పెచ్చరిల్లుతున్న అవినీతి భూతం.. బాబుకు శాపం ..!
ఒకప్పుడు చేయి తడపందే ప్రభుత్వ అధికారులు పనులు చేసేవారు కాదు. ఇది వాస్తవం. అది చిన్నదా.. పెద్దదా.. అనే దానితో సంబంధం లేకుండా.. ప్రజల నుంచి కాసులు నంజేసుకున్నారు.
By: Tupaki Desk | 30 March 2025 12:00 AM ISTఒకప్పుడు చేయి తడపందే ప్రభుత్వ అధికారులు పనులు చేసేవారు కాదు. ఇది వాస్తవం. అది చిన్నదా.. పెద్దదా.. అనే దానితో సంబంధం లేకుండా.. ప్రజల నుంచి కాసులు నంజేసుకున్నారు. అయితే.. ఏమా టకు ఆమాట చెప్పాల్సివస్తే.. ఈ వ్యవస్థను వైసీపీ తిరగరాసింది. లంచం.. అన్న మాటే వినిపించకుండా పాలన సాగించింది. అందుకే.. గత ఐదేళ్లలో ఎక్కడా లంచం అనే మాటకు ప్రాధాన్యం లేకుండా పోయింది. ఏ పనికావాలన్నా.. వలంటీర్‌కు చెప్పడం.. తేడా వచ్చినా.. వలంటీర్‌కే విన్నవించడం ద్వారా లంచాల సంస్కృతికి జగన్ స్వస్తి చెప్పారు.
తద్వారా.. ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య ఎలాంటి లంచాల బెడదా లేకుండాపోయింది. వైసీపీ సర్కారుపై ఉద్యోగులు అంత పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయడానికి.. గత ఎన్నికల్లో వైసీపీని నిలువునా ఓడించడానికి కూడా.. ఈ లంచాల వ్యవహారమే కారణమని మేదావులు సూత్రీకరించారు. తమకు పై డబ్బులు రాకుండా పోవడాన్ని ఉద్యోగులు జీర్నించుకోలేకపోయారు. తద్వారా.. వైసీపీకి వారు ఎదురుదిరిగారన్న వాదన ఉంది. అయితే.. ఈ విషయాన్ని పైకి చెప్పకుండా.. ఉద్యోగులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
కానీ ఇప్పుడు ప్రతి రోజూ.. ప్రతి జిల్లాలో అధికారుల నుంచి సిబ్బంది వరకు లంచాలు మెక్కేస్తున్నారు. ఒకప్పుడు ఏసీబీకి పనిలేకుండా పోగా.. ఇప్పుడు నమోదవుతున్న కేసులు.. వస్తున్న ఫిర్యాదులతో వారి తల బొప్పి కడుతోంది. దీంతో తమకు సిబ్బందిని పెంచాలంటూ.. తాజగా ప్రభుత్వానికి ఏసీబీ నుంచి వినతులు అందుతున్నాయి. ఈ పరిణామం.. ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. సిబ్బందిని ఇవ్వడం ఎలా ఉన్నా.. నిత్యం అనుకూల మీడియాలోనే లంచావతారుల కథనాలు వస్తున్నాయి.
అది.. ఇది.. అన్న తేడా లేదు. బర్త్ నుంచి డెత్ వరకు.. అన్నింటికీ చేతులు తడపాల్సి వస్తోందని.. టీడీపీ నాయకులే చెబుతున్నారంటే పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. జిల్లా స్థాయి అధికారి ఒకరు తాజాగా రూ.లక్ష లంచం తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు చిక్కిపోయారు. ఇక, పోలీసు స్టేషన్లు కూడా.. లంచాలకు అడ్డాగా మారిపోయాయి. ఒకప్పుడు.. చాటుమాటుగా ఉన్న ఈవ్యవహారం.. ఇప్పుడు నేరుగా దబాయించి తీసుకునే వరకు వచ్చేసింది. ఈ పరిణామాలను మార్చకపోతే.. ప్రజల్లో వ్యతిరేకత ఖాయమని.. చంద్రబాబు ఈ విషయంపై దృష్టి పెట్టాలని విన్నపాలు వెల్లువెత్తుతుండడం గమనార్హం.
