Begin typing your search above and press return to search.

18 రోజుల్లో 50 లక్షల ఇళ్లు... లోకేష్ వరుస రికార్డులు!

మొన్న యోగాంధ్ర, నిన్న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లతో ఏపీలోని కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నడూ చూడని రికార్డులు సాధించిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   19 July 2025 7:45 PM IST
18 రోజుల్లో 50 లక్షల ఇళ్లు... లోకేష్  వరుస రికార్డులు!
X

మొన్న యోగాంధ్ర, నిన్న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లతో ఏపీలోని కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నడూ చూడని రికార్డులు సాధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం పరంగా ఆ రికార్డులు సృష్టించగా.. ఇప్పుడు పార్టీ పరంగా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ మరో రికార్డ్ సృష్టించింది. అదే.. 18 రోజుల్లో సుమారు 50 లక్షలకు పైగా ఇళ్లను డోర్ టు డోర్ టచ్ చేసింది.. ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంది!

అవును... గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఘన విజయం సాధించి, చారిత్రక విజయం నమోదు చేసి ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన వైపు అడుగుపెట్టి విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేస్తూ, ఆర్ధిక వ్యవస్థను గాడిన పెడుతూ ముందుకు సాగుతోంది.

ఈ విధంగా ఓ వైపు సంక్షేమాన్ని అందిస్తూ.. మరోవైపు నవ్యాంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు విజన్ - 2047తో దూసుకుపోతోంది టీడీపీ ప్రభుత్వం. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఏడాది ప్రజాపాలనలో సాధించిన విజయాల గురించి ప్రజలకు వివరిస్తూనే.. పాలనపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ.. పథకాలు అందుతున్నాయా లేదా అనే విషయాలపై ఆరా తీస్తూ టీడీపీ నేతలు ముందుకు కదులుతున్నారు.

ఇదే సమయంలో.. ఈ ప్రభుత్వం నుంచి ప్రజలు ఇంకా ఏమి ఆశిస్తున్నారనే విషయాలనూ తెలుసుకుంటున్నారు. వీటన్నింటినీ ఒకేసారి సాధ్యం చేసింది 'సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్' కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని జులై 2న కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంగళగిరిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించారు. తమ్ముళ్లు ఫాలో అయిపోతున్నారు!

ఈ సందర్భంగా... రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా ఇంటింటికీ సంక్షేమం, అభివృద్ధి విజన్‌ ను వివరిస్తూ.. తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు తమ పరిధిలోని ప్రతీ ఇంటికి వెళ్తున్నారు. ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరిస్తున్నారు. వారి అవసరాలను తెలుసుకుంటున్నారు.

ఇదే సమయంలో... ఆయా కుటుంబాలకు అందుతున్న పథకాల గురించి కూడా తెలుసుకుని.. ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి పథకాల్ని, కార్యక్రమాలను ఆశిస్తున్నారు లాంటి అంశాల్ని కూడా నమోదు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో... మొత్తంగా ఈ 18 రోజుల్లో 50 లక్షలకు పైగా ఇళ్లను సందర్శించి సరికొత్త రికార్టుని సృషించారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఫలితంతా టీడీపీ అంటే కార్యకర్తల పార్టీ మరోసారి నిరూపించినట్లైంది.

సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా జూలై నుంచి చేపట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి వివరిస్తూ.. ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాల్ని ఒక కరపత్రం రూపంలో సిద్ధం చేసి ప్రజలకు అందిస్తోంది. ఆయా ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాలను సవివరంగా వివరిస్తోంది.

ఈ సందర్భంగా... ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు విడివిడిగా కరపత్రాల్ని సిద్ధం చేసి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు స్పష్టంగా అర్ధమయ్యేలా వివరిస్తుంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు, రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అనే తారతమ్యాలేవీ లేకుండా అందరూ తమ తమ నియోజకవర్గ పరిధిలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

ఈ సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అందుకే కార్యక్రమం మొదలైన దగ్గరనుంచి నేటి వరకు ప్రతీరోజూ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. వారిని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తున్నారు. ఫలితంగా... ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు నిరంతరంగా కృషి చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఉత్సాహంగా పనిచేసిన కార్యకర్తల్ని, నాయకుల్ని మంత్రి నారా లోకేష్ స్వయంగా అభినందిస్తున్నారు. 'మీ వెనుక నేనున్నా'నంటూ భరోసా కల్పిస్తున్నారు. ఏ చిన్న సమస్య రాకుండా టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే తెలుసుకుని దాన్ని పరిష్కరిస్తున్నారు. ఎప్పటికప్పుడు డ్యాష్ బోర్డు ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు:

* ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న సంక్షేమ పథకాలు పింఛన్లు, మెగా డీఎస్సీ, తల్లికి వందనం, అన్న క్యాంటీన్లు, దీపం-2 మొదలైన పథకాలగురించి ప్రజలకు వివరిస్తున్నారు.

* ఆ ప్రాంతంలో.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్ని తెలియజేస్తున్నారు.

* ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు గురించి చెపుతున్నారు.

* పెట్టుబడుల ద్వారా మన యువతకు అందివస్తోన్న ఉద్యోగాకవకాశాలు తెలియజేస్తున్నారు.

* ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అన్నది ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు.

* రాబోయే నాలుగేళ్లలో చేపట్టబోయే అభివృద్ధి చర్యలను వివరిస్తున్నారు.

* ప్రభుత్వం నుంచి ప్రజలు ఇంకా ఎలాంటి సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఆశిస్తున్నారో తెలుసుకుంటున్నారు.