Begin typing your search above and press return to search.

''మనం సిద్ధం అంటుంటే చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేమంటున్నారు''

వ‌చ్చే ఎన్నిక‌ల్లో దొడ్డిదారిలో గెలిచేందుకు సినిమాలో దుర్మార్గులైన విల‌న్‌ల‌కంటే.. చంద్ర‌బాబు అంత‌కుమించిన దుర్మార్గాలు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

By:  Tupaki Desk   |   23 Feb 2024 9:29 AM GMT
మనం సిద్ధం అంటుంటే చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేమంటున్నారు
X

మనం సిద్ధం అంటుంటే చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేమంటున్నారు అని వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ టీడీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఓడించేందుకు కుప్పం ప్ర‌జ‌లు కూడా రెడీగా ఉన్నార‌ని తెలిపారు. ''బైబై బాబు'' అనే మాట కుప్పంలో ప్ర‌తి ఇంటి నుంచి వినిపిస్తోంద‌ని తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో దొడ్డిదారిలో గెలిచేందుకు సినిమాలో దుర్మార్గులైన విల‌న్‌ల‌కంటే.. చంద్ర‌బాబు అంత‌కుమించిన దుర్మార్గాలు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తాజాగా శుక్ర‌వారం ఒంగోలులో ప‌ర్య‌టించిన సీఎం జ‌గ‌న్‌.. జ‌గ‌న‌న్న ఇళ్ల ప‌థ‌కంలో ల‌బ్ధిదారులైన 21 వేల మందికి ఇంటి ప‌ట్టాలు అందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రాజ‌కీయ విమ‌ర్శ‌లు గుప్పించారు. ''రాష్ట్రంలో ఒక్క పేదవాడికీ చంద్రబాబు సెంటు స్థలం ఇవ్వలేదు. కానీ, మనం మంచి చేస్తుంటే కోర్టులకు వెళ్లి రాక్షసుల్లా అడ్డుకున్నారు. పేదలకు మంచి జరగకుండా కోర్టులో 1191 కేసులు వేశారు. చంద్రబాబు కుట్రలను అధిగమించి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం'' అని వ్యాఖ్యానించారు.

అసూయ‌తో ర‌గిలిపోతున్నారు!

వైసీపీ ప్ర‌భుత్వం పేద ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తుంటే.. టీడీపీ అధినేత‌ చంద్రబాబు అసూయ‌తో ర‌గిలిపోతున్నార‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువగా ఉంద‌న్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని.. చెబుతూ, కోర్టుల్లో కేసులు వేస్తున్నార‌ని తెలిపారు. ఇన్ని కుట్రలు చేసి కూడా చంద్రబాబు ఇంకా బరితెగించి రాజకీయాల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో త‌న పాల‌నా కాలంలో చంద్ర‌బాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని సీఎం జ‌గ‌న్ చెప్పారు

2014 ఎన్నిక‌ల‌కు ముందు చంద్రబాబు 650 హామీలిచ్చి 10 శాతం కూడా అమలు చేయలేదని సీఎం జ‌గ‌న్ దుయ్య‌బ‌ట్టారు. మ‌ళ్లీ ఇప్పుడు చంద్రబాబు నిసిగ్గుగా కొత్త మేనిఫెస్టో రూపొందించి ప్రజల ముందుకు వస్తున్నాడ‌ని, ఆయ‌నను, ఆయ‌న మేనిఫెస్టోను తిప్పి కొట్టాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా? అని సీఎం జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. చంద్రబాబులాంటి వారితో రాజకీయాలు భ్రష్టు పట్టాయన్నారు.

''ఏం మంచి చేశాడో చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏమీ లేవు. మనం సిద్ధం అంటుంటే చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేమంటున్నారు. కుప్పం నుంచే బైబై బాబు అంటున్నారు. చంద్రబాబును సమర్థించే వాళ్లు ఏపీలో లేని వాళ్లు మాత్రమే. చంద్రబాబు మాదిరి నాకు 'నాన్‌రెసిడెంట్స్‌ ఆంధ్రాస్‌'(ఓన్నార్ ఏ) మద్దతు లేదు. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా ఉండండి. దళారులు, బ్రోకర్లను నేను నమ్ముకోలేదు. దేవుడి ఆశీస్సులు, ప్రజలే నా నమ్మకం'' అంటూ..ప‌రోక్షంగా జ‌న‌సేన‌, కాంగ్రెస్‌ల‌పై కూడా సీఎం జ‌గ‌న్ విరుచుకుప‌డ్డారు.