Begin typing your search above and press return to search.

అమరావతి మీద జిల్లాల్లో వ్యతిరేకత !

ఏపీకి రాజధాని అమరావతి. ఈ మాటను అంతా అంగీకరిస్తున్నారు. ఏపీకి ఒక రాజధాని ఉండాలని అది సెంటిమెంట్ అని కూడా భావిస్తున్నారు.

By:  Tupaki Desk   |   19 Jun 2025 7:00 AM IST
అమరావతి మీద జిల్లాల్లో వ్యతిరేకత !
X

ఏపీకి రాజధాని అమరావతి. ఈ మాటను అంతా అంగీకరిస్తున్నారు. ఏపీకి ఒక రాజధాని ఉండాలని అది సెంటిమెంట్ అని కూడా భావిస్తున్నారు. అయితే అమరావతే ఏపీకి శరణ్యం అన్నట్లుగా పాలకులు వ్యవహరిస్తున్న తీరుతోనే చాలా జిల్లాలు వ్యతిరేకత ప్రదర్శిస్తున్నాయని అంటున్నారు.

అమరావతిని రాజధానిగా చేసుకుని అక్కడ అభివృద్ధి చేస్తూ దానితో పాటుగా అన్ని జిల్లాలలో సమగ్రమైన అభివృద్ధి చేయాలన్నది అందరి కోరిక. కానీ పాత మోడల్ లోనే టీడీపీ కూటమి వెళ్తోంది అన్న విమర్శలు వస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ అయితే అమరావతి రాజధాని మీద ఏకంగా ఏపీలోని 20 జిల్లాలకు పైగా ప్రజానీకంలో వ్యతిరేకత ఉందని తనదైన సర్వే రిపోర్టుని బయటపెట్టారు.

అమరావతిలో యాభై అంతస్తుల సచివాలయం కడతామని చంద్రబాబు చెప్పడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. బాబు మాటల మనిషి అని కామెంట్స్ చేశారు. అమరావతిలో మూడు అడుగుల గొయ్యి తీస్తే అక్కడే నీరు ఉంటుందని అలాంటి చోట ఆకాశ హర్మ్యాలు బాబు ఎలా నిర్మించగలరని ఆయన ప్రశ్నించారు.

ఏపీ ఆర్ధిక పరిస్థితి ఏ మాత్రం బాగులేదని ఆయన అన్నారు. అలాంటి సమయంలో అమరావతి వంటివి నిర్మించడం కష్టమే అన్నారు. కేవలం వైఎస్ జగన్ మీద భయంతోనే ప్రజలు బాబుని గెలిపించారని గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఏపీని చంద్రబాబు వికసిత రాష్ట్రంగా చేయలేరని ఆయన అంటున్నారు.

ఏపీలో పాలన గాడి తప్పిందని పెద్ద ఎత్తున ప్రజలలో వ్యతిరేకత ఉందని అన్నారు. ప్రజలు పది రూపాయల వడ్డీకి అప్పు తెచ్చుకుని బతుకుతున్నారని అన్నారు లా అండ్ ఆర్డర్ దెబ్బ తిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయని ఆయన ఎత్తిపొడిచారు.

జీరో కరప్షన్ అని అంటున్నారు కానీ ఎక్కడ చూసినా అవినీతి పెద్ద ఎత్తున ఉందని అన్నారు. ఎమ్మారో ఆఫీసులో పోలీస్ స్టేషన్ లో కూడా డబ్బులు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇక ఏపీ రాజధానిని దేవతల రాజధాని అని బాబు అనడం తప్పు అని ఆయన అంటున్నారు.

చంద్రబాబుకు బంధుప్రీతి ఎక్కువైందని కూడా విమర్శించారు. దాంతోనే ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకతతో ఉన్నారని అన్నారు. బాబు వల్ల ఏపీ బాగు పడేది లేదని ఆయన భారీ ప్రకటనలు చేస్తూనే ఉంటారని సెటైర్లు వేశారు. చంద్రబాబు ముందు కుప్పంలో అభివృద్ధి చేసి ఏపీ గురించి మాట్లాడాలని ఆయన అంటున్నారు. మొత్తానికి అమరావతి విషయంలో పెద్ద ఎత్తున వ్యతిరకత ఏపీ అంతటా ఉందని చింతా మోహన్ బాంబే పేల్చారు.