స్టాలిన్‌కు బిగ్ టెస్ట్: 'డీఎంకే' సెంటిమెంటును బ్రేక్ చేస్తారా?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23వ తేదీన ఒకే విడతలో జరగనున్నాయి. మొత్తం 240 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రం దేశంలోనే మూడో అతిపెద్ద రాష్ట్రం.
By: Satya P | 22 March 2026 9:15 AM ISTతమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23వ తేదీన ఒకే విడతలో జరగనున్నాయి. మొత్తం 240 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రం దేశంలోనే మూడో అతిపెద్ద రాష్ట్రం. 403 అసెంబ్లీ స్థానాలతో యూపీ తొలిస్థానంలో ఉండగా.. 294 స్థానాలతో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు తమిళనాడులో జరగనున్న ఎన్నికలను అధికార పార్టీ డీఎంకే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ, ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. చీలే ఓట్లు, సామాజిక వర్గాల ప్రభావం.. సినీ నటుడు.. విజయ్ పార్టీ ఇలా.. అనేక అవరోధాలు ఉన్నాయి.
వీటికితోడు డీఎంకే పార్టీకి ఉన్న మరో సెంటిమెంటు కూడా ప్రధాన అవరోధంగానే కనిపిస్తోందని విశ్లేష కులు అభిప్రాయపడుతున్నారు. అన్నాదురై స్థాపించిన డీఎంకేను కరుణానిధి నడిపించారు. అయితే.. 1969 నుంచి ఇప్పటి వరకు.. ఐదు సార్లు డీఎంకే అధికారంలోకి వచ్చింది. కానీ.. ఒక్కవిడత కూడా వరుసగా విజయాలు అందుకోలేకపోయింది. అంటే.. వరుసగా డీఎంకే గెలవలేదు. ఈ విషయంపై కరుణ అనేకసార్లు.. ఆవేదన వ్యక్తం చేశారు.
వరుసగా రెండోసారి కూడా ముఖ్యమంత్రి కావాలని ఆయన తపించిపోయారు. కానీ, ఆయన జీవిత కాలంలో నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయితే అయ్యారు కానీ.. వరుసగా మాత్రం కాలేక పోయారు. కానీ, దివంగత జయలలిత పార్టీ అన్నాడీఎంకే మాత్రం దీనిని సాధించింది. దీంతో డీఎంకేకు ఎప్పుడూ.. రెండోసారి అధికారంలోకి రాదన్న సెంటిమెంటు స్థిరపడిపోయింది. దీనిని బ్రేక్ చేయాలన్నది కరుణ తనయుడిగా ప్రస్తుత సీఎం స్టాలిన్ పెట్టుకున్న లక్ష్యం.
2021లో జరిగిన ఎన్ని కల్లో కరుణ లేకపోయినా.. ఆయన తనయుడిగా పార్టీని అధికారంలోకి తీసుకువ చ్చారు. కానీ, ఇప్పుడు వరుసగా రెండోసారి కూడా అధికారంలోకి తీసుకువచ్చి.. తన తండ్రి కలలను నిజం చేయాలన్నది స్టాలిన్ ఆలోచన. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పిస్తున్నారు. సామాజిక వర్గాలను కూడా ఆకట్టుకుంటున్నారు. ఇష్టం ఉన్నా.. లేకున్నా.. జయలలితకు అత్యంత సన్నిహితంగా ఉండి.. గతంలో తనను దూషించిన వారిని కూడా చేరువ చేసుకుంటున్నారు. మొత్తంగా స్టాలిన్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
