ఏఐ సమ్మిట్ లో.. హే కృష్ణా.. ఓ అర్జునా.. డిజిటల్ తళుక్
ఇలాంటి కీలక సమ్మిట్ లో అకస్మాత్తుగా భారత పురాణ పురుషులు కృష్ణుడు, అర్జునుడు ప్రత్యక్షం అయ్యారు.
By: Tupaki Political Desk | 21 Feb 2026 7:00 PM ISTదేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతోంది కృత్రిమ మేధ సదస్సు (ఏఐ సమ్మిట్). అతిరథ మహారథులు హాజరైన ఈ సమ్మిట్ అంతే స్పందన వస్తోంది. ఏఐ... మానవాళికి సవాల్ గా మారిందా? భవిష్యత్ అంతా ఈ కృత్రిమ మేధదేనా? ఉద్యోగుల అవసరం ఉండదా..? అసలు అంతా ఏఐ అయితే జీవితాలు సాఫీగా సాగుతాయా? ఇలా అనేక చర్చోపచర్చలు... దేశాలకు దేశాలు ఏఐ చుట్టూనే తిరుగుతున్న ఈ కాలంలో సరిగ్గా సమయానికి సమ్మిట్ పెట్టినట్లుగా స్పష్టం అవుతోంది. ఏఐ ముప్పా..? ఏఐకి తిరుగులేదా? ఒకవేళ ఇలాంటి పరిస్థితే వస్తే ఏం చేయాలి? అనే ప్రశ్నలకు ఢిల్లీ సమ్మిట్ సమాధానంగానూ నిలుస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి కీలక సమ్మిట్ లో అకస్మాత్తుగా భారత పురాణ పురుషులు కృష్ణుడు, అర్జునుడు ప్రత్యక్షం అయ్యారు.
డిజిటల్ ప్రతిరూపాలు..
అర్జునుడు, కృష్ణుడు అంటే భారతీయులకు ఓ ఎమోషన్. మహాభారతం... తరతరాలుగా ఇక్కడి ప్రజలతో గాఢానుబంధం పెనవేసుకున్న ఇతిహాసం. ఇందులో ప్రధానమైన కృష్ణార్జునులు ఇప్పుడు ఢిల్లీ ఏఐ సమ్మిట్ లోనూ హల్ చల్ చేస్తున్నారు. వీరిద్దరి హైటెక్ డిజిటల్ రూపాలు సమ్మిట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే, ఇదంతా కేవలం ప్రసిద్ధ రిలయన్స్ సంస్థ పుణ్యమే.
నాడు డేటా.. నేడు డిజిటల్
రిలయన్స్ సంస్థనే జియో ద్వారా భారత్ లో డేటా విప్లవం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సరిగ్గా పదేళ్ల కిందట ఈ రోజుల్లో 300 ఎంబీ డేటా రూ.100, ఆపైనే ఉండేది. అది అయిపోతే మళ్లీ రీచార్జి చేసుకోవడమే. కానీ, ఇప్పుడు రూ.100 కే 15 జీబీ డేటా వస్తోంది. అన్ లిమిటెడ్ డేటా ప్యాక్ లు బోలెడు. ఇదంతా రిలయన్స్ 2016లో తీసుకొచ్చిన జియోతోనే సాధ్యమైంది. ఇప్పుడు ఢిల్లీ ఏఐ సమ్మిట్ లోనూ కృష్ణుడు, అర్జునుడి డిజిటల్ రూపాలను ప్రవేశపెట్టి ఔరా అనిపించింది. రిలయన్స్ కు చెందిన జియో ఇంటిలిజెన్స్ అత్యాధునిక హాలోగ్రామ్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా భారతీయ ఇతిహాసాల చిత్రాలను రూపొందించింది. ఇలా మహాభారత్ -ఏక్ ధర్మ్ యుద్ధ్ సిరీస్ లోని పాత్రలను తమ స్టాల్ లో ప్రదర్శించింది.
భక్తులతో కృష్ణార్జునుల చిట్ చాట్
కృష్ణుడు, అర్జునుడు తెరపై కనిపిస్తే.. ఇక భక్తులు ఊరుకుంటారా...? అందుకనే వారితో మాట్లాడేలా ఏర్పాటు చేసింది జియో. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేలా చేసింది. ఈ ప్రయత్నం అంతటికీ కారణం.. టెక్నాలజీ ద్వారా భారతీయ ఇతిహాసాలపై ప్రజలకు మరీ ముఖ్యంగా యువతకు ఆసక్తి కలిగించడం అని జియో తెలిపింది.
