Begin typing your search above and press return to search.

సడెన్ గా ఢిల్లీలో డీకే....సిద్దరామయ్య కుర్చీ కదులుతోందా ?

కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సడెన్ గా ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కేంద్ర పెద్దలతో భేటీ అయ్యారు.

By:  Tupaki Desk   |   24 April 2026 12:14 PM IST
సడెన్ గా ఢిల్లీలో డీకే....సిద్దరామయ్య కుర్చీ కదులుతోందా ?
X

కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సడెన్ గా ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కేంద్ర పెద్దలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీడియా కంటబడ్డారు. మీడియా అయితే ఆయన్ని గుచ్చి గుచ్చి ప్రశ్నించింది. కానీ డీకే దేనికీ సూటిగా సమాధానం చెప్పలేదు. కానీ ఒక్క మాట మాత్రం అన్నారు. తాను పార్టీ కేంద్ర పెద్దలను కలిశాను, మాట్లాడాను అని. అయితే ఆ వివరాలను తాను మీడియాతో పంచుకోలేను అని కచ్చితంగా చెప్పేశారు. దయచేసి తన నుంచి ఏ వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించవద్దు అని డీకే మీడియాకు కళ్లెం వేశారు.

గాలి పీల్చుకోవడానికి రాలేదు :

తాను ఢిల్లీ గాలి పీల్చుకోవడానికి అయితే రాలేదని డీకే స్పష్టం చేశారు. అంటే వచ్చిన పని ఇంపార్టెంట్ అని చెప్పకనే చెబుతున్నారు. అయితే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తాను పార్టీ విషయాలను మీడియా ముందు ఉంచలేనని కూడా ఆయనే చెప్పారు. తాను ఢిల్లీ వచ్చింది కాంగ్రెస్ పెద్దలను కలవడంతో పాటు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాల మీద కేంద్ర మంత్రులతో భేటీకి కూడా అని డీకే చెప్పడం విశేషం. అదే విధంగా ఇటీవల ముగిసిన తమిళనాడు, కేరళ, అస్సాం ఎన్నికల ప్రచారంపైన తాను కాంగ్రెస్ పార్టీకి కీలక నివేదిక ఇవ్వాల్సి ఉందని ఆ పని మీద కూడా కలిశాను అని చెప్పుకున్నారు.

మార్పు అనివార్యమా :

కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు అనివార్యమా అన్న ఈ ప్రశ్నకు కూడా డీకే శివకుమార్ జవాబు దాటవేశారు. అవనీ మీడియా ముందు చర్చించాల్సిన విషయాలు కావని అన్నారు. అదే సమయంలో డీకే సడెన్ ఢిల్లీ టూర్ అయితే కన్నడ సీమాలో రాజకీయంగా వేడెక్కిస్తోంది. నిజానికి డీకేకి రెండున్నరేళ్ళ తరువాత ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన హామీ మేరకు అమలు జరగలేదు. దాని మీద అయితే డీకే వర్గం అసహనంగా ఉంది. డీకే కూడా పలు మార్లు రాజకీయ వైరాగ్యం ప్రదర్శించారు. ఇపుడు చూస్తే ఆయనకు కాంగ్రెస్ పెద్దల నుంచి ఏమైనా సానుకూల సంకేతాలు అందాయా లేదా అన్న చర్చ సాగుతోంది.

మంత్రి వర్గ విస్తరణ :

ఇంకో వైపు చూస్తే చాలా కాలంగా సిద్ధరామయ్య మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ కోసం పట్టుబడుతున్నారు. ఆయన ఈ విషయం మీద కేంద్ర కాంగ్రెస్ పెద్దలను కలిశారు అని అంటున్నారు. ఇక ఈ మధ్యలో చూస్తే కనుక కొందరు ఎమ్మెల్యేలు మంత్రి వర్గ విస్తరణ మీద ఆశలు పెంచుకున్నారు. వారు తొందరలో ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ పెద్దలను కలుస్తారు అని అంటున్నారు. ఈ ప్రచారం సాగుతూండగానే డీకే ఢిల్లీకి వచ్చారు. అయితే కాంగ్రెస్ పెద్దల మనసులో ఏముందో తెలుసుకోవడానికి మంత్రి వర్గ విస్తరణకు అనుమతి ఇవ్వడం ఇవ్వకపోవడం అన్నది ఒక సంకేతం అని అంటున్నారు. విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక సిద్ధరామయ్య అయిదేళ్ళ ముఖ్యమంత్రి అని ఫిక్స్ అయిపోవచ్చు అని అంటున్నారు. అలా కాకుండా కనుక దానికి ఆపుతూ వస్తే మాత్రం డీకేకి చాన్స్ ఉన్నట్లే అని అంటున్నారు.

డేరింగ్ స్టెప్స్ తోనే :

ఇక కాంగ్రెస్ కి ఇప్పటిదాకా దేశంలో కర్ణాటక తెలంగాణా హిమాచల్ ప్రదేశ్ మూడు రాష్ట్రాలే సొంతంగా ఉన్నాయి. వాటికి అదనంగా కేరళ వచ్చి చేరితే అలాగే తమిళనాడులో డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ గెలిస్తే అలాగే అస్సాం లో మంచి ఫలితాలు సాధించి సీట్లు పెంచుకున్నా కాంగ్రెస్ డేరింగ్ స్టెప్స్ తీసుకుంటుంది అని అంటున్నారు. అపుడు ముఖ్యమంత్రులను మార్చాలని ఒక కీలక నిర్ణయం తీసుకునేదుకు కూడా సాహసిస్తుంది అని అంటున్నారు. కాంగ్రెస్ ఏ మాత్రం గ్రాఫ్ పుంజుకున్నా దేశంలోని కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులే ఉంటాయని అంటున్నారు. అలాగే కర్ణాటకలో చాలాకాలంగా సాగుతున్న సీఎం సీటు కుర్చీలాటకు కూడా ఏదో విధంగా లాజికల్ ఎండ్ కార్డ్ పడుతుందని అంటున్నారు. మరి అది డీకేకి ఫేవర్ గా ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఏది ఏమైనా ఢిల్లీకి వచ్చిన డీకే మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ లో కనిపించారు.