Begin typing your search above and press return to search.

జోగయ్య ఇచ్చిన సీట్లు చంద్రబాబు జనసేనకు ఇస్తారా...!?

మాజీ మంత్రి హరిరామజోగయ్య కాపు సేన ప్రెసిడెంట్ గా ఉన్నారు. దాని కంటే మించి పవన్ కి శ్రేయోభిలాషి గా ఉన్నారు

By:  Tupaki Desk   |   19 Jan 2024 3:56 AM GMT
జోగయ్య ఇచ్చిన సీట్లు చంద్రబాబు జనసేనకు ఇస్తారా...!?
X

మాజీ మంత్రి హరిరామజోగయ్య కాపు సేన ప్రెసిడెంట్ గా ఉన్నారు. దాని కంటే మించి పవన్ కి శ్రేయోభిలాషి గా ఉన్నారు. ఆయన జనసేనకు సర్వవేళలా రక్షకుడిగా కూడా ఉన్నారు. పవన్ సైతం ఆయన సీనియారిటీని గౌరవిస్తారు. పెద్దాయన అని ఎంతో మర్యాద చేస్తారు. ఇటీవల పవన్ కళ్యాణ్ మంగళగిరి అఫీసుకు స్వయంగా ఎనిమిది పదులు పై దాటిన జోగయ్యను పిలిపించుకుని ప్రత్యేకంగా చాలా సేపు చర్చించారు.

ఆయన నుంచి సలహాలు తీసుకున్నారు. జోగయ్య కూడా తన రాజకీయ అనుభవం అంతా పండించినది ఏర్చి కూర్చి పవన్ కి సలహా ఇచ్చారు. ఆరు నూరు అయినా కాపుల ఆత్మ గౌరవంతో పాటు చిరకాల కోరిక అయిన సీఎం సీటు విషయంలో సాధించాల్సిన బాధ్యత పవన్ దే అంటూ జోగయ్య చెప్పాల్సింది చెప్పేశారు.

ఇపుడు చూస్తే లేటెస్ట్ గా జోగయ్య జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలో చెబుతూ అక్కడి క్యాండిడేట్లను కూడా డిక్లేర్ చేస్తూ లిస్ట్ రిలీజ్ చేయడం కలకలం రేపుతోంది. అందులో చాలా కీలకమైన సీట్లు ఉన్నాయి. టీడీపీ దిగ్గజ నేతలు, సీనియర్ల సీట్లు కూడా ఉన్నాయి. వాటిని జనసేనకు ఇవ్వాలని కోరుతూ అక్కడ అభ్యర్ధులు ఎవరు ఉండాలో కూడా జోగయ్య సూచించేశారు.

దీని మీదనే ఇపుడు చర్చ సాగుతోంది. నిజంగా ఇన్ని సీట్లు టీడీపీ ఇస్తుందా అన్నది ఒక చర్చ అయితే నంబర్ పక్కన పెడితే కీలకమైన సీట్లు టీడీపీ దిగ్గజ నేతల సీట్లు పొత్తుతో పోగొట్టుకుంటుందా అన్నది కూడా మరో చర్చగా ఉంది.

జనసేనకు ఎన్ని సీట్లు టీడీపీ ఇవ్వాలనుకుంటోంది అన్నది ఒక పెద్ద ప్రశ్న అయితే ఆ ఇచ్చే సీట్లు ఎక్కడ ఇస్తారు అన్నది రెండవ ప్రశ్న. ఈ రెండూ తేలితేనే తప్ప ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఫలించినట్లు కాదని అంటున్నారు. ఇక జోగయ్య లిస్ట్ ప్రకటించేసి చాలా మందిని అభ్యర్ధులుగా చేసేసారు. సహజంగా వారిలో కొత్త ఆశలు మొలకెత్తుతాయి.

ఇపుడు ఆయా సీట్లలో పోటీకి వారు ఉత్సాహం చూపిస్తారు. మరి అక్కడ కాదూ కూడదు అంటే వారి మనోభావాలు ఎలా ఉంటాయన్నది కూడా చూడాల్సి ఉంది. ఇంకో వైపు చూస్తే పొత్తు విషయనంలో టీడీపీ ఇంకా నానుస్తూ పోతే ఇలాంటి లిస్టులు మరిన్ని వస్తాయి. అపుడు ఆశలు ఇంకా పెరిగిపోయి దూరం కూడా పెరిగి పెద్దది అవుతుంది అని అంటున్నారు.

అందువల్ల ఎంతకాలం వెయిటింగ్ లో పెడితే అంతకాలం అలా పొత్తు కాస్తా ఎత్తులు కొత్త మలులుపులూ తీసుకుంటూ మరింత సంక్లిష్టం అవుతుంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే జోగయ్య చంద్రబాబు పవన్ పొత్తుల వ్యవహారాన్ని సాఫీగా చేసేందుకు లిస్ట్ రిలీజ్ చేసినట్లుగా చెబుతున్నా అది బెడిసికొడితే ఫిట్టింగ్ పెట్టినట్లుగానే ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి దీని మీద పవన్ చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో.