‘‘6 నెలలన్నారు.. 6 రోజులు ఆగలేకపోయారు..!’’ విపక్షాలపై దలపతి విజయ్ ఫైర్..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని, దశాబ్దాల నాటి ద్రవిడ పార్టీల పాలనకు చరమగీతం పాడిన టీవీకే అధినేత, సీఎం విజయ్ మాస్ డైలాగులతో విరుచుకుపడ్డారు
By: Tupaki Desk | 1 Jun 2026 11:07 PM ISTతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని, దశాబ్దాల నాటి ద్రవిడ పార్టీల పాలనకు చరమగీతం పాడిన టీవీకే అధినేత, సీఎం విజయ్ మాస్ డైలాగులతో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ఘనవిజయం అందించిన తిరుచ్చి ఈస్ట్ (తిరుచిరాపల్లి ఈస్ట్) ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు సెయింట్ జోసెఫ్ కాలేజీ గ్రౌండ్స్‌లో సోమవారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో విజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అంత ఓపిక లేదా?
బాధ్యతలు స్వీకరించి కొన్ని వారాలు మాత్రమే అవుతున్నా.. అప్పుడే విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలకు విజయ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘‘మా ప్రభుత్వానికి 6 నెలలు సమయం ఇచ్చి విమర్శిస్తామని కొందరు పెద్దలు చెప్పారు. కానీ, వారు ఇప్పుడు కేవలం 6 రోజులు కూడా మౌనంగా ఉండలేకపోతున్నారు. మేము ప్రమాణ స్వీకారం చేసిన అరగంట నుంచే తప్పులు వెతకడం ప్రారంభించారు. ఇన్నేళ్లుగా ప్రజలను మారుస్తూ, మోసం చేస్తూ వచ్చిన రెండు పార్టీలను తిరస్కరించి.. ప్రజలు తమ విజయ్‌ను, తమ ఇంట్లోని పెద్దన్నను, తమ్ముడిని గెలిపించుకున్నారు. నేను ఇక్కడ ముఖ్యమంత్రిని కాదు, మీ మొదటి సేవకుడిని" అని విజయ్ భావోద్వేగంగా పేర్కొన్నారు.
బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సింగ్.. విజయ్ అదిరిపోయే ఆన్సర్
ఇటీవల సీఎం విజయ్ కోటు, సూట్ ధరించి క్లాస్ లుక్‌లో కనిపిస్తుండటంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆయన స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ‘‘కొందరు నా డ్రెస్సింగ్ స్టైల్‌ను విమర్శిస్తున్నారు. కోటు, సూటు వేసుకోవడానికి మాకు అర్హత లేదా? అది కేవలం అధికారంలో ఉన్న కొందరికే పరిమితమా? నా గుండెలాగే నా డ్రెస్ కూడా సింపుల్‌గా ‘బ్లాక్ అండ్ వైట్’ లోనే ఉంది. ఇందులో దాచడానికి ఏం లేదు, అంతా పారదర్శకమే. బ్లాక్ కలర్ దేనికి సంకేతమో, అది ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎక్కువగా మాట్లాడే వ్యక్తిని కాదు, నా పనితోనే సమాధానం చెప్తా’’ అంటూ విమర్శకులపై విరుచుకుపడ్డారు సీఎం విజయ్. ఇక ఆయన తన ప్రసంగంలో నలుపు కోసం ప్రత్యేకంగా మాట్లాడటంతో ద్రవిడ సిద్ధాంతాన్ని అనుసరిస్తామనే సంకేతం పంపారని అంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో 'నలుపు' రంగు అనేది ద్రావిడ సిద్ధాంతానికి, సామాజిక న్యాయానికి, పెరియార్ ఉద్యమానికి పెద్ద ప్రతీకగా చెబుతారు. విజయ్ తన ప్రసంగంలో నలుపు ఎందుకు వేసుకుంటున్నానో తెలియదా? అంటూ ప్రశ్నించి ద్రవిడ సెంటిమెంట్‌ను కూడా టచ్ చేశారని వ్యాఖ్యానిస్తున్నారు.
రాష్ట హక్కులపై నో కాంప్రమైజ్!
రాష్ట్ర హక్కులను కాపాడటంలో, సెక్యులరిజం విషయంలో ఎవరితోనూ రాజీపడే ప్రసక్తే లేదని సీఎం విజయ్ స్పష్టం చేశారు. శాంతిభద్రతల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. ముఖ్యంగా మహిళల రక్షణ కోసం ఇప్పటికే ప్రత్యేక సింగపెణ్ పోలీస్ ఫోర్స్‌ను, డ్రగ్స్ రహిత తమిళనాడు కోసం యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్సు ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, నేరస్థుల పట్ల కఠినంగా ఉంటామని తేల్చిచెప్పారు.
తిరుచ్చి ఓటర్లకు ధన్యవాదాలు
సీఎం విజయ్ ఈ ఎన్నికల్లో చెన్నైలోని పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే నిబంధనల ప్రకారం ఆయన తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసి, పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దీనిపై స్పందిస్తూ.. ‘టెక్నికల్‌గా నన్ను పెరంబూర్ ఎమ్మెల్యే అనొచ్చు. కానీ నా హృదయానికి తిరుచ్చి ప్రజలు ఎప్పుడూ అత్యంత దగ్గరగా ఉంటారు" అంటూ తిరుచ్చి ఓటర్లపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. రాబోయే రోజుల్లో తమిళనాడులో రాజకీయం కేవలం టీవీకే, డీఎంకే మధ్యే ఉంటుందని, మూడో శక్తులకు తావులేదని విజయ్ ధీమా వ్యక్తం చేశారు.
