ఆల్ ఫ్రీ...స్టాలిన్ స్ట్రాటజీకి ఓట్లు వర్షమేనా ?
కాదేదీ హామీకి అనర్హం అన్నట్లుగా దేశంలో రాజకీయాలు తయారైపోయాయి. రేపటి రోజున అధికారంలోకి వచ్చినపుడు చూసుకోవచ్చు.
By: Satya P | 30 March 2026 9:35 AM ISTకాదేదీ హామీకి అనర్హం అన్నట్లుగా దేశంలో రాజకీయాలు తయారైపోయాయి. రేపటి రోజున అధికారంలోకి వచ్చినపుడు చూసుకోవచ్చు. ముందు సీటు పట్టాలి. దాని కోసం హామీల వర్షం కురిపించేయడమే. జనాలకు ఉచితాల మీద మోజు ఉంది. ఆ పల్స్ ఎరిగిన పార్టీలు అక్కడా ఇక్కడా తేడా లేకుండా అన్ని చోట్లా ఫ్రీ అనేస్తున్నాయి. ఇక గెలిచిన తరువాత అవే పార్టీలు హామీల అమలుకు ఎన్ని తంటాలు పడుతున్నాయో అందరికీ ఎరిగిన సంగతే. ఇదిలా ఉంటే తమిళనాడు ఎన్నికల్లో అధికార డీఎంకే ఇలాగే ఆల్ ఫ్రీ అంటూ జనాల ముందుకు వచ్చింది.
ఘన విజయం ఖాయమంటూ :
వరసగా రెండోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న డీఎంకే తాజాగా చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టోను ఆవిష్కరించింది. అందులో ఉచితాలు మోత మోగిస్తున్నాయి. ఈ మేనిఫేస్టోని సూపర్ స్టార్ గా స్టాలిన్ అభివర్ణించడం విశేషం. అంతే కాదు ఈ మేనిఫేస్టోతో ఘన విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడమే తన మేనిఫెస్టో లక్ష్యమని ఆయన చెప్పారు
మహిళా ఓటర్ల టార్గెట్ :
ఇక మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు హామీలు ఉండగా ఎక్కువగా మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు పెద్ద ప్రయత్నమే చేశారు అని అంటున్నారు. మహిళల కోసం అనేక కీలక పథకాలను ముఖ్యమంత్రి డీఎంకే అధినేత స్టాలిన్ ప్రకటించారు. ఆదాయపు పన్ను పరిధిలోకి రాని కుటుంబాల్లోని మహిళలకు ఇల్లతరసి అనే పథకం అమలు చేస్తున్నారు. ఈ పధకం ద్వారా వారు గృహోపకరణాలు కొనుగోలు చేసేందుకు ఏకంగా 8 వేల రూపాయల విలువైన వన్‌టైమ్ కూపన్ అందిస్తామని స్టాలిన్ ఒక పెద్ద హామీ ఇచ్చారు. అలాగే మహిళా కుటుంబ పెద్దలకు ఇస్తున్న వేయి రూపాయల నెలసరి ఆర్థిక సాయాన్ని రెండు వేలకు పెంచుతామని చెప్పారు.
రైతుల కోసం :
అలాగే వరి క్వింటాల్ మద్దతు ధరను రూ. 3,500కు, చెరకు టన్ను ధరను రూ. 4,500కు రైతుల కోసం పెంచుతామని డీఎంకే మరో భారీ హామీ ఇచ్చింది. వ్యవసాయానికి మీటర్లు అవసరం లేని ఆధునిక పంపు సెట్లను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చింది. సామాజిక భద్రతలో భాగంగా, వృద్ధులు, వితంతువుల పెన్షన్‌ను నెలకు ఏకంగా రెండు వేలకు పెంచుతామని అలాగే దివ్యాంగుల పెన్షన్‌ను రెండు వేల అయిదు వందలకు డీఎంకే మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇక యూత్ కోసం అలాగే చదువుకునే విద్యార్థుల కోసం కూడా డీఎంకే అనేక హామీలు ఇచ్చింది. ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు అమలవుతున్న ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని 8వ తరగతి వరకు విస్తరిస్తామని స్టాలిన్ చెబుతున్నారు.
ల్యాప్ టాప్ లు ఫ్రీ :
అంతే కాదు, ఉన్నత విద్య అభ్యసించే 35 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఫ్రీగా పంపిణీ చేస్తామని హామీ ఇచారు. వైద్య ఆరోగ్య రంగంలో, ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం కింద బీమా కవరేజీని ఏకంగా 10 లక్షలకు పెంచడంతో పాటు ఈ పథకానికి అర్హత ఆదాయ పరిమితిని ఏడాదికి 5 లక్షలకు పెంచుతామని ప్రకటించారు. ఐదేళ్లలో 10 లక్షల కొత్త ఇళ్లు నిర్మిస్తామని కూడా మరో కీలక హామీని స్టాలిన్ ఇచ్చారు. అయితే ఈ ఫ్రీ హామీల మీద విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రతిపక్ష పీఎంకే నాయకులు మాట్లాడుతూ 2021లో డీఎంకే ఇచ్చిన 505 హామీల్లో 439 నెరవేర్చలేదని విమర్శించారు. ఇపుడు కొత్త హామీలతో ముందుకు వస్తున్నారని జనాలు నమ్మరని ఫైర్ అయ్యారు.
