Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ప్లేయర్ టీంలో లేకపొతే ఉప్పల్ లో మ్యాచ్ జరగనివ్వం!

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య.. ఉప్పల్ లోని క్రికెట్ స్టేడియంలో జరగనున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 April 2024 11:10 AM GMT
హైదరాబాద్  ప్లేయర్  టీంలో లేకపొతే ఉప్పల్  లో మ్యాచ్  జరగనివ్వం!
X

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య.. ఉప్పల్ లోని క్రికెట్ స్టేడియంలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ప్రధానంగా హైదరాబాద్ ఫ్యాన్స్ తో పాటు ధోనీ ఫ్యాన్స్ తీవ్ర ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఈ మ్యాచ్ కు టిక్కెట్ల అమ్మకాలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా హెచ్.సి.ఏ.పై తీవ్ర ఆరోపణలు చేశారు!

అవును.. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లకు టిక్కెట్లు దొరకకపోవడం దారుణమని దానం నాగేందర్ అన్నారు. ఎంతోమంది అండర్ 19 ప్లేయర్ లతో పాటు చాలా మంది యువత కంప్యూటర్ల ముందు కూర్చుని టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో... బుక్కింగ్స్ ఓపెన్ అయిన 15 నుంచి 20 నిమిషాల మధ్యలో టిక్కెట్స్ అన్నీ అమ్ముడైపోయినట్లు చూపిస్తుందని.. దీనికి హెచ్.సీ.ఏ. వ్యవహారాలే కారణం అని తెలిపారు!

ఇదే సమయంలో... అసలు 10 నిమిషాల్లోనే 45 వేల టిక్కెట్లు ఎలా అమ్ముడైపోతాయి అని ప్రశ్నించిన దానం నాగేందర్... టిక్కెట్లు దొరకకపోవడానికి ప్రధాన కారణం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అని ఆరోపించారు. ఇదే క్రమంలో... ఐపీఎల్ టిక్కెట్లను బ్లాకులో అమ్ముకుంటున్నారనే ఆరోపణలపైనా స్పందించిన దానం... టిక్కెట్లు దొరకకపోవడానికి ప్రధాన కారణం హెచ్.సీ.ఏ. అని పునరుద్ఘాటించారు.

ఇక.. కాంప్లిమెంటరీ పాస్ లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బ్లాక్ లో అమ్ముతుందని.. ఆ అసోసియేషన్ తీరుపై తాను ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. అనంతరం హైదరాబాద్ ప్లేయర్స్ కి అన్యాయం జరుగుతుందన్నట్లుగా స్పందించిన దానం... వచ్చే సీజన్ లో సన్ రైజర్స్ జట్టులో హైదరాబాద్ ప్లేయర్స్ లేకపోతే ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్ జరగనివ్వమని.. స్టేడియం ముందు కూర్చుని ఎలా ఆడతారో చూస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు!