నో ఎలక్షన్స్.. కాక్రోచ్ పార్టీ అసలు ప్లాన్ ఏంటి?
సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) రాబోయే రోజుల్లో ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయదని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు.
By: Tupaki Desk | 17 Jun 2026 2:23 PM ISTసోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) రాబోయే రోజుల్లో ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయదని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. సొంత రాష్ట్రం మహారాష్ట్రకు చేరుకున్న ఆయన నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో మీ పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెడతారా? అని మీడియా ప్రశ్నించగా, రాబోయే రోజుల్లో ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేసే ఉద్దేశం తమకు లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాస్వామ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హక్కుల కోసం ఎన్నికల్లో పోటీ చేయాలనే రూల్ ఎక్కడైనా ఉందా? అంటూ ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేయకుండానే ప్రజా సమస్యలపై పోరాడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో తనపై జరిగిన భౌతిక దాడి ఘటనపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై జరిగిన దాడి వెనుక ఆర్‌ఎస్‌ఎస్ హస్తం ఉందని అభిజీత్ దీప్కే ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల నుండి, ముఖ్యంగా విద్యా వ్యవస్థలోని లోపాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇదంతా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి దాడులకు తాము భయపడేది లేదని, మహాత్మా గాంధీ, డా. బి.ఆర్.అంబేద్కర్ చూపిన బాటలో శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతానని స్పష్టం చేశారు. సమస్యలపై నిలదీస్తున్నందుకే తమను టార్గెట్ చేస్తున్నారని, భవిష్యత్తులో నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
వ్యంగ్య రాజకీయ విప్లవంగా సోషల్ మీడియాలో మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. సమస్యలపై నిలదీసేందుకు సీనియర్ నేతలు సైతం తాము కాక్రోచులుగా మారతామంటూ వ్యాఖ్యానిస్తూ ఈ సెటైరికల్ ఉద్యమకారులకు మరింత క్రేజ్ పెంచేస్తున్నారని అంటున్నారు. మరోవైపు ఈ ఉద్యమం వెనుక ప్రతిపక్షాల పాత్ర ఉందని ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అభిజిత్ దీప్కే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయని అంటున్నారు. ఎన్నికల్లో సీట్లు గెలవడం, అధికారంలోకి రావడం కంటే.. నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని అవినీతి, పేపర్ లీకేజీలు వంటి అంశాలపై యువత తరఫున గట్టి గొంతుకగా మారడమే ఈ 'కాక్రోచ్ జనతా పార్టీ' ముఖ్య ఉద్దేశమని అభిజిత్ దీప్కే చేసిన ప్రకటనతో రానున్న రోజుల్లో యువత సమస్యలపై మరిన్ని ఉద్యమాలకు ప్లాన్ చేస్తున్నట్లు ఉందని అంచనా వేస్తున్నారు.
