Begin typing your search above and press return to search.

చిలకలూరిపేటలో ఆ పార్టీ దూకుడు చేస్తోందా...!?

కొత్తగా ఎమ్మెల్యే అభ్యర్ధి చుట్టూ చేరిన వారితో ఇంకో వర్గం ఇలా వర్గాలతో వైసీపీ సతమతం అవుతూంటే టీడీపీ మాత్రం దూసుకుపోతోంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   30 March 2024 3:15 AM GMT
చిలకలూరిపేటలో ఆ పార్టీ దూకుడు చేస్తోందా...!?
X

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ వర్సెస్ వైసీపీగా సీన్ ఉంది. టీడీపీకి జనసేన బీజేపీ సపోర్ట్ గా ఉన్నాయి. ఈ మూడు పార్టీలు కలసినా కలవకపోయినా ఇక్కడ టీడీపీ అభ్యర్ధి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ముందు నుంచే బలం ఉంది. ఆయన 2019లో జగన్ వేవ్ లో ఓటమి పాలు అయ్యారు.

ఈసారి మాత్రం ఆయన కచ్చితంగా గెలుస్తారని అంటున్నారు. దానికి సరైన కసరత్తుని ఆయన రెండేళ్ల నుంచే మొదలెట్టేశారు. ఇక మంత్రిగా పనిచేసిన విడదల రజనీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపధ్యంలో ఆమెను సీటు మార్చి ఇక్కడ మొదట మల్లెల రాజేష్ నాయుడుకి టికెట్ ఇచ్చారు.

అది మంత్రి రజనీ సిఫార్సులోనే అని అంటున్నారు. అయితే వైసీపీ చేయించిన సర్వేలలో రాజేష్ నాయుడు పనితీరు మీద సంతృప్తికరమైన నివేదికలు రాలేదు. దాంతో ఆయనను మార్చి గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుకు టికెట్ ఇచ్చారు.

ఈయన నాన్ లోకల్ అని ఈయనతో వల్ల కాదని వైసీపీలో వర్గ పోరు పీక్స్ కి చేరింది అంటున్నారు. అసలే చిలకలూరిపేటలో వర్గ పోరు మొదటి నుంచి ఉంది. ఇక్కడ మర్రి రాజశేఖర్ అనే నేత ఉన్నారు. ఆయన సీనియర్. ఆయనకు టికెట్ 2014లో ఇచ్చారు. 2019లో రజనీకి ఇచ్చారు. ఇపుడు ఆయనకు ఇస్తే బాగుండేది అని అనుకున్నారు.

కానీ బీసీ నినాదం సోషల్ ఇంజనీరింగ్ లెక్కలతో వైసీపీ ప్రయోగాలు చేస్తూ పోయింది. అవి ఇపుడు పెద్దగా వర్కౌట్ కావడంలేదని అంటున్నారు. చిలకలూరిపేట లో వర్గ పోరు సాగుతూండగానే రాజేష్ నాయుడు వెళ్ళి టీడీపీలో చేరిపోయారు. దాంతో ఆ పార్టీకి మరింత బలం వచ్చేసింది.

జగన్ వేవ్ లోనే ఎనిమిది వేల ఓట్ల తేడాతో ఓటమి పాలు అయిన పుల్లారావు ఈసారి భారీ మెజారిటీతో గెలుస్తారు అని ఆ పార్టీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు వైసీపీలో మూడు ముక్కలాట సాగుతోంది. విడదల రజనీది ఒక వర్గం, అలాగే మర్రి రాజశేఖర్ మరో వర్గం, కొత్తగా ఎమ్మెల్యే అభ్యర్ధి చుట్టూ చేరిన వారితో ఇంకో వర్గం ఇలా వర్గాలతో వైసీపీ సతమతం అవుతూంటే టీడీపీ మాత్రం దూసుకుపోతోంది అని అంటున్నారు.

సరిగ్గా అయిదేళ్ల క్రితం చిలకలూరిపేటలో మంత్రిని ఓడించి విడదల రజనీ సంచలనం సృష్టించారు. కానీ ఆమె మంత్రిగా అయిన తరువాత కూడా పార్టీని పటిష్టం చేయలేకపోవడం వర్గ పోరు మరింతగా పెరగడం వంటి సంఘటనల నేపధ్యంలో బీసీల మద్దతుని కూడా టీడీపీ పొందుతోంది. సోషల్ ఇంజనీరింగ్ ప్రయోగం వైసీపీది విఫలం అవుతోందా అంటే పార్టీ ఐక్యంగా ఉంటే సక్సెస్ అవుతుందని విభేదాలు తారస్థాయిలో ఉన్న వేళ కీలక నేతలు టీడీపీ బాటన పడుతున్న క్రమంలో గెలుపు దారిని వెతుక్కోవాలంటే గట్టిగానే కష్టపడాలని అంటున్నారు.