Begin typing your search above and press return to search.

తెలంగాణాలో కాంగ్రెస్ కోసం పోటీ చేయలేదు...ఏపీలో టీడీపీ కోసం షర్మిల...!?

ఎన్నికలు కూత వేటు దూరంలో ఉండగా ఇప్పటికిపుడు కాంగ్రెస్ లేచి నిలబడుతుందని ఎవరూ అనుకోవడలేదు.

By:  Tupaki Desk   |   22 Jan 2024 4:30 PM GMT
తెలంగాణాలో కాంగ్రెస్ కోసం పోటీ చేయలేదు...ఏపీలో టీడీపీ కోసం షర్మిల...!?
X

వైఎస్ షర్మిల ఏపీలో ఏమి చేయబోతున్నారు అన్నది ఒక చర్చగా నడుస్తోంది. ఆమె చేయడానికి ఏముందని అనేవారూ ఉన్నారు. ఏ చిన్నది చేసినా విపక్షానికి మేలే కదా అని విశ్లేషించేవారూ ఉన్నారు. ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి జీరో. ఎన్నికలు కూత వేటు దూరంలో ఉండగా ఇప్పటికిపుడు కాంగ్రెస్ లేచి నిలబడుతుందని ఎవరూ అనుకోవడలేదు. అయితే గతం కంటే ఎంతో కొంత బెటర్ అవుతుందని ఆ పార్టీ విశ్వసిస్తోంది.

ఇవన్నీ పక్కన పెడితే అసలు షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మీడియాతో అన్న మాటలు ఏంటి అన్నది ఒక్క సారి చూస్తే కనుక తాను తెలంగాణాలో పార్టీ పెట్టి ఏమీ సాధించలేదు అనుకోవద్దని చాలా సాధించాను అన్నట్లుగా ఆమె మాట్లాడారు. అక్కడ ఒక నియంతను గద్దె దింపాను అని షర్మిల అంటున్నారు. అంటే బీఆర్ఎస్ ని ఆమె ఓడించింది అని చెప్పుకుంటున్నారు అన్న మాట.

ఇందులో ఎంత నిజముందో జనాలకు తెలుసు. కాంగ్రెస్ తెలంగాణాలో గెలిచింది. ఆ గెలుపు వెనక రేవంత్ రెడ్డి రెక్కల కష్టం ఉంది. మరి ఆయనను కాదని తెలంగాణాలో కాంగ్రెస్ గెలుపునకు తానే కారణం అని షర్మిల చెప్పుకుంటున్నారు. అంతే కాదు ఆమె తన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్లనే కాంగ్రెస్ గెలిచింది అని ఒక కొత్త విశ్లేషణ కూడా ఇస్తున్నారు.

నిజంగా షర్మిల పార్టీకి అంత బలం ఉందా ఆమె పోటీ చేయకపోవడం వల్లనే కాంగ్రెస్ గెలిచిందా అంటే అది పొలిటికల్ కామెడీగానే కొట్టేవేసేవారే ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆమె తాను పోటీ చేయకుండా ఒంటి చేత్తో కాంగ్రెస్ ని అక్కడ గెలిపించాను అని అంటున్నారు. ఏపీలో కూడా ఆమె పోటీ చేయదా ఏంటి అన్న చర్చ వస్తోంది.

ఒక వేళ పోటీ చేయకపోతే ఆమె గెలిపించే పార్టీ ఏది అన్నది మరో చర్చ. ఎందుకంటే ఒక నియంతను అక్కడ ఓడించాను అని ఆమె అంటున్నారు. ఆ లెక్కన మరో నియంతగా తన అన్నను ఆమె ఇండైరెక్ట్ గానే విమర్శిస్తున్నారా అన్న చర్చకు తెర లేస్తోంది. ఆమె తొలి స్పీచ్ లో కూడా జగన్ మీదనే విమర్శలు కనిపించాయి.

దాంతో ఆమె వైసీపెని ఓడించాలనుకుంటున్నారు అన్నది అర్ధం అవుతోంది. మరి వైసీపీని ఓడిస్తే గెలిచే పార్టీ ఏది అన్నది వెంటనే ప్రశ్న వస్తుంది. ముందే చెప్పుకున్నట్లుగా ఏపీలో కాంగ్రెస్ కి అంత సీన్ లేదు. అలా కనుక చూసుకుంటే ఏపీలో తాను పోటీ చేయకుండా షర్మిల టీడీపీని గెలిపిస్తారా అన్నది నెటిజన్ల నుంచి సగటు మనిషి దాకా వేస్తున్న సెటైర్లు.

ఏపీలో షర్మిల తాను ఎవరో వదిలిన బాణాన్ని కాను అని ఎంత చెప్పుకున్నా కూడా ఆమె వైసీపీ ఓట్లు చీల్చితే కచ్చితంగా లబ్ది పొందేది టీడీపీనే. అంతే కాదు ఆమె ఏపీ పీసీసీ చీఫ్ కావడాన్ని టీడీపీ అనుకూల మీడియా ఒక్క లెక్కన ఆకాశానికి ఎత్తేసి ఆమెకు విపరీతంగా పబ్లిసిటీ ఇస్తోంది. ఇవన్నీ చూసిన వారు ఏపీలో టీడీపీ కోసం షర్మిల పోటీ చేయరేమో అన్న కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి చూస్తే షర్మిల స్టేట్మెంట్స్ మాత్రం చర్చకు దారితీస్తున్నాయని అంటున్నారు.