చాట్ జీపీటీకి ఏమైంది? జలుబు చేసిందా? ఫీవర్ వచ్చిందా?
కృత్రిమ మేధ (AI) ఆధారిత ప్రముఖ చాట్‌బాట్ అయిన చాట్‌జీపీటీ (ChatGPT) సేవలకు మంగళవారం ఉదయం నుంచి గణనీయమైన అంతరాయం ఏర్పడింది.
By: Tupaki Desk | 16 July 2025 12:59 PM ISTకృత్రిమ మేధ (AI) ఆధారిత ప్రముఖ చాట్‌బాట్ అయిన చాట్‌జీపీటీ (ChatGPT) సేవలకు మంగళవారం ఉదయం నుంచి గణనీయమైన అంతరాయం ఏర్పడింది. భారత్‌తో పాటు ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా దేశాలలోని లక్షలాది మంది వినియోగదారులు ఈ సేవలను యాక్సెస్ చేయలేకపోయారు.
ఈ అంతరాయం కారణంగా చాట్‌జీపీటీ యాప్ లేదా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసినప్పుడు చాట్ హిస్టరీ లోడ్ అవకపోవడం, కొత్త చాట్ ప్రారంభించడానికి ప్రయత్నించినప్పుడు "అసాధారణ ఎర్రర్ " సందేశాలు కనిపించడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. అనేక మంది యూజర్లు ఈ సమస్యలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. డౌన్‌డిటెక్టర్ నివేదిక ప్రకారం, సుమారు 82 శాతం మంది వినియోగదారులకు సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు వెల్లడైంది.
-ఓపెన్‌ఏఐ స్పందన, సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు
ఈ సమస్యపై ఓపెన్‌ఏఐ, చాట్‌జీపీటీ సృష్టికర్త సంస్థ, అధికారికంగా స్పందించింది. తమ సర్వర్లలో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించినట్లు తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించడానికి తమ సాంకేతిక బృందం నిరంతరం ప్రయత్నిస్తోందని, త్వరలోనే అన్ని సేవలను సాధారణ స్థితికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఓపెన్‌ఏఐ పేర్కొంది. ఈ సాంకేతిక అంతరాయం చాట్‌జీపీటీ రికార్డ్ మోడ్, కోడెక్స్, సోరా వంటి ఇతర ఓపెన్‌ఏఐ సర్వీసులపై కూడా ప్రభావం చూపినట్లు వెల్లడైంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ నెలలో చాట్‌జీపీటీ సేవలు నిలిచిపోవడం ఇది రెండోసారి. ఏఐ ఆధారిత చాట్‌బాట్ అయినా సరే.., వినియోగంలో పాక్షికంగా లేదా పూర్తిగా అంతరాయం ఏర్పడటం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
- చాట్‌జీపీటీ.. ఒక ఆవిష్కరణ
2022లో ఓపెన్‌ఏఐ సంస్థ అభివృద్ధి చేసిన చాట్‌జీపీటీ, లాంచ్ అయినప్పటి నుంచీ ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. చిన్న ప్రశ్నల నుంచి క్లిష్టమైన అంశాలపై సమాధానాలు ఇవ్వడం, ప్రోగ్రామింగ్ కోడ్‌లు, కవిత్వం, వ్యాసాలు, భాషానువాదం వంటి విభిన్న పనులు చేయగల సామర్థ్యం దీనికి ఉంది. ఫలితంగా విద్యార్థులు, సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలు తదితర వర్గాల వారంతా దీన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు.
అయితే, చాట్‌జీపీటీపై అతిగా ఆధారపడడం మంచిది కాదని, ఈ టూల్ సృష్టికర్త అయిన ఓపెన్‌ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్‌మన్ గతంలోనే హెచ్చరించారు. ఏఐ టూల్స్ వినియోగం జీవితాన్ని సులభతరం చేస్తాయనే నిజమే కానీ, వాటిపై పూర్తిగా ఆధారపడడం భావనాత్మక, సృజనాత్మక సామర్థ్యాల్ని తగ్గించే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
- తాత్కాలిక అంతరాయం.. తుది పరిష్కారం కోసం వేచి చూడాలి
ప్రస్తుతం చాట్‌జీపీటీ సేవలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడినప్పటికీ, ఓపెన్‌ఏఐ త్వరితగతిన సమస్య పరిష్కరించి సేవలను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తోంది. వినియోగదారులు కొంతకాలం వేచి చూస్తే, తిరిగి సేవలు అందుబాటులోకి వస్తాయి.
