Begin typing your search above and press return to search.

జగన్‌ అనే నేను.. చంద్రబాబు అనే నేను.. ఈ రెండింటిలో ఏది?

దీంతో 'వైఎస్‌ జగన్‌ అనే నేను', 'చంద్రబాబు అనే నేను'.. ఈ రెండింటిలో ఏది ఖాయమవుతుందా అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

By:  Tupaki Desk   |   21 May 2024 5:30 PM GMT
జగన్‌ అనే నేను.. చంద్రబాబు అనే నేను.. ఈ రెండింటిలో ఏది?
X

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు మే 13న ముగిసిన సంగతి తెలిసిందే. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతుందనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భారీ ఎత్తున బెట్టింగులు సాగుతున్నాయి.

ఓవైపు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తమ పార్టీ 151 అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంటు స్థానాలపైన గెలుస్తుందని ప్రకటించారు. ఐప్యాక్‌ కార్యాలయానికి కూడా వెళ్లి మనమే గెలవబోతున్నామని బహిరంగంగా వెల్లడించారు. ఇక వైసీపీ ముఖ్య నేతలు వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ వంటివారు విశాఖ నుంచే జగన్‌ పరిపాలిస్తారని, జూన్‌ 9న విశాఖపట్నంలో ప్రమాణస్వీకారం ఉంటుందని వెల్లడించారు.

మరోవైపు అధికారం చేపట్టబోయేది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమేనని టీడీపీ నేతలు ఢంకా బజాయించి చెబుతున్నారు. ఆ పార్టీ నేతలు దేవినేని ఉమా, రఘురామకృష్ణరాజు కూటమి అత్యధిక స్థానాల్లో గెలవబోతోందని అంటున్నారు. చంద్రబాబు అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్నారు. జూన్‌ 4న ఫలితాలు వచ్చాక మంచి రోజు చూసుకుని చంద్రబాబు ప్రమాణస్వీకారం ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

దీంతో 'వైఎస్‌ జగన్‌ అనే నేను', 'చంద్రబాబు అనే నేను'.. ఈ రెండింటిలో ఏది ఖాయమవుతుందా అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అలాగే ప్రమాణస్వీకారం చేసే చోటు అమరావతికి దక్కుతుందా లేక విశాఖపట్నానికి దక్కుతుందా అనేది కూడా ఆసక్తి రేపుతోంది.

ఇప్పటికే పలు సర్వేలంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అవుతున్నాయి. వీటిలో కొన్ని వైసీపీ గెలుస్తుందని చెబుతుంటే.. మరికొన్ని కూటమికి పట్టం కడుతున్నాయి. ఇక ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అయితే వైసీపీకి ఓటమి తప్పదని మరోసారి తెలిపారు.

ఈ నేపథ్యంలో ఏ పార్టీ గెలుస్తుందో, ఎవరికి మెజారిటీ స్థానాలు దక్కుతాయో తెలియాలంటే జూన్‌ 4 వరకు ఎదురుచూడక తప్పదు.