ పలు రాష్ట్రాల నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి అందాయి. కానీ, అప్పట్లో వాటిని ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
ఇచ్చిన గడువు లోపే.. పూర్తి చేయాలని ఆదేశించింది. కానీ, తొలిసారి ఏపీకి సంబంధించి మాత్రం పది రోజుల పాటు వెసులుబాటు కల్పించింది. ఈ నెల 14(మంగళవారం)తో ముగిసిపోయినప్పటికీ.. సర్ ఫారాలను తీసుకునే కార్యక్రమం, ఇంటింటికీ బూత్ లెవిల్ ఆఫీసర్లు వెళ్లే కార్యక్రమాన్ని ఈ నెల 24 వరకు అంటే.. 10 రోజుల పాటు పొడిగించడం విశేషం. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ.. తాజా షెడ్యూల్..
+ ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించేందుకు తుదిగడువు: 24-07-2026
+ బూత్‌లెవిల్ ఆఫీసర్లు.. ఇంటింటికీ తిరగాల్సిన తుడి గడువు: 24-07-2026
+ పోలింగ్ కేంద్రాల గుర్తింపు ఆఖరు తేదీ: 24-07-2026
+ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించే తేదీ : 31-07-2026(గతంలో 21-07-2026)
+ ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తీసుకునే గడువు: 31-07-2026-30-08-2026
+ అభ్యంతరాలు పరిష్కరించే గడువు: 31-07-2026- 28-09-2026
+ తుది ఓటరు జాబితా ప్రకటించే తేదీ: 03-10-2026
