Begin typing your search above and press return to search.

బాబు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఓ రేంజిలో !

చంద్రబాబు. అనేక యుద్ధాలలో ఆరి తేరిన యోధుడు. ఆయన చూడని ఎన్నికలు లేవు, ఆయన వేయని ఎత్తులు లేవు

By:  Tupaki Desk   |   14 May 2024 7:25 PM IST
బాబు కాన్ఫిడెన్స్ లెవెల్స్  ఓ రేంజిలో !
X

చంద్రబాబు. అనేక యుద్ధాలలో ఆరి తేరిన యోధుడు. ఆయన చూడని ఎన్నికలు లేవు, ఆయన వేయని ఎత్తులు లేవు. ఆయన ఊహించని ప్లాన్స్ కూడా ఏమీ లేవు. చంద్రబాబుకు ఇది అక్షరాలా పదవ ఎన్నికల యుద్ధం. ఆయన 1978 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన టీడీపీలో చేరిన తరువాత అన్న ఎన్టీఆర్ కి చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీని ముందుకు నడిపించారు.

టీడీపీలో 1983 ఎన్నికలు తప్పించి ఆ తర్వాత వచ్చిన 1984 లోక్ సభ మొదలు 1985 అసెంబ్లీ నుంచి చూస్తే చంద్రబాబు ఎన్నికల వ్యూహాలలో ఏనాడో పండిపోయారు అని చెప్పాలి. అలా చంద్రబాబు 2024 ఎన్నికలలో కూడా తనదైన అనుభవాన్ని అంతా పండించారు. ఒక దారానిని పూసలు అన్నీ గుదిగుచ్చి నట్లుగా 2019లో ఎక్కడైతే ఓట్లూ సీట్లూ తగ్గించుకున్నారో అక్కడే రిపేర్లు చేస్తూ ఒక దండలా బాబు 2024 నాటికి తయారు చేశారు.

వైసీపీ వ్యతిరేక ఓట్లను ఏకం చేశారు. అనుకూల ఓట్లలో చీలిక తెచ్చారు. వైసీపీకి జై కొట్టిన వర్గాలను ఈసారి టీడీపీ కూటమి వైపు తిప్పుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతుని కూడా కూడగట్టారు. ఆరు నెలల పాటు చంద్రబాబు ఏపీ అంతా తిరుగుతూ చేసిన భీకరమైన ప్రచారమే టీడీపీ కూటమికి ఆక్సిజన్ అని చెప్పాలి.

ఇక పోలింగ్ రోజున జనాలు విరగబడి వచ్చారు. 81 శాతం పైగా పోలింగ్ జరిగినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. దీంతో భారీ పోలింగ్ ప్రభుత్వ వ్యతిరేకతకు సూచన అని టీడీపీ భావిస్తోంది. ఈ నేపధ్యంలో ఏపీలో వచ్చేది కూటమి ప్రభుత్వమే అని బాబు ఒకటికి పదిసార్లు ధీమాగా చెబుతున్నారు.

అంతే కాదు కొత్త ప్రభుత్వం వచ్చేంతవరకూ ఆపద్ధర్మ ప్రభుత్వం ఏపీలో ఏ చిన్న కార్యక్రమాలు చేయకుండా చూడాలని ఆయన నేరుగా గవర్నర్ కి లేఖ రాయడం రాజకీయ సంచలనంగా మారింది. జగన్ ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోయే ముందు తన సొంత కాంట్రాక్టర్లు బినామీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు రెడీ అవుతోందని దానికి అడ్డుకోవాలని చంద్రబాబు గవర్నర్ కి రాసిన లేఖలో కోరారు. ఏపీలో పధకాలకు నిధులు చెల్లించాల్సి ఉండగా అవి ఎన్నికల కోడ్ నిబంధనల వల్ల ఆగిపోయాయని ఇపుడు ఆ నిధులను తన సొంత బినామీలకు చెల్లించేందుకు వైసీపీ ప్రభుత్వం చూస్తోందని ఆయన పేర్కొన్నారు.

పూర్తిగా నిబంధలనకు విరుద్ధంగా ఈ బిల్లులకు నిధులను విడుదల చేస్తున్నారని దీనిని అడ్డుకోవాలని బాబు కోరడం విశేషం. ఎన్నికల కోడ్ ముందు కూడా బినామీ కాంట్రాక్టర్లకు నిధులను విడుదల చేశారని ఆయన గుర్తు చేశారు.

ఏపీలో అయిదేళ్ళు వైసీపీ ప్రభుత్వం పాలన సాగినా అంతా అప్పులతో నడుస్తోంది అని చంద్రబాబు విమర్శించారు. ప్రతీ రోజూ అప్పు తెచ్చి ప్రభుత్వాన్ని కొనసాగించారని ఆయన అన్నారు. ఈ కీలక సమయంలో కాంట్రాక్టర్లకు నిధులు చెలించకుండా అడ్డుకోవాలని ఆయన కోరారు. ఈ లేఖ ప్రతులను ఈసీ, ప్రభుత్వ సీఎస్ అలాగే ఆర్ధిక శాఖ కార్యదర్శికి కూడా పంపారు.

మొత్తం మీద చూస్తే జగన్ ప్రభుత్వం జూన్ 4తో గద్దె దిగడం ఖాయమని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. దాంతోనే ఆయన జగన్ నాయకత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం ఈ కొద్ది రోజులలో ఎలాంటి ఆర్ధిక పరమైన లావాదేవీలు జరపకుండా అడ్డుకోవాలని గవర్నర్ ని కోరారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరాక అన్ని విషయాల మీద సమీక్షించాలని కూడా చంద్రబాబు నిర్ణయించారు అని అంటున్నారు.