చాట్ జీపీటీ.. గూగుల్ ను మించి ఏంటీ స్పీడు?
ఓపెన్‌ఏఐ సంస్థ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. చాట్ జీపీటీ రోజుకు ఏకంగా 2.5 బిలియన్ (250 కోట్లు) ప్రాంప్ట్‌లను ప్రాసెస్ చేస్తోంది.
By: Tupaki Desk | 22 July 2025 10:00 PM ISTకృత్రిమ మేధస్సు (AI) మన దైనందిన జీవితంలోకి ఊహించని వేగంతో చొచ్చుకు వస్తోంది. ఈ విప్లవానికి నాయకత్వం వహిస్తున్న వాటిలో చాట్ జీపీటీ ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా సమాచారాన్ని పొందే.. పరస్పర చర్య చేసే విధానాన్ని మార్చేస్తోంది. అంతేకాదు టీనేజర్ల మధ్య AI కంపానియన్‌ల వాడకం పెరుగుతుండటం సామాజికంగా కొన్ని ఆందోళనలను కూడా రేకెత్తిస్తోంది.
- చాట్‌జీపీటీ విస్తరణ
ఓపెన్‌ఏఐ సంస్థ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. చాట్ జీపీటీ రోజుకు ఏకంగా 2.5 బిలియన్ (250 కోట్లు) ప్రాంప్ట్‌లను ప్రాసెస్ చేస్తోంది. వీటిలో 33 కోట్ల ప్రాంప్ట్‌లు ఒక్క అమెరికా నుంచే వస్తున్నాయని 'ఆక్సియోస్' నివేదించింది. కేవలం 8 నెలల కాలంలోనే 1 బిలియన్ నుండి 2.5 బిలియన్‌కు పెరగడం ద్వారా చాట్ జీపీటీ ఏకంగా 150 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది నిజంగా ఇంక్రెడిబుల్ వేగం!
-గూగుల్‌కు సవాల్ విసురుతున్న చాట్‌జీపీటీ
ప్రస్తుతం గూగుల్ రోజుకు సుమారు 14 బిలియన్ సెర్చ్ క్వెరీలను హ్యాండిల్ చేస్తుందని పరిశ్రమ అంచనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చాట్‌జీపీటీ ప్రస్తుత వృద్ధి రేటు గూగుల్ ఆధిపత్యాన్ని సవాలు చేసే దిశగా సాగుతోంది. సాధారణ సెర్చ్ ఇంజిన్‌లకు భిన్నంగా, చాట్‌జీపీటీ సంభాషణాత్మక ప్రతిస్పందనలు ఇవ్వడం వినియోగదారుల మానసికతలో స్పష్టమైన మార్పును తీసుకొచ్చింది. ప్రజలు దీన్ని కేవలం సమాచారం కోసం మాత్రమే కాకుండా, వివిధ పనులకు ఉపయోగిస్తున్నారు. 36.8% మంది సాధారణ రీసెర్చ్ కోసం వాడుతుండగా.. 14.6% మంది కోడింగ్ కోసం.. 14.1% మంది ఈమెయిల్ రాయడంలో నైపుణ్యానికి వాడుతున్నాయి.
ఓపెన్‌ఏఐ వాయిస్ ఇన్‌పుట్, ఇమేజ్ ప్రాసెసింగ్, ఎంటర్‌ప్రైజ్ ఇంటిగ్రేషన్లను జోడిస్తూ నిరంతర అభివృద్ధిలో ఉంది. మైక్రోసాఫ్ట్‌తో దాని భాగస్వామ్యం కూడా ఈ విస్తరణలో కీలక పాత్ర పోషిస్తోంది. కంటెంట్ క్రియేటర్లు , డిజిటల్ మార్కెటర్లకు ఇది స్పష్టమైన సంకేతం.. ఇప్పుడు SEO కంటే ఎక్కువగా, AIకి తగ్గట్టుగా కంటెంట్ రూపొందించాల్సిన అవసరం ఏర్పడుతోంది.
-టీనేజర్లలో AI కంపానియన్‌ల వినియోగం: ఆందోళనలు
కొత్తగా విడుదలైన 'కామన్ సెన్స్ మీడియా' నివేదిక ప్రకారం.. 13-17 సంవత్సరాల వయస్సు గల అమెరికన్ టీనేజ్‌లలో 72% మంది కనీసం ఒక్కసారైనా AI కంపానియన్‌లను ఉపయోగించారు. వీరిలో సగం మందికి పైగా (52%) రెగ్యులర్ యూజర్లుగా మారారు. ఇది ఒక సామాజిక ప్రక్రియగా ఆందోళన కలిగిస్తోంది. 30% మంది వినోదం కోసమే AIని ఉపయోగించారు. 28% మంది శాస్త్రీయ ఆసక్తితో ప్రయోగాలు చేశారు. 18% మంది వ్యక్తిగత సలహాల కోసం చాట్‌జీపీటీ లాంటి కంపానియన్‌లపై ఆధారపడ్డారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, 33% మంది టీనేజ్‌లు AI కంపానియన్‌లతో చాట్ చేయడం నిజమైన మిత్రులతో మాట్లాడినంత తృప్తినిస్తుంది అని పేర్కొన్నారు. ఇది యువతలో సామాజిక సంబంధాలపై AI ప్రభావం గురించి ప్రశ్నలు లేవనెత్తుతోంది.
-భద్రతపై పెరుగుతున్న భయాలు
AI కంపానియన్ యాప్‌లపై వివాదాలు కొనసాగుతున్నాయి. ఫ్లోరిడాలో ఒక టీనేజర్ ఆత్మహత్యకు కారణమయ్యారన్న ఆరోపణలతో క్యారెక్టర్.ఏఐ సంస్థపై కేసులు దాఖలయ్యాయి. అంతేకాకుండా 24% మంది టీనేజ్‌లు AIతో వ్యక్తిగత సమాచారం షేర్ చేశారని వెల్లడైంది. ముఖ్యంగా 13-14 ఏళ్ల వయస్సు వారు ఎక్కువగా AI సలహాలను నమ్ముతున్నారని తెలిసింది. ఇది వారి భద్రతపై తీవ్ర ఆందోళనలను పెంచుతోంది.
ఇంత వేగంగా విస్తరిస్తున్న ChatGPT, అలాగే AI కంపానియన్‌ల వినియోగం మన జీవితాల్లో సమాచారం పొందే తీరు, భావోద్వేగాలను వ్యక్తీకరించే పద్ధతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ టెక్నాలజీని సక్రమంగా ఉపయోగించడానికి సమర్థవంతమైన మార్గదర్శకాలు లేకపోతే, ముఖ్యంగా యువతపై దీని ప్రభావం ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
AI భవిష్యత్తును స్వాగతించడమే కాకుండా, దాని వినియోగాన్ని సమర్థవంతంగా నియంత్రించడమూ నేటి సమాజానికి అత్యంత అవశ్యకం. ఈ టెక్నాలజీతో మనం ఎలా ముందుకు వెళ్లాలో, ముఖ్యంగా యువతకు సురక్షితమైన వాతావరణాన్ని ఎలా కల్పించాలో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.
