Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కి ఎన్నిసార్లు పొలమారుతుందో?

మరోపక్క టీడీపీ నేతలు భవిష్యత్తుకు భరోసా అంటూ పథకాలను ప్రకటిస్తున్నారు. ఇదే సమయంలో అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు

By:  Tupaki Desk   |   9 Jan 2024 1:38 PM GMT
ఎన్టీఆర్ కి ఎన్నిసార్లు పొలమారుతుందో?
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే జనల్లోకి వెళ్తున్నాయి.. భారీ సభలు పెడుతున్నాయి.. ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాయి.. ఉచితానుచితాలు ప్రకటించేస్తున్నాయి.. హామీలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఈ సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలని టీడీపీ, మరోసారి అధికారం దక్కించుకోవాలని వైసీపీ ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా తాను ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానని, తన పాలనలో మార్పు కనిపిస్తే, తన పాలనలో మీ మీ కుటుంబాలకు మేలు జరిగితేనే తనకు ఓటు వేయండి అన్నస్థాయిలో జగన్ ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల బాగుకోసమే తాను పరితపించానని చెబుతున్నారు. ఇందులో భాగంగానే సీట్ల కేటాయింపులో కూడా సమూల మార్పులు చేస్తున్నారు.

మరోపక్క టీడీపీ నేతలు భవిష్యత్తుకు భరోసా అంటూ పథకాలను ప్రకటిస్తున్నారు. ఇదే సమయంలో అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో మాటకు ముందు, మాటకు తర్వాత నందమూరి తారకరమారావు పేరు స్మరిస్తున్నారు! గతకొన్ని రోజులుగా ఈ వ్యవహారం మరీ బలంగా వినిపిస్తుండటం గమనార్హం!

గతకొన్ని రోజులుగా జరుగుతున్న టీడీపీ బహిరంగ సభల్లో "జై ఎన్టీఆర్" అనే పేరు మారుమ్రోగిపోతుంది. దీంతో అధికార పార్టీలో ఉన్న అన్నగారి అభిమానులు ఫైరైపోతున్నారు. ఎన్నికల సమయంలో ఈ సందడి కామనే అని కామెంట్లు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అన్నగారు గుర్తుకు రారు.. ఎన్నికల సమయంలో మాత్రం ఆయన నామస్మరణతో టీడీపీ నేతలు మారు మ్రోగించేస్తారని అంటున్నారు.

మరోపక్క టీడీపీ సభలకు ఆయన ఫోటోలతో హాజరయ్యే జూనియర్ ఎన్టీఅర్ ఫ్యాన్స్ పై వరుసగా దాడులు జరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా జూనియర్ ఫ్యాన్స్ పై టీడీపీ కార్యకర్తలు చేసిన దాడులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ తీవ్ర వైవిద్యాల నడుమ తాజాగా నారా చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు.

అవును... కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగు వాడి ఆత్మగౌరవమే నినాదంగా పార్టీని స్థాపించి, అధికారంలోకి వచ్చి, మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన సంఘటనను చంద్రబాబు తలచుకున్నారు. నలభై ఒక్క ఏళ్ళ క్రితం 1983లో ఇదే రోజు నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా... "నలభై ఒక్క ఏళ్ళ క్రితం 1983లో ఇదే రోజు నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారు. దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. మళ్ళీ చరిత్ర పునరావృతం కావాలి. విధ్వంసకర పాలకుల పీడ నుంచి తెలుగు జాతి విముక్తిని పొంది ప్రపంచంలోనే అత్యున్నత స్థానాన్ని అందుకోవాలి. ఎన్టీఆర్ స్ఫూర్తిగా ఆ మహోదయం కోసం ఉద్యమిద్దాం" అని ట్వీట్ చేశారు చంద్రబాబు.

ఈ ట్వీట్ తో పాటు నాడు నందమూరి తారకరామారావు తన శ్రమతో, పాపులారిటీతో గెలిపించుకున్న టీడీపీ నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నప్పటి ఫోటోను షేర్ చేశారు! ఇలా ఎన్టీఆర్ పేరు మారుమ్రోగిపోతున్న వేళ నేటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా... ఎన్టీఆర్ కు ఈ ఎన్నికలు అయ్యేలోపు ఎన్నిసార్లు పొలమారుతుందో అని కామెంట్ చేస్తున్నారు!

కాగా తాజాగా షేర్ చేసిన ఎన్టీఅర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నప్పటి సమయంలోని ఫోటోలో చంద్రబాబు కనిపించరనే సంగతి తెలిసిందే. కారణమూ తెలిసిందే!!