బీజేపీలో టీఎంసీ విలీనం.. జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం!
తృణమూల్ కాంగ్రెస్ రాజకీయాలు జాతీయ స్థాయిలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పార్టీ రెండుగా చీలిపోయిందని అంటున్నారు.
By: Tupaki Desk | 13 Jun 2026 1:55 PM ISTతృణమూల్ కాంగ్రెస్ రాజకీయాలు జాతీయ స్థాయిలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పార్టీ రెండుగా చీలిపోయిందని అంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు వేర్వేరు శిబిరాలు కొనసాగుతుండటం, అందరూ కలిసి పార్టీ అధినేత్రి మమతను ధిక్కరిస్తుండటంతో టీఎంసీ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని కాపాడుకోలేని పరిస్థితుల్లో తిరుగుబాటు నేతలకు చెక్ చెప్పేందుకు కాంగ్రెస్ లో విలీనమవ్వాలనే ప్రతిపాదనను టీఎంసీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే మమతకు కళ్లెం వేసేలా తిరుగుబాటు వర్గం కూడా చురుకుగా పావులు కదుపుతోంది. దాదాపు 19 మంది ఎంపీలు బీజేపీతో చేతులు కలపడానికి సిద్దమవుతున్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.
పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై తిరుగుబాటు చేసిన ఆ పార్టీ లోక్ సభ సభ్యులు బీజేపీతో దోస్తీకి సై అంటున్నట్లు చెబుతున్నారు. 14వ తేదీ (ఆదివారం) ఢిల్లీలో సమావేశమవుతున్న తిరుగుబాటు ఎంపీలు తమ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారని అంటున్నారు. ఈ భేటీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా హాజరవుతారని జరుగుతున్న ప్రచారం ఆసక్తి రేపుతోంది. టీఎంసీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో వరుసగా భేటీ అవుతున్న సీఎం సువేందు తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి మమతా బెనర్జీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని చెబుతున్నారు.
ఇక ఢిల్లీలో సమావేశం అవుతున్న టీఎంసీ ఎంపీలు తమ భవిష్యత్తుపై ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రధానంగా బీజేపీలో చేరిపోవడం లేదంటే బీజేపీకి అనుబంధంగా టీఎంసీ ఎంపీలుగానే కొనసాగడం అన్న ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. మమత నుంచి వేరుపడేందుకు మొగ్గు చూపుతున్న ఎంపీలు తమదే అసలైన టీఎంసీగా వాదిస్తున్నారు. తమకు 2/3వ వంతు ఎంపీల మద్దతు ఉండటం వల్ల పార్టీపై తమకే హక్కు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. గతంలో మహరాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీల విషయంలో కూడా ఇదే జరిగిందని అంటున్నారు.
దీంతో టీఎంసీ తిరుగుబాటు ఎంపీల నిర్ణయం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీజేపీలో విలీనం అవ్వాలని ఆ పార్టీ నుంచి ఆహ్వానం ఉన్నప్పటికీ బెంగాల్ లో అస్థిత్వం కాపాడుకోడానికి టీఎంసీ ఎంపీలుగానే కొనసాగాలని వారు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అయితే టీఎంసీని క్లైయిం చేసుకోడానికి ఎంపీలు చేస్తున్న ప్రయత్నాలకు ఎమ్మెల్యేలు సహకరించే పరిస్థితి లేదని అంటున్నారు. ఈ పరిణామం రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చేస్తోందని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి మమత నిర్ణయాన్ని ధిక్కరిస్తూ ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీని ఎన్నుకున్న ఎమ్మెల్యేలు తమ సలహాదారుగా మమత ఉంటారని చెబుతున్నారు. రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సువేందుతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నప్పటికీ ఎంపీలతో కలిసే ప్రయత్నం చేయడం లేదని అంటున్నారు. దీంతో బెంగాల్ రాజకీయాల్లో ఏమవుతుందనేది సస్పెన్స్ గా మారిందని అంటున్నారు.
