Begin typing your search above and press return to search.

చంద్రబాబు అలా చేస్తారనుకోలేదు.. కర్ణాటక డీసీఎం డీకే హాట్ కామెంట్స్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచే ప్రతిపాదనను చంద్రబాబు వ్యతిరేకించడాన్ని డీకే తప్పుపట్టారు.

By:  Tupaki Political Desk   |   4 March 2026 8:47 PM IST

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచే ప్రతిపాదనను చంద్రబాబు వ్యతిరేకించడాన్ని డీకే తప్పుపట్టారు. సీనియర్ నేత ఇలా చేస్తారని తాము ఊహించలేదని, కృష్ణా నది జలాల్లో ఏపీ వాటా వారికి వెళుతున్నా, ఆయనకు ఎందుకు అభ్యంతరమో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చాలా సీనియర్ అంటూ డేకే ప్రత్యేకంగా ప్రస్తావించడం, చంద్రబాబు స్థాయి నేత ఇలా సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూడటంపై డీకే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.

కృష్ణా నదీ జలాలపై కర్ణాటకతో యుద్ధానికి సీఎం చంద్రబాబు మళ్లీ సిద్ధమవుతున్నారని అంటున్నారు. ఈ విషయం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వయంగా వెల్లడించడం విస్తృత చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే కృష్ణా నదిలో నీటి లభ్యత బాగా తగ్గిందని అంటున్నారు. దీంతో ఎగువన ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు కృష్ణా నీటిని గరిష్టంగా వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో నదుల అనుసంధానం చేయడమే కాకుండా, గోదావరి వరద జలాలను వాడుకుంటామంటున్నా ఆయా రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఇలాంటి సమయంలో కృష్ణా నదిపై నిర్మించిన ఆల్మట్టి డ్యాం ఎత్తును మరో ఐదు అడుగులు పెంచేలా కర్ణాటక పావులు కదపడం ఏపీ ప్రభుత్వానికి ఆందోళనకు గురిచేసిందని చెబుతున్నారు. ఇప్పటికే కృష్ణా నదిలో నీటి లభ్యత తగ్గిపోయింది. గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి మళ్లిస్తూ ఆ డెల్టాను ఏపీ ప్రభుత్వం కాపాడుకుంటోంది. ఆల్మట్టి డ్యాం ఎత్తు మరికొంచెం పెరిగితే కృష్ణా నది నుంచి చుక్క నీరు కూడా కిందకు వచ్చే పరిస్థితి ఉండదని అంటున్నారు. కేవలం వరద జలాలు మాత్రమే దిగువకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీనివల్ల రాయలసీమతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు తీవ్రమైన తాగు, సాగునీటి సమస్య ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం భయపడుతోంది.

దీంతో కర్ణాటక ప్రతిపాదిస్తున్న ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును ఆదిలోనే అడ్డుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా కర్ణాటక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర జలశక్తి శాఖకు సీఎం చంద్రబాబు సుదీర్ఘమైన లేఖ రాశారు. ఆల్మట్టి ఎత్తు పెంపునకు అనుమతి ఇవ్వొద్దని, గెజిట్ చేయొద్దని ఆ లేఖలో కోరారు. దీనిపై కేంద్ర జలశక్తి శాఖ కర్ణాటక ప్రభుత్వ స్పందన కోరిందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. ప్రస్తుతం ఆల్మట్టి డ్యాం 519.16 మీటర్ల ఎత్తున ఉంది. దీనిని 525.25 మీటర్లకు పెంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

దీనిపై అనుమతుల కోసం కేంద్ర జలశక్తి శాఖకు కర్ణాటక ప్రభుత్వం లేఖ రాసింది. అయితే ఈ విషయం తెలిసి ఏపీ సీఎం చంద్రబాబులేఖ రాయడంతో గత ఏడాది జూన్ 18న జరగాల్సిన సమావేశం వాయిదా పడిందని డీకే శివకుమార్ గా వెల్లడించారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెరగకుండా సీఎం చంద్రబాబు అడ్డుకున్నా, ఇంతవరకు ఆయన ఈ విషయం బయటపెట్టలేదు. కర్ణాటకలో కూడా ఇప్పటివరకు ఈ విషయంపై ప్రభుత్వం ప్రకటన చేయలేదు. కానీ, మంగళవారం విధానసౌధలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన డీకే శివకుమార్ ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు ప్రతిపాదన ముందుకు వెళ్లకపోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు కారణమంటూ అసలు విషయం బయటపెట్టారు. ఈ సందర్భంగానే సీనియర్ నేత అయిన చంద్రబాబు ఇలా చేస్తారని తాము అసలు ఊహించలేదన్న డీకే వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.