Begin typing your search above and press return to search.

స్టే కోసం హైకోర్టులో చంద్రబాబు క్రిమినల్ పిటిషన్ మెమొరాండం

తనపై ఎలాంటి నిర్దిష్ట ఆరోపణలు లేవని, రిమాండ్ రిపోర్టులోవి అసంబద్ధమైన విషయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   12 Sep 2023 10:43 AM GMT
స్టే కోసం హైకోర్టులో చంద్రబాబు క్రిమినల్ పిటిషన్ మెమొరాండం
X

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తరఫున ఏపీ హైకోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. సీఆర్పీసీ సెక్షన్ 482 కింద 20 పేజీల క్రిమినల్ పిటిషన్ మెమోరాండంను హైకోర్టులో చంద్రబాబు తరఫు లాయర్లు సమర్పించారు. తనను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడాన్ని సవాల్ చేస్తూ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని ఆ పిటిషన్ లో హైకోర్టును చంద్రబాబు కోరారు.

సరైన సాక్ష్యాధారాలు లేకుండా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని ఆరోపించారు. తన రిమాండ్ ఆదేశాలు సస్పెండ్ చేయాలని కోరారు. అంతేకాదు, ఈ కేసులో తదుపరి చర్యలపై స్టే విధించాలని చంద్రబాబు కోరారు. తనపై ఎలాంటి నిర్దిష్ట ఆరోపణలు లేవని, రిమాండ్ రిపోర్టులోవి అసంబద్ధమైన విషయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

రిమాండ్, స్పెషల్ కోర్టు చర్యలు చెల్లవని హైకోర్టు దృష్టికి చంద్రబాబు తరఫు లాయర్లు తీసుకెళ్లారు. ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ను పేర్కొన్నారు. మరోవైపు, చంద్రబాబు ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని, చంద్రబాబు రిమాండ్ రిపోర్టును సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ లను చంద్రబాబు తరఫు లాయర్లు హైకోర్టులో దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

అంతకుముందు, రాజమండ్రి సెంట్రల్ జైలులోని స్నేహా బ్లాక్ లో ప్రత్యేక సెల్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును హైకోర్టు న్యాయవాది ఎం.లక్ష్మీ నారాయణ కలిశారు. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించి పలు కీలక విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది. వారిద్దరూ దాదాపు 40 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు.

చంద్రబాబుకు కలవడానికి ముందు లోకేష్ తో లక్ష్మీ నారాయణ మాట్లాడారు. అయితే, చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత మీడియాతో మాట్లాడేందుకు లక్ష్మీనారాయణ నిరాకరించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. హైకోర్టులో చంద్రబాబు తరఫున దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్, క్వాష్ పిటిషన్ లపై మాట్లాడేందుకే ఆయన జైలుకు వచ్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు, ఈ రోజు చంద్రబాబును ఆయన సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి జైలులో ములాఖత్ కాబోతున్నారు. ములాఖత్ నేపథ్యంలో జైలు వద్ద ఆంక్షలు విధించారు.

ఇప్పటికే చంద్రబాబు అనుమతి లేకుండా ఆయన ఉన్న స్నేహా బ్లాక్ లోకి ఎవరినీ అనుమతించడం లేదు. కుటుంబ సభ్యులు ఆయనను కలిసేందుకు రావడంతో మరిన్ని ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా జైలు బయట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.