Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై మరోకేసు నమోదు... నేడు అత్యంత కీలకం!?

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు సుమారు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.

By:  Tupaki Desk   |   8 Nov 2023 5:30 AM GMT
చంద్రబాబుపై మరోకేసు నమోదు... నేడు అత్యంత కీలకం!?
X

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు సుమారు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుతో పాటు ఆయనపై మరికొన్ని కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్, అంగళ్లు అల్లర్లు, ఏపీ లిక్కర్ స్కాం, ఇసుక స్కాం... మొదలైన కేసులు ఇప్పటికే ఉన్నాయి. ఈ క్రమంలో మరోకేసు నమోదైంది.

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లు నుంచి మధ్యంతర బెయిల్ పై విడుదలైన చంద్రబాబుపై తాజాగా మరో కేసు నమోదైంది. ఇందులో భాగంగా... జైలు నుంచి విడుదలైన తర్వాత హైదరాబాద్ బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా నాడు రోడ్లపై జరిగిన న్యూసెన్స్ గురించి ఇప్పటికే కేసు నమోదైంది!

ఇదే సమయంలో... ఆరోజు ర్యాలీలో టీడీపీ శ్రేణులు రోడ్లపై న్యూసెన్స్ క్రియేట్ చేశారని, అంబులెన్స్ లకు కూడా దారి ఇవ్వలేదని హైకోర్టు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేయడంతో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్.హెచ్.ఆర్.సి.)లో చంద్రబాబుపై కేసు నమోదైంది. కాగా... ఇదే ర్యాలీపై ఇప్పటికే బేగంపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.

ఇసుక కేసులో హైకోర్టులో చంద్రబాబు పిటిషన్‌:

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక విధానం వల్ల రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లిందనే ఆరోపణతో చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదూ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. నేడు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

రాజకీయ కార్యకలాపాలకు తనను దూరంగా ఉంచాలని, న్యాయవిచారణ ప్రక్రియలో మునిగిపోయేలా చేయాలని, వేధించాలని ఈ కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్న చంద్రబాబు... ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తున్న తమ నోళ్లు మూయించాలనే కేసు పెట్టారని పేర్కొన్నారు.

స్కిల్‌ స్కాం కేసులో నేడు అత్యంత కీలకం!:

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఈ రోజు అత్యంత కీలక పరిణామం చోటుచేసుకోనుందని తెలుస్తుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ పై నేడు సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు! ఈ కేసులోనే చంద్రబాబు అరెస్టై సెప్టెంబర్‌ 09వ తేదీ నుంచి 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు.

క్వాష్‌ పిటిషన్‌ పై విచారణ సమయంలో.. "చంద్రబాబు అరెస్ట్‌ అక్రమమని, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ వర్తిస్తుందని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇది రాజకీయ కక్ష చర్యగా అభివర్ణించారు"! అయితే.. "స్కిల్‌ స్కాం 2015-16 సమయంలో జరిగిందని.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్‌ లేదని ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదించారు.

ఇలా సాగిన ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. నవంబర్‌ 20వ తేదీన క్వాష్‌ పిటిషన్‌ పై తీర్పు రిజర్వ్‌ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ సమయంలో... నవంబర్‌ 8వ తేదీన చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ పై తీర్పు వెల్లడిస్తామని ఇరుపక్షాలకు తెలిపింది! దీంతో... ఈ రోజు సుప్రీం తీర్పుపై తీవ్ర ఆసక్తి నెలకొంది!