అసలుసిసలు అదర్శం: సర్కారు ఆసుపత్రిలో కలెక్టర్ సతీమణి ప్రసవం
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు జిల్లా కలెక్టర్ సతీమణి.
By: Tupaki Desk | 28 April 2025 10:32 AM ISTమాటలు చెప్పటం చాలా తేలిక. చేతలే కష్టం. అందునా ఆదర్శాలు వల్లించటం అందరికి ఒక అలవాటుగా మారింది. తాము చెప్పిన ఆదర్శాల్ని సైతం పాటించని ప్రముఖులు చాలా మందే ఉంటారు. ఆ మాటకు వస్తే.. తాము చెప్పిన ఆదర్శాల్ని పాటించే రేర్ పీసలు ఇటీవల కాలంలో భూతద్దం వేసుకొని వెతకాల్సిన దుస్థితి. అలాంటి వేళలో.. ఒక కీలక స్థానంలో ఉండి.. సామాన్యులు సైతం చేయలేని పనిని జిల్లా కలెక్టర్ చేయటం ఒక ఎత్తు అయితే.. సదరు ప్రముఖుడి మాటను నమ్మిన ఆయన సతీమణి మరింత స్పెషల్ గా చెప్పక తప్పదు,
ఇదంతా ఎందుకంటే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు జిల్లా కలెక్టర్ సతీమణి. జిల్లా కలెక్టర్ సతీమణి ఏంటి? ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం రావటం ఏమిటి? అని ఆశ్చర్యపోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల మీద సామాన్యులకు సైతం నమ్మకం లేకుండా పోయిన రోజుల్లో అందుకు భిన్నంగా తన భార్య డెలివరీ కోసం సర్కారు దవాఖానాలో చేర్చించటం సంచలనంగా మారింది.
తన భార్య గర్భవతి అయినప్పటి నుంచి కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లని కలెక్టర్ కోయ శ్రీహర్ష.. తన భార్యను క్రమం తప్పకుండా ఆసుపత్రికి తీసుకొచ్చేవారు. ప్రభుత్వం అందించే వైద్యం మీద ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు ఆయనీ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఆయనకు ఒక సంతానం ఉన్నారు. రెండో కాన్పు వేళ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చటం ద్వారా అందరికి ఆదర్శంగా మారారు. ఇదంతా చూసినప్పుడు అందరూ కలెక్టర్ గురించి మాట్లాడుతుంటారు. నిజానికి ఆయన మాటల్ని నమ్మి.. ఆయన ఆదర్శాలను ఫాలో అయిన ఆయన సతీమని విజయకు హేట్సాఫ్ చెప్పాల్సిందే.
