‘చీకోటి’కే చీటింగ్ నా? దడదడలాడించాడిలా..!
ఇటీవల హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ఉన్న ఆయన కార్యాలయంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి హల్‌చల్ చేశాడు.
By: Tupaki Desk | 5 April 2025 9:58 AM ISTప్రముఖ క్యాసినో నిర్వాహకుడుగా ప్రచారంలోకి వచ్చిన చీకోటి ప్రవీణ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యక్తిగా పేరున్న ఆయన, గతంలో ఈడీ దాడులతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులతో ఆయనకు సంబంధాలున్నాయనే ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా, హెచ్‌సీయూ భూముల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించి ఆయన వార్తల్లో నిలిచారు.
ఇటీవల హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ఉన్న ఆయన కార్యాలయంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి హల్‌చల్ చేశాడు. ఆ వ్యక్తి చెడు దోషాలను తొలగిస్తానని చెప్పి ప్రవీణ్‌ను మోసం చేయడానికి ప్రయత్నించాడు. మీరు ప్రమాదంలో ఉన్నానని నమ్మబలికి, ఒక "రైస్ పుల్లర్"ను తీసుకొచ్చి అది కొంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారని మాయమాటలు చెప్పాడు. అయితే ప్రవీణ్ ఆ మోసాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా ఆయన విడుదల చేశారు. మీడియా ముందే ఈ మోసగాళ్ల తీరును పరుష పదజాలంతో వివరించాడు.
ఈ సందర్భంగా చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ సమాజంలో మోసగాళ్లు చాలా మంది ఉన్నారని, ముఖ్యంగా యువత ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత రెండు రోజులుగా ఆ వ్యక్తి తనకు ఫోన్ చేస్తున్నాడని, విషయం చెప్పకుండా కలవాలని పదే పదే కోరాడని ఆయన తెలిపారు. తీరా కలిసిన తర్వాత రైస్ పుల్లర్ పేరుతో మోసం చేయడానికి ప్రయత్నించాడని చెప్పారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని చీరాలకు చెందినవాడని వెల్లడించారు. వెంటనే టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
- చికోటి ప్రవీణ్ ఎవరు?
చికోటి ప్రవీణ్ దాదాపు 20 సంవత్సరాల క్రితం ఒక చిన్న సిరామిక్ టైల్స్ వ్యాపారిగా తన జీవితాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌లోని సైదాబాద్ వినయ్ నగర్ కాలనీలో వ్యాపారం చేస్తూ కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత నిర్మాతగా మారారు కానీ నష్టపోయారు. కొన్ని సినిమాల్లో ప్రతినాయకుడిగా కూడా నటించారు. ఒక వైద్యుడిని కిడ్నాప్ చేసిన కేసు కూడా ఆయనపై నమోదై ఉంది. అనంతరం గోవా వెళ్లిన ప్రవీణ్, అక్కడ పేకాట క్లబ్‌లో కొన్ని టేబుళ్లను అద్దెకు తీసుకున్నారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక పెద్ద క్యాసినో సామ్రాజ్యాన్ని స్థాపించారని మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం చీకోటి ప్రవీణ్ నే మోసం చేయాలని చూసిన కేటుగాళ్లను పట్టించి మరోసారి వార్తల్లో నిలిచారు.
