Begin typing your search above and press return to search.

కొడుకు కోసం అయ్యన్న ఏం చేయబోతున్నారు...?

అయ్యన్నపాత్రుడుకి కొడుకు విజయ పాత్రుడి బాధ్యత ఉంది. కుమారుడికి రాజకీయంగా అందలం ఎక్కించాలని ఉంది

By:  Tupaki Desk   |   19 Jan 2024 3:39 AM GMT
కొడుకు కోసం అయ్యన్న ఏం చేయబోతున్నారు...?
X

ఉమ్మడి విశాఖ జిల్లాలో తిరుగులేని నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అధినేత చంద్రబాబు పోకడల పట్ల తీవ్రంగా రగిలిపోతున్నారు. తాను టీడీపీకి వీర విధేయుడిగా ఉంటూ నాలుగు దశాబ్దాల పైగా ఉంటే తనకు అధినేత కీలక సమయంలో హ్యాండ్ ఇస్తున్నారు అన్నది అయ్యన్న ఆవేదన అని అంటున్నారు.

అయ్యన్న పాత్రుడుకి కొడుకు విజయ పాత్రుడి బాధ్యత ఉంది. కుమారుడికి రాజకీయంగా అందలం ఎక్కించాలని ఉంది. ఇదే సరైన టైం అని ఆయన భావిస్తున్నారు. ఏడు పదుల చేరువలో ఉన్న అయ్యన్నకు ఇవే చివరి ఎన్నికలు. ఈ ఎన్నికల్లోనే కుమారుడి రాజకీయం కూడా సెట్ చేయాలని చూస్తున్నారు.

అయితే చంద్రబాబు మాత్రం ఏ రకంగానూ హామీ ఇవ్వడంలేదు. అనకాపల్లి నుంచి ఎంపీ సీటుకు విజయ్ పాత్రుడు గురి పెట్టారు. ఇటీవల జరిగిన ఒక పార్టీ సభలో అయ్యన్న మాట్లాడుతూ తన కొడుకుకి ఏమి తక్కువ అని అధినాయకత్వాన్ని ఇండైరెక్ట్ గా ప్రశ్నించారు. హిందీ ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడే తన కొడుకు ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ కంటే ఏమి తక్కువ అని కొత్త పోలిక తెచ్చారు.

తన కుమారుడికి ఎంపీ సీటు టాలెంట్ చూసి ఇవ్వండి అని ఖరాఖండీగా చెప్పారు. అయితే చంద్రబాబు కనీసం అపాయింట్మెంట్ కూడా అయ్యన్నకు ఇవ్వడం లేదని ప్రచారం ఉంది. దాంతో అయ్యన్న ఇటీవల బాబు మీద మండిపోతున్నారు అని అంటున్నారు. నర్శీపట్నంలో చూసుకుంటే వైసీపీకే మొగ్గు ఉంది.

అక్కడ ఒకనాటి అయ్యన్న శిష్యుడే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. ఆయన 2014లో పాతిక వేల పై చిలుకు భారీ మెజారిటీతో అయ్యన్నను ఓడించేసారు. ఈ అయిదేళ్లలో అధికారంలో ఉంటూ మరింత పట్టు సాధించారు. మునుపటి మాదిరిగా అయ్యన్న జోరు చేయలేకపోతున్నారు. ఇటీవల నర్శీపట్నంలో జరిగిన సామాజిక బస్సు యాత్రకు జన సునామీ కనిపించింది.

దాంతో అయ్యన్న విజయం కష్టమే అన్న భావన ఉంది అంటున్నారు. ఇక అయ్యన్న కొడుకుని అనకాపల్లి ఎంపీగా దించి ఆ ఊపులో నర్శీపట్నంలో కూడా పాగా వేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇపుడు చూస్తే నర్శీపట్నంలో కూడా టీడీపీ గ్రాఫ్ పెరగలేదు అని నివేదికలు అందుతున్నాయట. దాంతోనే అధినాయకత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే వైసీపీతో డైరెక్ట్ ఫైట్ చేస్తూ వచ్చిన అయ్యన్నకు ఎటూ అర్ధం కాని పరిస్థితి ఉందని అంటున్నారు. దాంతో ఆయన వచ్చే ఎన్నికల్లో ఏమి చేయబోతారు అని అంటున్నారు. ఈసారి నర్శీపట్నంలో అయ్యన్న గెలిచి మంత్రి అయితే ఓకే. కానీ ఆయన గెలవక పార్టీ అధికారంలోకి వచ్చినా రాకున్నా అపుడు కుమారుడు విజయ్ ఫ్యూచర్ ఏమి అవుతుంది అన్న చింత అయితే ఉందిట.దాంతో అయ్యన్న ఫైర్ ఎందాకా దారి తీస్తుంది అన్నది చర్చగా ఉంది. ఈసారికి కొడుకుని నర్శీపట్నం సీటు ఇచ్చేసి తాను సైడ్ అయిపోతే ఎంతో కొంత అదే విజయ్ ఫ్యూచర్ కి సేఫ్ అని అయ్యన్న ఆలోచిస్తున్నారా అన్నది కూడా ఉంది.