Begin typing your search above and press return to search.

బాబు గారు మరీ అంతలా గ్యారంటీ ఇవ్వాలా...?

By:  Tupaki Desk   |   4 Sep 2023 12:30 AM GMT
బాబు గారు మరీ అంతలా గ్యారంటీ ఇవ్వాలా...?
X

అక్కడ ఉన్నది చంద్రబాబు. ఆయన చాణక్యుడిని చంపి పుట్టిన వారు అని పేరు. అంటే అంతటి రాజనీతి, వ్యూహ రచనా చాతుర్యంలో ఘనత వహించారు అని అంటారు. ఎన్నో ఎన్నికలు చూసిన అనుభవం, ఎన్నో రాజకీయ యుద్ధాలను ఎదుర్కొన్న తీరు ఒక్క చంద్రబాబుకే సొంతం. అలాంటి బాబు ఈసారి ఎన్నికల విషయంలో ఎందుకో కంగారు పడుతున్నారు. ప్రజల విషయంలో ఆయన కొత్తగా ఆలోచిస్తున్నారు.

అంతే కాదు తాను ఇస్తున్న హామీల విషయంలో కూడా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంటున్నారు. అంతే కాదు తాను ఇస్తున్న హామీలను ప్రజలు ఏ మేరకు నమ్ముతున్నారు అన్నది కూడా ఆయన ఎప్పటికపుడు బేరీజు వేస్తున్నారు. బాబు మే నెలలో రాజమండ్రీలో జరిగిన మహానాడు మినీ మ్యానిఫేస్టోని రిలీజ్ చేశారు. దాని మీద బస్సు వేసి మరీ పార్టీ నాయకులను ప్రతీ నియోజకవర్గంలో తిప్పారు.

ప్రజలకు ఆ పథకాల గురించి వివరించే ప్రయత్నం చేశారు. ఇపుడు మరో గట్టి ప్రయత్నం చేస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 15 దాకా ఏకంగా నలభై అయిదు రోజుల పాటు ఏపీ అంతా పార్టీ నాయకులు తిరుగుతారు. ప్రతీ ఇంటినీ టచ్ చేస్తారు. మినీ మ్యానిఫేస్టోని వారికి ఇస్తారు. టీడీపీ వస్తే ఏమి చేస్తుందో చెబుతారు. అంతే కాదు చంద్రబాబు తనదైన సంతకంతో ముద్రించిన కరపత్రాన్ని ష్యూరిటీ గా ఒక గ్యారంటీగా ప్రజల చేతులలో పెడతారు.

అంటే చంద్రబాబు సంతకం పెట్టి ఇచ్చిన ప్రతీ ఒక్క హామీని వచ్చే ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా నెరవేరుస్తుంది అని గట్టి నమ్మకం జనంలో కలిగించేడమే దీని ఉద్దేశ్యం అని అంటున్నారు. మీ భవిష్యత్తుకు మా గ్యారంటీ అంటూ జరిపే ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు స్వీయ సంతకంతో ముద్రించిన హామీ పత్రాలు ప్రతీ ఇంటికీ చేరవేయబడతాయి.

అలా మూడు కోట్ల మందికి పైగా ప్రజలకు అవి అందించాలన్నది ఉద్దేశ్యంగా ఉంది. ఇది ఒక విధంగా టార్గెట్ గా పెట్టుకున్నారు. అందులో మెజారిటీ శాతాన్ని మహిళలను తమ వైపునకు తిప్పుకుంటే వచ్చే ఎన్నికల్లో విజయం తధ్యమని అంటున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు తన సంతకంతో గ్యారంటీ పత్రాలను ప్రతీ ఇంటికి ఎందుకు ఇవ్వాల్సి వస్తోంది అన్నది ఒక చర్చగా ఉంది.

బాబు వంటి వారు గత ఎన్నికల్లో హామీలు మాత్రమే ఇచ్చేవారు. వాటిని సభల ద్వారా చెప్పేవారు. జనాలు కూడా వాటిని చూసి ఓటు వేసేవారు. అయితే 2019 తరువాత పరిస్థితి మారిపోయింది. బాబు హామీలను జనాలు నమ్మడం లేదా అన్న ప్రశ్నలు తలెత్తాయి. పోలింగ్ కి దగ్గర చేసి మరీ బాబు రెండు విడతలుగా డ్వాక్రా మహిళల ఖాతాలో పసుపు కుంకుమ పేరిట పది వేల రూపాయల నగదు లక్షలాది మందికి ఇచ్చినా వారు ఓటేయలేదు. ఫలితంగా వైసీపీ బంపర్ మెజారిటీతో గెలిచింది.

దాంతో బాబు మాటలే తప్ప హామీలు అమలు చేయరని వైసీపీ సైతం విమర్శించడం ఆరంభించింది. దాంతో ఈసారి తాను చేతల మనిషిని అంటూ గ్యారంటీ ఇస్తూ బాబు సంతకం కూడా చేస్తున్నారు. మరి బాబు సంతకం చేసి ఇస్తున్న ఈ హామీలను జనాలు నమ్మి టీడీపీని గెలిపిస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు గతంలో చేయని అనేక ప్రయత్నాలను చేస్తున్నారు అని అంటున్నారు.