కాంగ్రెస్ దైన్యం...వైసీపీ పుణ్యమేనా ?
కాంగ్రెస్ అంటే ఉమ్మడి ఏపీ ప్రజలకు ఎంతో అభిమానం. మరెంతో విశ్వాసం.
By: Satya P | 12 March 2026 3:00 PM ISTఈ రోజున దేశంలో కాంగ్రెస్ కుదేల్ అయిపోయింది. వరసబెట్టి మూడు ఎన్నికలు కాంగ్రెస్ ని ఓడించాయి. అధికారానికి ఆమడ దూరంలో ఉంచాయి. ఇలా ఎందుకు జరిగింది అంటే కాంగ్రెస్ అగ్ర నేతలు చెప్పే మాటలు విశ్లేషణలు ఎన్నో ఉంటాయి. వాటిలోనూ నిజమెంతో కొంత ఉండొచ్చు కానీ అసలైనది వేరేది ఉంది. అదే ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ రాజకీయంగా ఇబ్బందుల్లో పడడం. ఇలా ఎందుకు జరిగింది. 2009 దాకా లేనిది 2014 నుంచి ఎందుకు మొదలైంది అంటే దాని వెనక ఉన్న వాస్తవాలను కూడా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది అని విశ్లేషకులు అంటున్నారు.
ఎమర్జెన్సీలోనూ జై కొట్టారు :
కాంగ్రెస్ అంటే ఉమ్మడి ఏపీ ప్రజలకు ఎంతో అభిమానం. మరెంతో విశ్వాసం. ఎంతలా అంటే ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన తరువాత 1977లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో దేశమంతా ఓడించినా ఏపీ జనాలు మాత్రం 41 సీట్లతో పట్టం కట్టాయి. ఆ బలమే కాంగ్రెస్ ని వరుసగా 1989, 1991, 1996, 1998, 1999, 2004, 2009 లలో కూడా కాపాడింది. ఇక ఎపుడైతే ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ దివంగతులు అయ్యారో అప్పటి నుంచే కాంగ్రెస్ కి ఉమ్మడి ఏపీలో కష్టకాలం మొదలైంది. వైఎస్ జగన్ ని కట్టడి చేసే క్రమంలో వరస తప్పులు చేసుకుంటూ పోయింది అని అంటారు. ఫలితంగా ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్న ఏపీని రాజధాని లేకుండా అడ్డగోలుగా విభజించి ఏపీ ప్రజల ఆగ్రహానికి గురి అయింది అలా తెలంగాణాలో కేసీఅర్ ని ఏపీలో జగన్ ని టాప్ లీడర్స్ గా మార్చి తాను మాత్రం పాతాళానికి కృంగిపోయింది.
జగన్ మాటల వెనక :
ఇక ఏపీలో వైసీపీ 16వ వార్షికోత్సవ సంబరాలు జరిగాయి. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధినేత వైఎస్ జగన్ మాట్లాడుతూ వైసీపీ ఎందుకు ఎలా పుట్టిందో చెప్పుకొచ్చారు. ఆనాడు కర్నూలు జిల్లా నల్ల కాలువ వద్ద జరిగిన వైఎస్సార్ సంస్మరణ సభలో తాను ఒక మాట ఇచ్చాను అని ఆయన గుర్తు చేశారు. తన తండ్రి మరణం తరువాత తట్టుకోలేక ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను పరామర్శిస్తాను అని తాను ఇచ్చిన మాట కోసమే ఎంతో దూరం వెళ్లాను అన్నారు. దానిని బట్టి ఆలోచిస్తే ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ హైకమాండ్ నో చెప్పడంతోనే కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు రావడం, కాంగ్రెస్ సభ్యత్వాన్ని వదులుకోవడం కొత్త పార్టీ అనివార్యమైన పరిస్థితుల్లో ఏర్పాటు చేయడం అలా చకచకా జరిగిపోయాయి అన్న మాట. కాంగ్రెస్ చేసిన విభజన మీద ఆగ్రహంతో ఉన్న ఏపీ జనాలు వైసీపీ వైపు చేరారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా వైసీపీ సొంతం అయింది. ఈ రోజుకీ అత్యధిక ఎంపీ సీట్లు ఉన్న ఏపీలో కాంగ్రెస్ ఉనికి పాట్లు పడుతోంది అంటే దానికి వైసీపీ ఆవిర్భావమే ప్రధాన కారణం అని చెప్పాల్సి ఉంది.
జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు :
ఇక తన ప్రసంగంలో జగన్ మరో మాట అన్నారు. వైసీపీ ఆవిర్భావం తరువాత జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయని, అవును కాంగ్రెస్ కి బలమైన రాష్ట్రం పోయింది. కాంగ్రెస్ దేశంలో తగ్గిపోయింది. ఆ ఓటమి ప్రభావం అంతటా పడింది. దానిని బీజేపీ చక్కగా వినియోగించుకుంది. ఈ రోజుకీ కాంగ్రెస్ గరిష్ట బలం ఎంపీల సంఖ్య వందకు మించడం లేదు అంటే తెలుగు రాజకీయాల నుంచి కాంగ్రెస్ ఎలా దూరం అయింది అన్నది తెలుస్తోంది అంటారు మొత్తానికి జగన్ పార్టీ పెట్టడానికి కాంగ్రెస్ పెద్దలే కారణం అని ఆయన మాటల ద్వారా లోతైన అర్ధం తెలుస్తోంది. దానికి మూల్యం కాంగ్రెస్ ఈ రోజుకీ చెల్లించుకోవడమే రాజకీయ విషాదం. రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయని అందుకే అంటారు.
