Begin typing your search above and press return to search.

అర్థమవుతుందా? చంద్రబాబు హైదరాబాద్ కట్టలేదు కానీ..?

సైబరాబాద్ ను నేను నిర్మించానని చంద్రబాబు చెబితే.. హైదరాబాద్ ను ఆయన కట్టించాడట అంటూ ఎటకారం చేస్తూ.. నిజాన్ని మరుగన పడేసే వారి కళ్లు తెరిచేలా.. గతాన్ని గుర్తు చేస్తూ.. నాటి పరిణామాలకు సాక్ష్యంగా నిలిచిన పలువురు ప్రముఖులు ఈ సభలో మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరిని మాట్లాడుకునేలా చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   30 Oct 2023 6:44 AM GMT
అర్థమవుతుందా? చంద్రబాబు హైదరాబాద్ కట్టలేదు కానీ..?
X

స్కిల్ స్కాం ఆరోపణలతో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు సంఘీభావంగా హైదరాబాద్ లో నిర్వహించిన ఐటీ ఉద్యోగుల సభ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దాదాపు ఐదారు గంటల పాటు గచ్చిబౌలి స్టేడియంలో సాగిన ఈ కార్యక్రమంలో మాట్లాడిన వక్తల కారణంగా చంద్రబాబు విజన్.. హైదరాబాద్ కు చంద్రబాబు ఏం చేశారు? అన్న అంశాలు ప్రముఖంగా చెప్పుకున్నారు.

చంద్రబాబుకు సంఘీభావాన్ని తెలియజేస్తూ నిర్వహించిన ఈ సభలో ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు ప్రసంగించారు.


కందుల రమేశ్ ప్రసంగంలోని ముఖ్యంశాల్ని చూస్తే..

- 1998లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కు వచ్చినప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంది. అమెరికాలోని సియాటెల్ తర్వాత ఆ సంస్థ తమ కార్యాలయాన్ని భారత్ లోని హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది. అప్పటికే బెంగళూరు సిలికాన్ సిటీగా పేరుంది. అలాంటిది బెంగళూరును వదిలేసి.. హైదరాబాద్ లో ఎందుకు ఏర్పాటు చేసిందన్నది అందరి సందేహం. దీనిపై ఫోర్బ్స్ పత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘ద యాంబిషియస్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు ’ కారణంగా వచ్చిందని పేర్కొన్నారు.

- హైదరాబాద్ ఒక చారిత్రక నగరం. ఆ హైదరాబాద్ కు తెలుగు సొగసులు అద్దిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ ది. ఆ నగరానికి ఆధునికతను సంతరించింది.. ఆధునిక హంగుల్ని సమకూర్చుంది ఎవరు? చంద్రబాబు. 1998లో హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎక్స్ పోర్ట్స్ విలువ రూ.600 కోట్లు. పాతికేళ్ల తర్వాత 2023లో హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల ఎగుమతి విలువ రూ.2.40లక్షల కోట్లు. పది లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి.. 40 లక్షల మందికి పరోక్షంగా ఉపాధిని ఇస్తుంది.

- ఈ అత్యద్భుత ఆర్థిక.. సామాజిక మార్పు మన జీవితకాలంలో చూశాం. ఇది మామూలు మార్పు కాదు. మహిళల జీవితాల్లోనే పెద్ద మార్పును తీసుకొచ్చింది. ఐటీ ఇండస్ట్రీని తీసేుకురావటం వల్ల.. తెలుగు సమాజంలో మహిళలకు.. వారి జీవితంలో పెను మార్పులు వచ్చాయి. వారికి ఆర్థిక స్వతంత్రం వచ్చింది.

- సైబర్ టవర్స్ ఏర్పాటు చేసి పాతికేళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమం కాబట్టి మరో విషయాన్ని ప్రస్తావిస్తా. భారతదేశంలో తొలిసారిగా ఐటీశాఖ పెట్టింది ఆంధ్రప్రదేశ్ లోనే. 1997లో కేంద్రంలో కూడా ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) శాఖ అన్నది లేదు. 1997లో బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని ఉన్నా కూడా.. కర్ణాటక ప్రభుత్వంలో ఐటీ శాఖ లేదు. 1997లోనే ఏపీలో ఐటీ శాఖ పెట్టటమే కాదు.. ఆర్ చంద్రశేఖర్ అనే ఐఏఎస్ అధికారిని ఐటీ శాఖ సెక్రటరీగా నియమించారు. 1999లో కేంద్ర ప్రభుత్వంలో ఐటీ శాఖను ఏర్పాటు చేసి.. ఇదే చంద్రశేఖర్ రావును ఢిల్లీకి తీసుకెళ్లారు. ఆ ఘనత హైదరాబాద్ ది.. చంద్రబాబుది.

- ట్రిపుల్ ఐటీని బెంగళూరులో పెట్టాలని నిర్ణయిస్తే.. బెంగళూరుకు ముందే అనుమతించినా కూడా 1998లోనే హైదరాబాద్ లోనే వచ్చింది. ఐఎస్ బీ.. ఐఆర్ డీలు వచ్చాయంటే అది చంద్రబాబే కారణం. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆఫీసు ఉన్న దగ్గర.. మొదట ఏర్పాటు చేసింది ఐఎస్ బీ.


టీవీ 5 మూర్తి ప్రసంగంలోని ముఖ్యాంశాలు

- న్యూయార్కు మహానగరంలో పార్కింగ్ అవకాశం లేని ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతూ.. అధికారులను వెంట పెట్టుకొని.. తన ఫైళ్లను తానే మోసుకెళ్లి.. ప్రజంటేషన్లు చేసుకొని.. బిల్ గేట్స్ అపాయింట్ మెంట్ తీసుకొని మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కు వచ్చేందుకు నానా పాట్లు పడ్డారు చంద్రబాబు. మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్ కు వచ్చాక పలు కంపెనీలు నగరానికి వచ్చాయి.

- బిల్ గేట్స్.. బిల్ క్లింటన్ ను హైదరాబాద్ కు పిలిపించటం.. అప్పుడున్న ఇతర కంపెనీల్ని ఆకర్షించారు. మేం బాంబే వెళతాం.. బెంగళూరు వెళతామన్న కంపెనీలతో ప్రత్యేకంగా మాట్లాడారు. హైదరాబాద్ లో ఏముంది? అని వారు అడుగుతూ.. హైదరాబాద్ కు రావాలంటే అమెరికా నుంచి బాంబేలో దిగి ఫ్లైట్ మారి రావాలంటే.. హైదరాబాద్ కు డైరెక్టుగా విమానాన్ని వేయించారు చంద్రబాబు. ఫ్లైట్ ఆక్యుపెన్సీ లేకపోతే విమానయాన సంస్థలు ఒప్పుకోవు. సరే.. సగం సీట్ల టికెట్లను ప్రభుత్వమే కొనేస్తుందన్నారు. హైదరాబాద్ వస్తే నైట్ లైఫ్ లేదు సార్ అంటే.. నైట్ లైఫ్ కుసంబంధించిన పర్మిషన్లు ఇవ్వటం.. సర్.. గోల్ఫ్ కోర్టు లేదండని అంటే.. గోల్ఫ్ కోర్టు ఏర్పాటు చేయించారు.

- హైదరాబాద్ అంటే.. ఫుడ్ విషయంలో ఏంటి స్పెషాలిటీ అంటే.. హైదరాబాద్ కు విదేశాలకు చెందిన వారు వస్తే ఏం చేయాలి? ఏం తినాలి? అంటే.. ఇక్కడి క్యూజిన్ కు సంబంధించి హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేయండి. సార్.. మనం ఐటీని ముందుకు తీసుకెళ్లాలంటే.. స్టూడెంట్స్ పూల్ లేదు. ఐఐటీ.. ఐఐఎంలు లేవు అంటే.. ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయండి.. భూములు ఇస్తానని చెప్పారు. స్థలం ఇస్తున్నారు.. భవనాలు కట్టాలంటే ఏళ్లు పడుతుంది సార్ అంటే.. మొత్తం సిటీ అంతా తిరగండి.. ఎక్కడ ప్రభుత్వ భవనాల్ని గుర్తించండి అంటే.. జేఏ చౌదరి.. ఇతరులు తిరిగితే.. అప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కోసం నిర్మించిన భవనాలు బాగున్నాయి అంటే.. అరగంటలో అధికారుల్ని పిలిపించి.. ట్రిపుల్ ఐటీకి భవనాలు ఇచ్చేయమన్నారు. లైసెన్సులు ఏమీ లేవు. ఆయనంతట ఆయన వెళ్లి.. అన్ని అనుమతులు ఇచ్చారు.

- - మైత్రీవనం గురించి అందరికి తెలిసిందే. అమీర్ పేట గురించి మీ అందరికి తెలుసు. అమెరికాలో సన్ సెట్ అయితే.. అమీర్ పేటలో సన్ రైజ్ అవుతుందని. వైటుకే సమస్య వస్తోంది.. లక్షల మంది అవసరం.. వైటూకే ప్రాబ్లం సాల్వ్ చేయటానికి.. స్టూడెంట్స్ ను తయారు చేయండి.. ఇంజనీరింగ్ కాలేజీల్ని అనుమతులు ఇవ్వండి.. ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్లు పెట్టండి. పెద్ద పెద్ద సంస్థల్ని తీసుకురండి అని అధికారులకు వరుస పెట్టి ఆదేశాలిచ్చి.. అవన్నీ అమలు అయ్యేలా చేశారు.

- నాకో సంఘటన ఇంకా గుర్తుంది. ఆయన యూనైటెడ్ ఫ్రంట్ ఛైర్మన్ గా ఉండేవారు. ఆ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం నడుస్తోంది. ఇక్కడ అసెంబ్లీ మొదటి రోజు సమావేశం జరుగుతోంది. విపరీతమైన రాజకీయ సంక్షోభం. అమెరికా నుంచి మోటరోలా సంస్థకు చెందిన ప్రతినిధులు వస్తున్నారు. వారు దేశంలోని మూడు నగరాల్ని చూసి.. తమ సంస్థను పెట్టుకోవాలని అనుకుంటున్నారు. బెంగళూరు.. బాంబే.. చెన్నై నగరాలు వారి జాబితాలో ఉన్నాయి. వారిని హైదరాబాద్ కు పిలిపించండన్నారు.

- వాళ్లను అడిగితే.. హైదరాబాద్ కు రామన్నారు. మంత్రుల్ని ఎయిర్ పోర్టుకు పంపారు. ఒకపక్క యూనైటెడ్ ఫ్రంట్ ఛైర్మన్ గా పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానాన్ని ఫేస్ చేయాలి. మరోవైపు అసెంబ్లీలో మొదటిరోజు సమావేశాన్ని ఫేస్ చేయాలి. ఇంకోవైపు మోటరోలా ప్రతినిధులు. చంద్రబాబే స్వయంగా సంస్థ ప్రతినిధుల్ని రిసీవ్ చేసుకొని.. తన ఇంటి గుమ్మం దిగి.. తానే ఎదురెళ్లి.. మోటరోలా ప్రతినిధుల్ని తీసుకెళ్లి.. హైదరాబాద్ బిర్యానీ వడ్డించి.. కాఫీ.. టీలు ఆయనే సర్వ్ చేసి.. మీరు మూడు సిటీలు తిరిగారు కదా..? హైదరాబాద్ నగరాన్ని పరిశీలించండన్నారు. పరిశీలించటం కాదు సార్.. ఆ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిని కలవటం మాకు సాధ్యం కాలేదు. సెక్రటరీల దగ్గరకు వెళ్లటానికే టైం పట్టింది. మోటరోలా ఇక్కడకు వస్తుందని చెప్పారు.అలా ఎన్నో కంపెనీలు వచ్చాయి.

- కంప్యూటర్లు కూడు పెడతాయా? అని పెద్ద ఎత్తున ధర్నాలు.. అసెంబ్లీలో విమర్శలు వచ్చేవి. ఇంటర్వ్యూ కోసం ఆయన్ను కలిసినప్పుడు ఆయనతో అన్నాను.. కంప్యూటర్లు కూడు పెడతాయా? మీరు రైతుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. గ్రామాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు ఓడిపోయే పరిస్థితి అంటే.. కంప్యూటర్లు కూడు పెట్టటం కాదు.. ‘‘కూడ’’ పెడతాయి. కోట్లాది రూపాయిలు కూడబెడతాయి. మీరు ఏ రైతుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని చెబుతున్నారో.. అదే రైతు బిడ్డలు అమెరికాకు వెళ్లి కోట్లాది రూపాయిలు కూడబెడతారు. నేను ఓడినా ఫర్లేదు. నాకు మెజార్టీ ముఖ్యం కాదు. ప్రయారిటీ ముఖ్యం. నా తెలుగుజాతి బిడ్డలు.. విదేశాల్లో జెండా ఎగరేస్తారు. కోట్లకు కోట్లు కూడబెడతారు. ఆంధ్రప్రదేశ్ అభివ్రద్ధి చెందుతుంది. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉంటే.. అతని కారణంగా ముగ్గురు ఉపాధి పొందుతారు. హైదరాబాద్ లో ఏడు లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే.. 21 లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతారు.