Begin typing your search above and press return to search.

దివాలా దిశగా... చాట్ జీపీటీ: ఖ‌ర్చులు భ‌రించ‌లేక‌పోతున్నారా?

చాట్ జీపీటీ.. ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా వినియోగంలోకి వ‌చ్చిన ఆన్‌లైన్ స‌మాచార వేదిక‌

By:  Tupaki Desk   |   14 Aug 2023 7:20 AM GMT
దివాలా దిశగా... చాట్ జీపీటీ: ఖ‌ర్చులు భ‌రించ‌లేక‌పోతున్నారా?
X

చాట్ జీపీటీ.. ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా వినియోగంలోకి వ‌చ్చిన ఆన్‌లైన్ స‌మాచార వేదిక‌. ఒక విష‌యం పై స‌మాచారాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా సేక‌రించి.. ఇచ్చే చాట్ జీపీటీ.. ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌(ఏఐ) ఆధా రంగా ప‌నిచేస్తుంది. అయితే.. ఇప్పుడు ఈ సంస్థ దివాలా దిశ‌గా అడుగులు వేస్తోంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. దీనికి కార‌ణం.. చాట్ జీపీటీ నిర్వ‌హ‌ణ‌కు రోజుకు రూ. కోట్ల వ్య‌యం అవుతుండ‌డ‌మేన‌ని అంటున్నారు.

చాట్ జీపీటీపై తాజాగా అనలటిక్స్‌ ఇండియా మ్యగజైన్ ఓ నివేదిక విడుద‌ల చేసింది. దీనిలో సంచ‌ల‌న విష‌యాలను వెల్ల‌డించింది. 2024 నాటికి చాట్‌జీపీటీ దివాలా తీసే ప్రమాదం ఉందని హెచ్చ‌రించింది. చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ. దీనిని శామ్‌ ఆల్ట్‌మన్ రూపొందించారు. అయితే.. ఈ సంస్థ ప్ర‌స్తుతం ఆర్థిక సంక్షోభం అంచున ఉండే అవకాశం ఏర్ప‌డింద‌ని నివేదిక స్ప‌ష్టం చేసింది.

'ఎక్కువ ఖర్చుతో ఉండే API లను ఏఐలో వినియోగించటం కూడా నష్టాలకు ముఖ్య కారణం. ఒక్కో ఏఐ సర్వీసును రోజంతా అందించటానికి రూ.5.80 కోట్లు ఖర్చవుతోంది. దీంతో ఆల్ట్‌మన్‌ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే అవకాశం లేకపోలేదు. GPT-3.5, GPT-4 వెర్షన్లు తీసుకొచ్చి డబ్బును ఆర్జించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవి ఫలితాలు ఇవ్వలేకపోయాయి' అని నివేదిక స్ప‌ష్టం చేసింది.

అన‌తికాలంలోనే..

చాట్ జీపీటీ అందుబాటులోకి వ‌చ్చిన అన‌తి కాలంలోనే అంద‌రి ఆద‌ర‌ణను పొందింది. అయితే.. అదే స‌మ‌యంలో అత్యంత వేగంగా.. నిరాద‌ర‌ణ‌కు కూడా గురైంది. ఎందుకంటే.. దీనివ‌ల్ల ఉద్యోగాలు పోతా య‌ని.. భ‌యాందోళ‌న తెర‌మీదికిరావ‌డ‌మే. ఇదిలావుంటే.. చాట్ జీపీటీ ఇప్ప‌టి వ‌ర‌కు.. ఆర్జ‌న దిశ‌గా అడుగులు వేయ‌లేదు. పైగా లాభాల బాట కూడా ప‌ట్ట‌లేదు. దీంతో పాటూ ఈ ఏఐ వాడకం కూడా క్రమేపీ తగ్గింది.

జూన్‌లో 1.7 బిలియన్ల మంది చాట్‌జీపీటీని వినియోగిస్తుండేవారు. కానీ, ప్రస్తుతం వీరి సంఖ్య 12శాతం క్షీణించి 1.5 బిలియన్లకు చేరింది. రాబోయే రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉంది. మొదట్లో చాలా కంపెనీలు తమ సంస్థలో చాట్‌జీపీటీ వినియోగానికి అంగీకరించలేదు. కానీ, ఇప్పుడు తమ సంస్థల కోసం ప్రత్యేకంగా ఏఐ చాట్‌బాట్‌లను తయారు చేయించుకుంటున్నాయి. ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సరికొత్త కృత్రిమ మేధ వ్యవస్థ 'లామా2' ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేసిన ఎలాన్ మ‌స్క్ కూడా.. సొంత‌గాఏఐని డెవ‌ల‌ప్ చేసుకుంటున్నారు. దీంతో చాట్ జీపీటీ సంస్థ దివాలా తీయ‌డం ఖాయ‌మ‌నేది నివేదిక అంచ‌నా. ఏం జ‌రుగుతుందో చూడాలి.