Begin typing your search above and press return to search.

ఇద్దరికీ లాస్ట్ చాన్స్...చీపురుపల్లి గిఫ్ట్ ఎవరికి...!?

విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ సీటు ఇపుడు హాట్ ఫేవరేట్ గా మారింది. మామూలుగా అయితే ఎవరూ ఈ వైపు చూసే వారు కాదు.

By:  Tupaki Desk   |   6 April 2024 7:30 AM GMT
ఇద్దరికీ లాస్ట్ చాన్స్...చీపురుపల్లి గిఫ్ట్ ఎవరికి...!?
X

విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ సీటు ఇపుడు హాట్ ఫేవరేట్ గా మారింది. మామూలుగా అయితే ఎవరూ ఈ వైపు చూసే వారు కాదు. కానీ ఇపుడు ఇద్దరు ఉద్దండులు ఈ సీటు నుంచి పోటీ చేయడంతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ వరసగా ఐదోసారి పోటీకి దిగుతున్నారు.

ఆయన ఇప్పటికి నాలుగు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు గెలిచారు. 2014లో కాంగ్రెస్ తరఫున ఆయన పోటీ చేసి కూడా 42 వేల పై చిలుకు ఓట్లను సాధించారు. అప్పట్లో వైసీపీలో ఉన్న ఆయన బంధువు బెల్లాన చంద్రశేఖర్ యాభీ వేల ఓట్లను సాధించారు. ఇలా రెండు వైపులా ఓట్లు చీలడంతో టీడీపీ గెలిచింది అని అంటారు.

బొత్స అయితే 1999లో బొబ్బిలి నుంచి లోక్ సభకు ఎంపీ అయ్యారు. ఆనాటి నుంచే చీపురుపల్లి మీద ఫోకస్ పెట్టి 2004 నాటికి తన సొంత సీటుగా మార్చుకున్నారు. ఇక్కడ తూర్పు కాపులు పెద్ద సంఖ్యలో ఉంటారు. రెండు వైపులా అభ్యర్ధులు ఆ సామాజిక వర్గం నుంచే ప్రతీ సారి పోటీ చేస్తూ ఉంటారు.

ఇక చీపురుపల్లి మొదట్లో టీడీపీకి కంచుకోట. 1983 నుంచి చూస్తే కనుక ఇప్పటికి తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఆరు సార్లు టీడీపీనే గెలిచింది. మూడుసార్లు మాత్రమే విపక్షం గెలిచింది. అందులో రెండు సార్లు కాంగ్రెస్ గెలిస్తే ఒకసారి వైసీపీ గెలిచింది. ఈ మూడు సార్లు కూడా బొత్స సత్యనారాయణే గెలవడం విశేషం. అంటే టీడీపీ విజయాలకు బ్రేక్ వేసింది ఆయనే అనుకోవాలి.

అందుకే చంద్రబాబు ఈసారి స్పెషల్ ఫోకస్ పెట్టి మాజీ మంత్రి దిగ్గజ నేత కిమిడి కళా వెంకటరావుని చీపురుపల్లి పంపించారు. చీపురుపల్లితో కిమిడి కుటుంబానికి మంచి బంధమే ఉంది. కళా వెంకటరావు బంధువు అయిన కెంబూరు రామ్మోహన్ రావు 1985లోనే చీపురుపల్లి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచారు. 2014లో కళా వెంకటరావు మరదలు కిమిడి మృణాళిని గెలిచారు మంత్రి కూడా అయ్యారు. 2019లో తమ్ముడు కొడుకు నాగార్జున టీడీపీ నుంచి పోటీ చేసారు.

అలా కిమిడి కుటుంబానికి ఇది సొంత సీటు కింద లెక్క. ఇక పదేళ్ళ నుంచి ఈ సీటు టీడీపీకి చిక్కడంలేదు. అందుకే ఈసారి కళాను రంగంలోకి దింపారు. దాంతో ఇద్దరు కీలక నేతలూ చీపురుపల్లి వేదికగా బస్తీమే సవాల్ అంటున్నారు.

ఇక చూస్తే బొత్స సత్యనారాయణ ఈసారితో తన రాజకీయానికి సరి అంటున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ఆయన చెబుతున్నారు. ఈ ఎన్నికలతో తన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెడతాను అని ఆయన అంటున్నారు. 2029లో బొత్స కుమారుడు సందీప్ ని చీపురుపల్లి నుంచి దించాలన్నది బొత్స ప్లాన్. ఇక కళా వెంకటరావు కూడా ఇవే తనకు ఆఖరు ఎన్నికలు అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి నాగార్జునకు ఈ సీటు ఇచ్చి ఆయన భవిష్యత్తుని తీర్చిదిద్దుతామని ఆయన చెబుతున్నారు.

బొత్స అలాగే కళా ఇద్దరూ డెబ్బైకి చేరువలో ఉన్నారు. ఇద్దారూ ఈసారి రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నరు. ఈసారి గెలిచి మంత్రి కావాలని కళా ఆశిస్తూంటే బొత్స కూడా మరో అయిదేళ్ల పాటు చక్రం తిప్పాలని భావిస్తున్నారు. మొత్తం మీద ఇద్దరూ ప్రజలకు తమకు గిఫ్ట్ ఇవ్వాలని అంటున్నారు. చివరి సారి పోటీ కాబట్టి కరుణించాలని అంటున్నారు. మరి చీపురుపల్లిలో ఎవరిని జనాలు ఆదరిస్తారు అన్నది చూడాలి. ఇద్దరూ సమానమైన బలాలు కలిగిన వారే కావడంతో చీపురుపల్లి రాజకీయం రక్తి కట్టిస్తోంది.