ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ...ఎందుకింత అసహనం...?
ఇక శ్రీకాళహస్తి రోడ్ లో బాబు మాట్లాడుతూ ఎవడ్రా వాడు అంటూ ఏకంగా మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డినే పట్టుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 6 Aug 2023 7:00 AM ISTచంద్రబాబు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. ఏపీలోనే కాదు, దేశంలోనూ ఆయన సీనియర్లలో ఒకరు. అలాంటి చంద్రబాబు మూడు సార్లు సీఎం గా పనిచేశారు. మరో మూడు సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి పాతికేళ్ళకు పైగా ప్రెసిడెంట్ గా ఉన్నారు ఇలా చెపుకుంటూ పోతే చంద్రబాబు హిస్టరీ చాలా ఎక్కువే.
అలాంటి చంద్రబాబు హద్దులు మీరుతున్నారా అన్న చర్చ వస్తోంది. ఆయన వాడుతున్న భాష పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం అవుతోంది. పుంగనూరు రోడ్ లో బాబు అయితే నా కొడకల్లారా అంటూ హెచ్చరించినట్లుగా వార్తలు వచ్చాయి. ఇక శ్రీకాళహస్తి రోడ్ లో బాబు మాట్లాడుతూ ఎవడ్రా వాడు అంటూ ఏకంగా మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డినే పట్టుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుంగనూరు పుడింగి అంటూ ఎద్దేవా చేశారు.
ఇక మరో సీనియర్ మంత్రి బొత్సను పట్టుకుని వాడు వీడు అంటూ మాట్లాడినట్లుగా వార్తలు వచ్చాయి. చంద్రబాబు వంటి సీనియర్లు ఇలాంటి భాష మాట్లాడితే ఎలా అన్న చర్చ వస్తోంది. చంద్రబాబు ఎపుడూ హద్దులు దాటలేదు, నిజానికి బాబుకు ఉన్న ప్లస్ పాయింట్స్ లో సహనం సంయమనం గురించే అంతా చెబుతూ ఉంటారు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో అయిన బ్యాలెన్స్ తప్పలేదు.
కానీ బాబు ఇపుడే కొత్తగా కనిపిస్తున్నారు అని అంటున్నారు. మారిన రాజకీయమే బాబుని అలా చేయిస్తోంది అని అనే వారూ ఉన్నారు. కానీ బాబు వంటి సీనియర్ల నోట చిల్లర భాషను వినేందుకు ఆయన్ని అభిమానించే వారు సైతం సిద్ధంగా లేరు అని అంటున్నారు శ్రీ కాళహస్తి సభలో ఎమ్మెల్యే బియ్యపు మధ్సూదన రెడ్డి అనే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన ఇంటి పేరుని ఎద్దేవా చేస్తీ బియ్యపు రెడ్డి రెచ్చిపోతే బియ్యాన్ని ముక్క ముక్కలు చేసి పిండి కొట్టిస్తామని అనడం బాబు వంటి నేతకు తగునా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
మీరు ఒక కర్ర తీస్తే మేము రెండు కర్రలతో వస్తామని బాబు అనడం ఏ రకమైన ప్రజాస్వామ్య స్పూర్తి అన్నది కూడా చర్చకు వస్తోంది. నిజానికి ఏపీలో ఈ తరహా భాష గతంలో ఏ నాయకుడూ వాడలేదు, కానీ కొందరు నేతలు సంచలనం కోసమో మరో దానికో ఇలాంటి భాషను వాడుతున్నారు. దాంతో సోషల్ మీడియాలో కూడా అలాంటివి వైరల్ అవడంతో సీనియర్ నేతలు కూడా ఆ రూట్లోకి వెళ్తున్నారా అన్న వస్తోంది.
ఇక మీడియా ఫోకస్ కోసం కూడా రొడ్డకొట్టుడు రొటీన్ స్పీచులను పక్కన పెట్టి మసాలా భాషను వాడుతున్నారని అంటున్నారు. ఇవన్నీ పార్టీల పక్కన చేరిన వ్యూహకర్తల పేరిట కొందరు ఇస్తున్న సలహాలుగా కూడా అంటున్నారు. డబ్బిచ్చి మరీ స్ట్రాటజీస్ ని తీసుకుంటున్న క్రమంలో వారంతా సంచలనాలకే చూస్తారు. అపుడు ఆయా నేతలు ఎవరు అన్నది కూడా పక్కన పెట్టి ఇలాంటి భాషను వాడిస్తున్నారు అని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ తరహా భాష పట్ల ఇతర రాజకీయ పార్టీలు సైతం ఖండిస్తున్నాయి. ఏపీ సీపీఎం కార్యదర్శి వి శ్రీనివాసరావు వంటి వారు పుంగనూరు ఘర్షణలను ఖండిస్తూనే చంద్రబాబు భాష పట్ల అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. మొత్తానికి చంద్రబాబు ఇపుడే ఇలాంటి భాష వాడితే రేపు ఎన్నికల వేళ ఇంకా పదునెక్కిన భాషతో ముందుకు వస్తారా అన్న చర్చ అయితే ఉంది. ఇక ఆయన ఒక్కరనే కాదు అటు అధికార వైసీపీ నేతలు ఇతర రాజకీయ పార్టీలు కూడా వాడే భాష పట్ల శ్రద్ధ చూపించకపోతే మాత్రం మొత్తం తెలుగు రాజకీయమే అభాసు అవుతుందన్నది గుర్తుంచుకోవాలని అంటున్నారు.
