కస్టడీలో.. జైల్లోనూ రచ్చరచ్చ చేస్తున్న చెవిరెడ్డి
మద్యం కుంభకోణంలో అరెస్టు అయి.. కస్టడీలో ఉన్న వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీరు ఇప్పుడు సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 4 July 2025 12:01 PM ISTమద్యం కుంభకోణంలో అరెస్టు అయి.. కస్టడీలో ఉన్న వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. నేత ఎవరైనా.. కేసులు. కస్టడీలో ఉన్న వేళలో తమ తీరుకు భిన్నంగా వ్యవహరిస్తారు. కామ్ గా ఉంటారు. తమదైన సమయం కోసం ఎదురుచూస్తుంటారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు చెవిరెడ్డి. లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి.. మూడు రోజుల సిట్ కస్టడీని పూర్తి చేసుకున్నారు.
మూడు రోజుల వ్యవధిలో దాదాపు 200 ప్రశ్నలు అడగ్గా.. వాటిల్లో ఏ ఒక్క దానికి సరైన సమాధానం ఇవ్వలేదు. తనకు తెలీదని.. తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. విచారణ వేళ పెద్ద పెద్దగా కేకలు వేయటం.. అధికారుల మీద అరవటం.. వారిని హెచ్చరించటం లాంటివి చేసినట్లుగా తెలుస్తోంది. చెవిరెడ్డి వ్యవహారశైలి మొత్తం కెమేరాల్లో రికార్డు అయినట్లుగా చెబుతున్నారు,
విచారణ వేళ సిట్ అదికారుల్ని తిట్టటం.. శాపనార్థాలు పెట్టటం లాంటి దురుసు ప్రవర్తనను ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది. విచారణ వేళలో చెవిరెడ్డి వ్యవహారశైలికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ను కోర్టుకు సబ్మిట్ చేయనున్నట్లు చెబుతున్నారు. తనను విచారిస్తున్న అధికారుల్ని ఉద్దేశించి చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సిట్ లో ఎవరెవరు పని చేస్తున్నారో? వారి చరిత్ర ఏమిటో తనకు తెలుసన్న.. 'మీ అందరి సంగతి తేలుస్తా. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సిట్ కార్యాలయం ఎదుటే ఇంటిని అద్దెకు తీసుకుంటా. ఒక్కొక్కరి సంగతి తేలుస్తా' లాంటి వార్నింగ్ లు ఇవ్వటం కలకలాన్ని రేపుతోంది.
కేసుల వేళ అధికారులు చట్టానికి అనుగుణంగా వ్యవహరిస్తారే తప్పించి.. సొంతంగా స్పందించటం.. హద్దులు మీరటం లాంటివి చాలా అరుదుగా మాత్రమే ఉంటాయి. ఎందుకంటే.. అధికారుల పని చట్టానికి అనుగుణంగా పని చేయటమే తప్పించి వ్యక్తిగత ఎజెండా ఏమీ ఉండదు. ఈ విషయాన్ని చెవిరెడ్డి ఎందుకు మిస్ అవుతున్నారు? అన్నది మరో ప్రశ్న. విచారణ వేళ చెలరేగిపోయి.. పెద్ద పెద్దగా అరుస్తూ.. కేకలు వేస్తూ అధికారులపై విరుచుకుపడిన చెవిరెడ్డి తీరుకు అధికారులు ఎంతో ఓపికతో వ్యవహరించినట్లుగా తెలుస్తోంది.
ఒకదశలో మాత్రం.. ‘‘లిక్కర్ కుంభకోణంలో మీ ప్రమేయం ఉన్న అంశానికి సంబంధించి సాంకేతిక ఆధారాలు ఉన్నాయి. గట్టిగా కేకలు వేసి దబాయించినంత మాత్రాన మీరు తప్పించుకోలేరు’’ అంటూ గట్టిగా బదులు ఇచ్చిన సందర్భంలో మాత్రం చెవిరెడ్డి కాస్త వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. లిక్కర్ స్కాంలో అదుపులోకి తీసుకున్న నాటి నుంచి చెవిరెడ్డి వాదన ఒకటిగానే ఉంది.
తాను ఏ తప్పు చేయలేదని.. తనకు సంబంధం లేదని.. అధికారులు చెబుతున్న డబ్బుల్ని తాను ఎప్పుడూ ముట్టుకోలేదని చెప్పటంతో పాటు.. అధికారుల మీద కోపంతో అరవటం.. సంతకాలు పెట్టాలంటూ ఇచ్చిన పేపర్లను చించేయటం లాంటివి చేయటం హాట్ టాపిక్ గా మారింది. సిట్ విచారణ వేళ.. అధఇకారులు ఆయనకు అందించిన ఆహారం.. మంచినీటిని తీసుకోకుండా ఉండటంతో. ఇదే విషయాన్ని జడ్జికి సమాచారం అందించారు.
ఆహారం తీసుకోకపోవటం తనకు సమ్మతితోనే జరుగుతుందన్న విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ఇప్పటివరకు కేసులు నమోదై.. విచారణకు వచ్చిన వైసీపీ నేతల తీరంతా ఒక ఎత్తు అయితే.. చెవిరెడ్డి తీరు భిన్నంగా ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. జైల్లోనే పలు సందర్భాల్లో జైలు తలుపుల్ని కాళ్లతో బలంగా తన్నటం.. సిబ్బంది మీద అరవటం లాంటివి చేస్తున్నట్లు చెబుతున్నారు. లిక్కర్ కేసులో తన అనుచరుల్ని (బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ క్రిష్ణ) ఇద్దరిని గుంటూరు జైలుకు తరలించిన వైనం తెలుసుకున్న చెవిరెడ్డి విపరీతంగా స్పందించినట్లు చెబుతున్నారు. తాను ఉన్న జైలుకు కాకుండా వేరే జైలుకు ఎలా తరలిస్తారు? అంటూ జైల్లో పెద్ద పెట్టున కేకలు వేసినట్లుగా తెలుస్తోంది.
