కాంగ్రెస్.. వన్ ఉమన్ షో... !
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి `వన్ ఉమన్ షో` అన్నట్టుగా మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది.
By: Garuda Media | 12 April 2026 7:00 AM ISTరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి `వన్ ఉమన్ షో` అన్నట్టుగా మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది. పార్టీలో సీనియర్లు కనిపించడం లేదు. 2024 పిబ్రవరిలో వైఎస్ షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించినప్పుడు.. పళ్లం రాజు.. రఘువీరారెడ్డి వంటి సీనియర్లు కనిపించారు. వారి మద్దతు కూడా ఆమెకు లభించింది. దీంతో షర్మిల ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా.. వారు కనిపించారు. వారి వాయిస్ కూడా వినిపించింది.
అంతేకాదు.. ఆనాటి ఎన్నికల్లో పార్టీ పుంజుకుంటుందని.. కనీసంలో కనీసం ఒకటి రెండు సీట్లయినా దక్కించుకుంటుందని అనుకున్నారు. కానీ, ఎక్కడా ఆ ఊపు కనిపించలేదు. పైగా.. జీరో.. స్థాయి అలానే కొనసాగుతోంది. ఇక, ఆ తర్వాత.. షర్మిల పూర్తిగా తన పంథాను మార్చుకున్నారు. జగన్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడంతోనే సరిపుచ్చుతున్నారు. దీంతో పార్టీ పరంగా ఎలాంటి కీలక కార్యక్రమాలూ చేపట్టడం లేదు.
గుర్తుకు వచ్చినప్పుడు ఏపీకి రావడం.. వెళ్లిపోవడం తరచుగా కామన్ అయిపోయింది. వాస్తవానికి ఏపీలో అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల.. ఇక్కడే నివాసం ఉండేలా .. ఏర్పాటు చేసుకుంటున్నట్టు తొలినాళ్లలో చెప్పారు. దీంతో విజయవాడలో నెలకు 60 వేల రూపాయల అద్దెతో విల్లాను కూడా తీసుకున్నారని ప్రచారం జరిగింది. కానీ, ఆమె హైదరాబాద్ టు ఏపీ సర్వీసు చేస్తున్నారు. పోనీ.. అలా అయినా.. పార్టీకి వెన్నుదన్నుగా మారారా? అంటే.. `కీలక`సమయాల్లో వచ్చి పోతున్నారు.
ఇదిలావుంటే.. త్వరలోనే స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచి పార్టీని బలోపేతం చేస్తే.. కనీసం అక్కడైనా తమకు మెరుగైన ఫలితం వచ్చే అవకాశం ఉంటుందని సీనియర్లు చెబుతున్నారు. కానీ, షర్మిల మాత్రం ఆదిశగా కూడా అడుగులు వేయడం లేదు. పైగా.. తన దారిలో నడిచిన వారినే నాయకులుగా ఆమె ప్రమోట్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు సీనియర్లు దాదాపు ఆమెకు దూరమవుతు న్నారు. వారిని శాంతపరిచేలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకపోతే.. ఇక, కాంగ్రెస్ పార్టీ వన్ ఉమన్ షోగానే మిగిలిపోతుందన్న టాక్ వినిపిస్తోంది.
